మిషన్‌.. స్వదేశీ | Funday Cover Story About 75 Years Independence Day Special | Sakshi
Sakshi News home page

75 Years Of Indian Independence: మిషన్‌.. స్వదేశీ

Published Sun, Aug 14 2022 10:28 AM | Last Updated on Sun, Aug 14 2022 10:57 AM

Funday Cover Story About 75 Years Independence Day Special - Sakshi

భారత స్వాతంత్య్ర పోరాటం జోరందుకుంటున్న తరుణమది. తెల్లదొరలు అడ్డగోలుగా చేసిన బెంగాల్‌ విభజనను వ్యతిరేకిస్తూ 1905లో విదేశీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ ఉద్యమం పెల్లుబికింది. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి  ప్రజలు ముందుకొచ్చారు. తదనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా వంటి ఉద్యమాలకు స్వదేశీ నినాదమే పట్టుగొమ్మగా నిలిచింది. ఈ ఉద్యమాలు అప్పటి ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్వదేశాగ్నిని రగిలించడంతో.. దేశంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పురుడుపోసుకున్నాయి.

‘మేడిన్‌ ఇండియా’ బ్రాండ్లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పురోభివృద్ధి సాధిస్తున్నాయి. మరికొన్ని కాలానుగుణంగా కొత్త మార్పులను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన భారత్‌కు చేదోడుగా నిలుస్తున్నాయి. శతాబ్ది స్వాతంత్య్ర వేడుకల నాటికి ‘స్వదేశ్‌ 2.0’తో దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్నది ‘మేకిన్‌ ఇండియా’ లక్ష్యం. దీని సాకారానికి ‘ఆత్మనిర్భర్‌‘తో సమాయత్తమవుతున్న వేళ... 1947కు పూర్వం మొగ్గతొడిగిన మన స్వదేశీ వ్యాపారామృతాల్లో కొన్నింటి గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెమరువేసుకుందాం. 

బ్యాంకింగ్‌లో ‘పంజా’బ్‌! 


స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్‌ కేసరి లాలా లజపతి రాయ్‌.. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలంటే స్వదేశీ సంస్థల ఏర్పాటుతోనే సాధ్యమని భావించారు. మన దేశ సంపదను బ్రిటిష్‌ బ్యాంకులు, కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేయాలంటే.. మనకంటూ ఒక భారతీయ బ్యాంక్‌ ఉండాలనుకున్నారు. అలా ఆవిర్భవించిందే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్‌.. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).

1895 ఏప్రిల్‌ 12న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి బ్రాంచ్‌లో మొదటి బ్యాంక్‌ అకౌంట్‌ను తెరిచిన వ్యక్తి లాలా లజపతి రాయ్‌. మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి స్వరాజ్య సారథులు సైతం ఈ బ్యాంకు ఖాతాదారులుగా మారారు. భారత్‌లో టెల్లర్‌ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్‌ (1944లో) కూడా ఇదే.

దేశ విభజనను ముందే పసిగట్టిన అప్పటి పీఎన్‌బీ సారథి లాలా యోద్‌ రాజ్‌..  బ్యాంక్‌ రిజిస్టర్డ్‌ ఆఫీసును లాహోర్‌ నుంచి ఢిల్లీకి తరలించారు. విభజన తర్వాత పశ్చిమ పాకిస్థాన్‌లోని 92 బ్రాంచ్‌లను పీఎన్‌బీ మూసేసింది. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడంతో పీఎన్‌బీ ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. సంక్షోభాలు, కుంభకోణాలు ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తన స్వదేశీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది.

ఇంట్లో బీరువా.. ఇంటికి తాళంకప్ప..  ఒంటికి సబ్బు!


స్వదేశీ ఉద్యమ నినాదం మార్మోగుతున్న వేళ పారిశ్రామికవేత్త అర్దేశిర్‌ గోద్రెజ్‌.. సబ్బుల తయారీలో ‘స్వదేశీ‘ సత్తా ఏంటో చాటుతామని ప్రతినబూనారు. 1918లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెజిటబుల్‌ ఆయిల్‌తో స్నానపు సబ్బు ‘చావీ’ని తయారు చేసి రికార్డు సృష్టించారు. తొలుత నం. 2, తర్వాత నం.1 పేర్లతో ఈ బ్రాండ్‌లో సబ్బులు ప్రవేశపెట్టారు. ఈ స్వదేశీ సబ్బులకు రాజగోపాలాచారి, రవీంద్రనాథ్‌ టాగోర్‌ వంటి దిగ్గజాలు ప్రచారం చేయడం విశేషం.

ఇక 1920 చివర్లో వచ్చింది గోద్రెజ్‌ ‘వత్‌నీ’! దీనికి అర్థం ‘వతన్‌ సే’.. అంటే ‘మాతృభూమి నుంచి’ అన్నమాట! వందేళ్ల తర్వాత కూడా నం.1 బ్రాండ్‌ ఉండటమే కాకుండా, ఏటా 38 కోట్లకు పైగా సబ్బులు అమ్ముడవుతున్నాయి. 1897లో సోదరుడితో కలసి గోద్రెజ్‌ అండ్‌ బోయ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు అర్దేశిర్‌. మొదట్లో తాళాలు, సేఫ్‌లు, సెక్యూరిటీ పరికరాలను తయారు చేసేవారు. అంతేకాదు 1951లో జరిగిన తొలి భారత సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్‌ బాక్సులను తయారు చేసిందీ గోద్రెజే కావడం విశేషం. అప్పట్లో ఇంట్లో గోద్రెజ్‌ బీరువా, ఇంటికి గోద్రెజ్‌ తాళంకప్ప.. ఈ ఉత్పత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఫర్నిచర్‌ నుంచి కన్‌స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, గృహోపకరణాలు, ఇన్ఫోటెక్, ఏరోస్పేస్‌.. ఇలా 15 రంగాలకు పైగా విస్తరించి ఆత్మనిర్భర్‌ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది గోద్రెజ్‌.

షర్బత్‌ అంటే.. రూహ్‌ అఫ్జా!
స్వాతంత్య్రోద్యమ కాలంలో పక్కా మేడిన్‌ ఇండియా బ్రాండ్‌గా ఆవిర్భవించింది ‘హమ్‌దర్ద్‌’. 1906లో హకీమ్‌ హఫీజ్‌ అబ్దుల్‌ ఢిల్లీలో ఈ యునానీ ఫార్మాస్యూటికల్‌ కంపెనీని నెలకొల్పారు. ఆ తర్వాత అది తన విలక్షణ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ చిరపరిచితంగా మారిపోయింది. షర్బత్‌ అంటే ‘రూహ్‌ అఫ్జా’ అనేంతగా ప్రాచుర్యం సంపాదించింది. అనేక యునానీ ఔషధాలనూ ఇది విక్రయిస్తోంది. హఫీజ్‌ మరణానంతరం కుమారుడు హకీమ్‌ అబ్దుల్‌ హమీద్‌తో కలసి భార్య రబియా బేగమ్‌ ఈ వ్యాపారాన్ని ఏమాత్రం రుచి తగ్గకుండా కొనసాగిస్తూ.. భారతీయుల మదిలో సుస్థిర స్వదేశీ బ్రాండ్‌గా నిలబెట్టారు.

ఉద్యమానికి స్ట్రాంగ్‌ ‘చాయ్‌!’
స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో చాలా టీ ఎస్టేట్‌లు ఉన్నా.. వాటిని బ్రిటిషర్లు తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పీసీ ఛటర్జీ.. ఈ దుస్థితిని గమనించి.. తన వ్యాపారానికి సరికొత్త స్వదేశీ ‘రుచి’ని అందించాలని నిర్ణయించారు. ఆ విధంగా కోల్‌కతా కేంద్రంగా 1912లో లక్ష్మీ టీ కంపెనీ ఆవిర్భవించింది. కింగ్‌ ఆఫ్‌ పంజాబ్‌ – రాజా సింగ్‌ బ్లెండ్‌ నుంచి.. క్వీన్‌ ఎలిజబెత్‌ బ్లెండ్‌ వరకూ లక్ష్మీ టీ తన ప్రతి ఉత్పత్తిలోనూ చరిత్రను పెనవేసుకునేలా చేసింది. విఖ్యాత డార్జిలింగ్‌ టీతో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఎస్టేట్లు లక్ష్మీ గ్రూప్‌ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా టీ ఎగుమతులు చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ టీ బ్రాండ్‌లకు తేయాకు సరఫరా చేసేది ఇదే. ఏటా 3 కోట్ల కేజీల టీ ఉత్పత్తి చేస్తూ.. స్వదేశీ ఘుమఘుమలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది.

మన ‘చెప్పు’చేతల్లో...!
మెట్రో షూస్‌.. ముంబైలోని ఒక చెప్పుల షాపులో సేల్స్‌మన్‌గా పనిచేసిన మాలిక్‌ తేజానీ.. దేశ విభజనలో ఆ షాపు యజమానులు పాకిస్థాన్‌ వెళ్లిపోవడంతో 1947లో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి దాన్ని కొన్నారట. అప్పటి బొంబాయి నగరంలో పేరొందిన మెట్రో సినిమా దగ్గర్లో ఉండటంతో దానికి మెట్రో షూస్‌గా పేరు పెట్టారు. ఆయన తదనంతరం 16 ఏళ్ల వయసులో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు రఫీక్‌ తేజానీ.. అంచెలంచెలుగా దాన్ని దేశ ప్రజలకు ప్రియమైన పాదరక్షల బ్రాండ్‌గా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీకి సీఈఓగా ఉన్న మాలిక్‌ మనుమరాలు ఫరా మాలిక్‌ భాంజీ దీన్ని మెట్రో బ్రాండ్స్‌ పేరుతో స్టాక్‌ మార్కెట్లో కూడా లిస్టింగ్‌ చేసి, తనదైన నడకలు నేర్పుతూ ముందడుగు వేస్తున్నారు.

డెనిమ్‌ కింగ్‌.. అరవింద్‌ 
దేశంలో 1897లోనే లాల్‌భాయ్‌ దల్‌పత్‌ భాయ్‌ సారస్‌పూర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ పేరుతో అహ్మదాబాద్‌లో టెక్స్‌టైల్‌ మిల్లును స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయన కుమారుడు లాల్‌భాయ్‌.. కుటుంబ సభ్యులు కస్తూర్‌భాయ్, నరోత్తమ్‌భాయ్, చిమన్‌భాయ్‌ 1931లో మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమం పిలుపుతో.. అరవింద్‌ మిల్స్‌ను అధునాతన సాంకేతికతతో నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం స్పీడు పెంచిన ఈ కంపెనీ.. 1980లో యువతకు భారతదేశపు తొలి డెనిమ్‌ (జీన్స్‌ క్లాత్‌) వస్త్ర బ్రాండ్‌ ఫ్లయింగ్‌ మెషిన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద డెనిమ్‌ ఫ్యాబ్రిక్‌ తయారీదారుగా నిలుస్తోంది. అంతేకాదు, 2015లో తొలిసారిగా ఖాదీ డెనిమ్‌ను తీసుకొచ్చి స్వదేశీ వారసత్వాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అరవింద్‌.. టెక్స్‌టైల్స్‌తో పాటు రియల్టీ, రిటైల్‌ తదితర రంగాల్లోకీ విస్తరించింది. అరవింద్‌ తయారు చేసిన ఫ్యాబ్రిక్‌తో భూమిని 6 సార్లు చుట్టేసి రావచ్చట!!

చెదపట్టని ‘ఎస్‌ చంద్‌!’


దేశంలో విదేశీ పుస్తకాలకు బదులు.. భారతీయ రచయితలు, విద్యావేత్తలు రాసిన అచ్చమైన స్వదేశీ పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఆవిర్భవించినదే.. ఎస్‌ చంద్‌. 1939లో శ్యామ్‌లాల్‌ గుప్తా ఈ పబ్లిషింగ్‌ సంస్థను ప్రారంభించారు. ప్రొషెసర్‌ బహల్‌ అండ్‌ తులి రాసిన ‘టెక్ట్స్‌బుక్‌ ఆఫ్‌ ఫిజికల్‌ కెమిస్ట్రీ’ అనేది ఎస్‌ చంద్‌ పబ్లిష్‌ చేసిన తొలి టెక్ట్స్‌బుక్‌. దేశంలోని బోర్డు స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీ పరీక్షల్లో కోట్లాది విద్యార్థులకు ఎస్‌ చంద్‌ పుస్తకాలు చిరపరిచితమే. విద్యా రంగంలో పుస్తకాలకు ఎస్‌ చంద్‌ పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఏటా 5 కోట్ల టెక్ట్స్‌పుస్తకాలను విక్రయిస్తున్న ఈ 80 ఏళ్ల మేడిన్‌ ఇండియా బ్రాండ్‌.. పుస్తక ప్రపంచంలో ఇప్పటికీ తన స్థానానికి చెద పట్టనివ్వకుండా రెపరెపలాడుతోంది.

వాహ్‌ తాజ్‌! 


దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెబితే పర్యాటకులకు టక్కున గుర్తొచ్చేది తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌! అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం అప్పట్లో ముంబైలో ప్రసిద్ధి చెందిన వాట్సన్‌ లగ్జరీ హోటల్‌లోకి (దీని మొదటి యజమాని బ్రిటిషర్‌ జాన్‌ వాట్సన్‌) అడుగుపెట్టే భారతీయులను చాలా చిన్న చూపు చూసేవారట. దీంతో టాటా గ్రూప్‌ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా ఎలాగైనా మనకు కూడా యూరోపియన్‌ ప్రమాణాలకు దీటుగా ఒక లగ్జరీ హోటల్‌ ఉండాలనుకున్నారు. ఆ స్వదేశీ కాంక్షతోనే 1902లో ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీని స్థాపించి, 1903లో తాజ్‌ మహల్‌ ప్యాలెస్‌ హోటల్‌ కట్టారు. తాజ్‌ హోటల్‌ దెబ్బకు ప్రభ కోల్పోయిన వాట్సన్‌ను 1944లో ఇండియన్‌ హోటల్స్‌ కొనుగోలు చేయడం విశేషం (తర్వాత 1980లలో దీన్ని అమ్మేసింది). 1984లో లండన్‌లోని సెయింట్‌ జేమ్స్‌ కోర్ట్‌ హోటల్‌ను చేజిక్కించుకుని బ్రిటిష్‌ కోటలో పాగా వేసింది. ఇండియన్‌ హోటల్స్‌ నేడు ప్రపంచవ్యాప్తంగా 80 నగరాల్లో 196కు పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. అది ‘అరబిక్‌ కడలందం’గా నిలుస్తూ వాహ్‌ తాజ్‌ అనిపిస్తోంది!!

టాటాల ‘ఉప్పు’ తింటున్నాం..!
1868లో 29 ఏళ్ల జంషెడ్‌జీ నుసర్‌వాన్‌జీ టాటా రూ.21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్‌ కంపెనీగా ప్రారంభించిన టాటా గ్రూప్‌.. నేడు ఆకాశమే హద్దుగా భారత్‌కు వ్యాపార జగత్తులో ఖండాతర ఖ్యాతిని తీసుకొచ్చింది. 1907లో జంషెడ్‌పూర్‌లో ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ప్లాంట్లలో ఒకటిగా టాటా స్టీల్‌ను నెలకొల్పి జంషెడ్‌జీ టాటా కలలను సాకారం చేశారు ఆయన తనయుడు సర్‌ దొరాబ్జీ టాటా. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి, భాక్రానంగల్, దామోదర్‌ వ్యాలీ కార్పొరేషన్‌ వంటి బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టులు, కాండ్లా పోర్టు, చండీగఢ్‌ నగర నిర్మాణాలకు ‘స్టీలెత్తిన’ కంపెనీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ టాప్‌–10 స్టీల్‌ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న టాటా స్టీల్‌.. 2006లో అంగ్లో–డచ్‌ కంపెనీ కోరస్‌ను ఏకంగా 8.1 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటిషర్లకు స్వదేశీ ‘ఉక్కు’ సంకల్పం అంటే ఏంటో చాటిచెప్పింది. 1910లో టాటా హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ సప్లై కంపెనీగా ఆవిర్భవించిన టాటా పవర్‌ నేడు దేశానికి విద్యుత్‌ వెలుగులు అందిస్తోంది.

1929లో టాటా ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పి భారతీయుల ఆర్థిక స్వేచ్ఛా కలను వినువీధిలో విహరింపజేశారు జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌ (జేఆర్‌డీ) టాటా. 1946లో ఎయిర్‌ఇండియాగా పేరుమార్చుకుని, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం చెంతకు చేరినా.. తాజాగా మళ్లీ టాటాల గూటికే వచ్చి వాలింది ఈ లోహ విహంగం! ఇక హమామ్‌ బ్రాండ్‌ సబ్బు 1931లో టాటాలు తీసుకొచ్చిందే. ‘దేశ్‌ కా నమక్‌’గా పేరొందిన టాటా సాల్ట్‌ తయారీ సంస్థ టాటా కెమికల్స్‌ 1939లో ఆవిర్భవించింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్‌ ఐయొడైజ్డ్‌ ఉప్పును ప్రవేశపెట్టింది.

