సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వాన నీటిని ఒడిసిపట్టేందుకు ప్రభుత్వం చెరువులకు ఊపిరిపోస్తోంది. ఇప్పటికే ఉన్నవాటికి మరమ్మతులు చేయడం.. అవసరమైతే కొత్తవి నిర్మించడానికి పూనుకుంది. కేంద్ర జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా ‘క్యాచ్ ది రెయిన్’ (వర్షపు నీటిని ఒడిసిపడదాం) పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఉండే అన్ని రకాల చెరువుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.
వాగుల మధ్య చెక్ డ్యాంలను నిర్మించి కనీసం ఎకరం విస్తీర్ణంలో నీటిని నిల్వ ఉంచే అవకాశం ఉన్నవి మొదలుకొని మైనర్ ఇరిగేషన్ విభాగం పరిధిలో ఉండే పెద్దపెద్ద చెరువులను ఒక్కొక్క వాటర్ బాడీ (నీటిని నిల్వ ఉంచే చెరువు)గా వర్గీకరించగా.. అలాంటివి మొత్తం 1,90,726 ఉన్నట్లు గుర్తించారు. ప్రతీ వాటర్ బాడీ ఎంత విస్తీర్ణంలో ఉందన్న సమాచారంతో పాటు రేఖాంశాలు, అక్షాంశాలతో కూడిన శాటిలైట్ గణాంకాల ప్రకారం అధికారులు జియో ట్యాగింగ్ చేశారు. ఆ వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచారు.
ఇక రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలతో పాటు 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీ, నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే ప్రతి ఊరిలో సరాసరి 10–14 వరకు ఈ తరహా చెరువులున్నాయి. అత్యధికంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే 50 వేల వరకు ఉండగా, అత్యల్పంగా ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలో నాలుగేసి వేలకు లోపునే ఉన్నాయి.
ప్రస్తుతం పురోగతిలో 74,722 పనులు
ఇక రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చెరువులను సద్వినియోగం చేసుకునేందుకు వీలైనంత ఎక్కువ మొత్తంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో అన్ని శాఖలకు సంబంధించి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా మొత్తం రూ.3,970 కోట్లతో వర్షపు నీటి నిల్వకు ఉపయోగపడే పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. చెరువుల్లో పూడికతీత, చెరువు కట్టలు బలోపేతం, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు చేపట్టడం వంటి 74,722 పనులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు తెలిపారు.
అమృత్ సరోవర్లలో రాష్ట్రం రెండోస్థానం..
భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ‘అమృత్ సరోవర్’ పేరిట వచ్చే ఏడాది కాలంలో ప్రతి జిల్లాలో కనీసం 75 చెరువుల చొప్పున కొత్తవి ఏర్పాటుచేయడం.. లేదా పాతవాటిని అభివృద్ధి చేయడం చేయాలని.. వీటిలో 20 శాతం మేర ఈ ఆగస్టు 15కే పూర్తిచేయాలని రాష్ట్రాలకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించింది. వీటిలో ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువగా అంటే 519 చెరువులను అభివృద్ధిచేసి దేశంలోనే రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు వెల్లడించారు.
చెరువులకు చేవ!
Published Sun, Aug 14 2022 4:12 AM | Last Updated on Sun, Aug 14 2022 2:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment