హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో కలిసి ఏర్పాటు
ఇతర ఎఫ్‌ఎం రేడియోలకు దీటుగా అందుబాటులోకి
వినోదంతో పాటు వివిధ అంశాలపై అవగాహన
వెల్లడించిన పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి
సాక్షి, సిటీబ్యూరో: ‘గుడ్ మారి్నంగ్ హైదరాబాద్...’ త్వరలో నగర పోలీసుల నోటి వెంట ఇలాంటి మాట వినిపించనుంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్‌సీఎస్సీ) కలిసి సిటీ పోలీసు విభాగం ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేయనుండటమే దానికి కారణం. ఇతర ఎఫ్‌ఎం రేడియోలకు దీటుగా, అన్ని హంగులతో త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి బుధవారం ప్రకటించారు.
నగర పోలీసు విభాగానికి ఇప్పటి వరకూ సొంతంగా ఎలాంటి రేడియో లేదు. అయితే కొన్నేళ్లుగా వివిధ ఎఫ్‌ఎం రేడియోలతో పాటు ఇతర మీడియా సంస్థలతో కలిసి పని చేస్తున్నారు. బోనాలు, గణేష్ ఉత్సవాలు వంటి కీలక ఘట్టాలతో పాటు సున్నితాంశాల పైనా ప్రజల్లో అవగాహన కలి్పంచడానికి ఈ వేదికల్ని వాడుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ జామ్స్, రద్దీ రోడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎఫ్‌ఎం రేడియోలకు అందిస్తున్న ట్రాఫిక్ విభాగం అధికారులు ఆ వివరాలను వారి ద్వారా శ్రోతలకు చేరుస్తున్నారు.
ఇప్పటి వరకూ కేవలం వారికే..
కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు 2019 అక్టోబర్‌లో ఓ కమ్యూనిటీ రేడియోను ఏర్పాటు చేశారు. అందులో వినోద భరిత కార్యక్రమాలతో పాటు ఖైదీలకు ఉన్న హక్కులు, పెరోల్ నిబంధనలు తదితరాలను ప్రచారం చేస్తున్నారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ సెంట్రల్ జైలు అధికారులు సైతం 2021 డిసెంబర్‌లో ఓ రేడియోను ప్రారంభించారు. ఈ రెండూ ఖైదీల ఆధ్వర్యంలో నడిచేవే కావడం గమనార్హం. ఇండియన్ ఆర్మీ సైతం ఉత్తర కాశ్మీర్‌లో తొలి రేడియో స్టేషన్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బారాముల్లా, ఉరి సెక్టార్లలో రెండింటికి విస్తరించింది.
వినోదంతో పాటు అవగాహన..
నగర పోలీసు విభాగం ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ రేడియో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు హెచ్‌సీఎస్సీతో కలిసి రూపుదిద్దుతున్నారు. ఈ రేడియోలు పాటలు వంటి వినోదభరిత కార్యక్రమాలకు సమప్రాధాన్యం ఇస్తారు. దీంతో పాటు నగరవాసులకు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా ట్రాఫిక్ నిబంధనలు, స్థితిగతులు, రోడ్డు భద్రత అంశాలకు పెద్దపీట వేసేలా తమ కమ్యూనిటీ రేడియో ఉండనుందని కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ రేడియో నిర్వహణ బాధ్యతల్ని హెచ్‌సీఎస్సీ చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment