జమ్మూ కశ్మీర్‌లో 2019 ఫిబ్రవరి 14 న పాకిస్థాన్ ముష్కరులు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతికి దాడికి తెగబడ్డారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆ బాంబు దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కి చెందిన 40 మంది సైనికులు బలయ్యారు. జమ్మూ– శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపుర (అవంతిపురా సమీపం) లో ఆ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘాతుకం చోటుచేసుకుంది.
జమ్మూ నుంచి సైనికులు శ్రీనగర్‌కు వెళ్తుండగా ముష్కరులు మాటువేసి ఘాతానికి పాల్పడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో 10 మందికి పైగా మిలిటెంట్లు హతమయ్యారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ దాడికి తామే బాధ్యులమంటూ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు గుణపాఠం చెప్పాలని భావించిన భారత్.. ఫిబ్రవరి 26న తెల్లవారుజామున సరిహద్దులు దాటి పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. 40 ఏళ్ల తర్వాత పాక్ భూభాగంలోకి భారత్ యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లడం ఇదే తొలిసారి. మరోవైపు.. పుల్వామా దాడికి తామే కారణమంటూ.. ఇది పాక్ ప్రజల విజయమని ఆ దేశ మంత్రి ఫవద్ ఛౌధురీ ఆ తర్వాతి ఏడాది జాతీయ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడంతో పాక్ కుట్ర తేటతెల్లమయ్యింది.
ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు
- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి.
- పాకిస్థాన్‌కి పట్టుబడి, విడుదలైన ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్.
- యాంటీ శాటిలైట్ మిస్సైయిల్ కలిగిన నాలుగో దేశంగా భారత్.
- చంద్రయాన్ 2 ని ప్రయోగించిన భారత్.
- కోడి రామకృష్ణ, మనోహర్ పారికర్, వింజమూరి అనసూయాదేవి, రాళ్లపల్లి, గిరీశ్ కర్నాడ్,
- షీలా దీక్షిత్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, రామ్ జఠ్మలానీ, వేణమాధవ్.. కన్నుమూత.
(చదవండి: మహోజ్వల భారతి: నంబర్ 1 స్టూడెంట్ )
Comments
Please login to add a commentAdd a comment