
2016 నవంబర్ 8 అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. అవినీతిపై పోరాడేందుకు, నల్లధనం సమస్యను పరిష్కరించేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చేసిన ఆ అకస్మాత్తు ప్రకటన దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. కొన్ని నెలల పాటు ప్రజా జీవితం స్తంభించిపోయింది. ఆరోజు జాతిని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడం తోపాటు, కొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి తెస్తున్నట్లు వెల్లడించారు.
ఉగ్రవాదులకు ఆర్థిక వనరుగా మారిన దొంగనోట్ల మాఫియాను, దేశంలోని నల్లధనాన్ని నియంత్రించేందుకు నోట్లను రద్దు చేసినట్లు తెలిపారు. నోట్ల రద్దు ప్రకటన అనంతరం దేశవ్యాప్తంగా నవంబర్ 9, 10 తేదీలలో ఏటీఎం లను, అన్ని బ్యాంకులను మూసి ఉంచారు. పాత పెద్ద నోట్లను కొత్తవాటితో మార్చుకునేందుకు 2016 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అనంతరం ఆ గడువును 2017 మార్చి 30 వరకు పొడిగించారు.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- జయలలిత, చో రామస్వామి, ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్, నాయని కృష్ణకుమారి, పరమేశ్వర్ గోద్రెజ్.. కన్నుమూత
- పార్లమెంటులో జి.ఎస్.టి. బిల్లుకు ఆమోదం.
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 26 ఏళ్ల దళిత పిహెచ్.డి. స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య.
- అత్యంత వేగంగా ప్రయాణించే ‘గతిమాన్ ఎక్స్‌ప్రెస్’ రైలు ఢిల్లీ ఆగ్రాల మధ్య ప్రారంభం.