
న్యూఢిల్లీ: 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం జాతినుద్దేశించి మొట్టమొదటిసారిగా ప్రసంగించనున్నారు. ఆమె ప్రసంగం రాత్రి 7 గంటలకు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)తోపాటు, దూరదర్శన్ అన్ని చానళ్లలో హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారమవుతుందని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
అనంతరం ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రాంతీయ చానళ్లు ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తాయని వివరించింది. ఏఐఆర్ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రాంతీయ నెట్‌వర్క్‌ల ద్వారా రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయనుందని పేర్కొంది. ఒడిశాకు చెందిన ముర్ము జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.