సాక్షి, హైదరాబాద్: అది 1947 ఆగస్టు 15. పరాయి పాలన నుంచి విముక్తి పొంది దేశమంతా ఆనందోత్సాహాలతో పండగ జరుపుకొంటున్న వేళ. వినువీధుల్లో మువ్వన్నెల జెండా సగర్వంగా, సమున్నతంగా రెపరెపలాడిన తరుణం. ఆబాలగోపాలం స్వాతంత్య్ర వేడుకల్లో మునిగిపోయారు.
కానీ.. ఆ రోజు హైదరాబాద్‌లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేలింది. నగరవాసులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఎక్కడో ఒకచోట కొంతమంది దేశభక్తులు రహస్యంగా త్రివర్ణ పతాకలతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా జాతీయ జెండాలను ఎగురవేయలేదు.
నగరంలో కర్ఫ్యూ విధించినట్లుగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అప్పటికే నిజాం నియంతృత్వ పాలనలో మగ్గుతున్న జనం ఆశావహ దృక్పథంతో స్వాతంత్య్రం కోసం ఎదురుచూశారు.
శుక్రవారమూ ఓ కారణమే!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు శుక్రవారం. హైదరాబాద్‌కు అది సెలవు దినం. దాంతో నగరంలోని ప్రభు త్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కళాశాలలు మూసి ఉన్నాయి. వ్యాణిజ్య సంస్థలు కూడా మూసి వేయడంతో సాధారణంగానే జనసంచారం లేకుండా పోయింది. ‘ఒకవేళ అది వర్కింగ్ డే అయి ఉంటే వాతావరణం మరోలా ఉండేది. ఎందుకంటే అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతీయోద్యమ భావాలు వెల్లువెత్తాయి.
విద్యార్ధులు ఉద్యమాలు చేప ట్టారు. వందేమాతర ఉద్యమం పెద్ద ఎత్తున నడిచింది. బ్రిటిష్ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుగా నిలిచిన నిజాం వందేమాతర గీతాన్ని నిషేధించడంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఆ శుక్రవారం యూనివర్సిటీకి సెలవు కావడంతో విద్యార్థులు వేడుకలను నిర్వహించలేకపోయారు’ అని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డికి ఆమె చిన్నతనంలో తన తల్లి స్నేహలత చెప్పినట్లు గుర్తు చేశారు.
దక్కన్ రేడియో మూగనోము...
అప్పటికి హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య మైన ప్రసారమాధ్యమం దక్కన్ రేడియో. ఆ రోజు యథావిధిగా అన్ని రకాల కార్యక్రమాలను ప్రసారం చేశా రు. కానీ స్వాతంత్య్ర వేడుకలను గురించి ఒక్క మాటైనా రేడియోలో ప్రస్తావించకపోవడం గమనార్హం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకలను దక్కన్ రేడియో ప్రసారం చేయలేదు. దీంతో నగరవాసులు ఆల్ ఇండియా రేడి యో, బీబీసీ రేడియోలను ఆ శ్రయించారు.
‘ఆ రోజు మా అమ్మ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లారట. కానీ అక్క డా ఎలాంటి సందడి లేదు. కొద్దిమంది ప్రయాణికులు తప్ప రైల్వేస్టేషన్ చాలా వరకు నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పినట్లు అనురాధ గుర్తు చేశారు. అదే సమయంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, ఆర్యసమాజ్‌ల ఆధ్వర్యంలో మాత్రం సికింద్రాబాద్, నారాయణగూడలలో కొద్దిమంది నాయకులు త్రివర్ణ పతాకలను ఎగురవేశారని ఆమె పేర్కొన్నారు.
(చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం )
Comments
Please login to add a commentAdd a comment