1945లో టాటా ఇంజినీరింగ్‌ అండ్‌ లోకోమోటివ్‌ కంపెనీ (టెల్కో)గా ఆరంభమైన టాటా మోటార్స్‌.. 2008లో బ్రిటిష్‌ ఐకానిక్‌ లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ను చేజక్కించుకుని మన సత్తాను చాటింది. ఐటీ రంగంలో దేశానికి మణిమకుటంగా వెలుగొందుతోంది టీసీఎస్‌. 150 ఏళ్ల చరిత్రతో ఉప్పు.. పప్పు నుంచి సాఫ్ట్‌వేర్‌ వరకు 30కి పైగా కంపెనీలతో మిషన్‌ స్వదేశీకి మూలస్తంభంగా నిలుస్తోంది టాటా.

టీవీ‘ఎస్‌!’


1911లో టీవీ సుందరం అయ్యంగార్‌ స్థాపించిన టీవీఎస్‌ గ్రూప్‌.. మొదట సదరన్‌ రోడ్‌వేస్‌ పేరుతో బస్సులు, ట్రక్కుల ట్రాన్స్‌పోర్ట్‌ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటి 2 సీట్ల మోపెడ్‌ (టీవీఎస్‌ 50)ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వివిధ విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీల భాగస్వామ్యంతో ద్వి, త్రిచక్ర వాహన రంగంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. ఇప్పుడిది ఆటోమొబైల్, ఏవియేషన్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఫైనాన్స్‌ వంటి రంగాల్లో అనేక  కంపెనీలతో స్వదేశీ బహుళజాతి కంపెనీగా ఎదిగింది. టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ పేరుతో మోపెడ్‌ రంగంలో ఇప్పటికీ ఈ కంపెనీ.. ఒకే ఒక్కడుగా చక్రం తిప్పుతోంది.

స్వరాజ్య చరిత్రను లిఖించిన మన ‘రత్నం!’
స్వాత్రంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందిస్తే.. ఆ చరిత్రను లిఖించేందుకు తన సిరాను చిందించి.. అసలు సిసలు స్వదేశీ ‘రత్నం’గా నిలిచింది మన పెన్ను! 100% స్వదేశీ సిరా పెన్ను తయారు చేయాలన్న గాంధీజీ పిలుపుతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం 1932లో ‘రత్నం పెన్స్‌’ సంస్థను స్థాపించారు. 1935లో మహాత్మా గాంధీ రాజమండ్రి రైల్వే స్టేషన్‌లో ఆగినప్పుడు స్వయంగా తమ సంస్థలో తయారైన పెన్నును ఆయనకు బహూకరించారట. ఈ ఫౌంటెన్‌ పెన్నులతో దాదాపు 31 వేల ఉత్తరాలను గాంధీజీ రాశారని ఆయన వారసులు చెబుతారు.

అంతేకాదు, స్వదేశీ ఉద్యమానికి తన కలం ద్వారా ఇంకు నింపినందుకు రత్నంను అభినందిస్తూ ఆ పెన్నుతో గాంధీజీ స్వయంగా రాసిన లేఖ ఇప్పటికీ కేవీ రత్నం కుటుంబీకుల వద్ద భద్రంగా ఉంది. తొలి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ నుంచి లాల్‌ బహదూర్‌ శాస్త్రి, ఇందిరాగాంధీ.. వంటి మహామహులందరూ రత్నం పెన్నులకు అభిమానులే. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ భారత్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ సైతం రత్నం సన్స్‌ తయారు చేసిన పెన్నును బహూకరించి, స్వదేశీ భారత్‌కు చెక్కుచెదరని బ్రాండ్‌గా దీని గొప్పతనాన్ని వివరించడం విశేషం.

ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్‌ పీస్‌లా ఉండే ఈ పెన్నుల రేట్లు రూ. 300 నుంచి రూ. 35,000 స్థాయి వరకూ (స్టీల్‌ పాళీ నుంచి 22 క్యారెట్ల బంగారంతో తయారైన పాళీ దాకా) ఉంటాయి. ఏకంగా రూ. 2 లక్షల పైగా విలువైన ప్రత్యేకమైన గోల్డ్‌ పెన్‌ కూడా ఉంది. ఎలాంటి మార్కెటింగ్‌ గానీ, వెబ్‌సైట్‌ గానీ లేకుండానే కేవలం నోటిమాటే ప్రచారంగా.. ఈ పోటీ ప్రపంచంలో దాదాపు 90 ఏళ్లుగా సిసలైన రత్నంగా నిలుస్తోంది!

‘అమృతాంజనం!


నొప్పొస్తే.. ‘అమ్మా కాదు.. అమృతాంజనం’ అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిన బ్రాండ్‌ అంటే అతిశయోక్తి కాదేమో! 129 ఏళ్ల క్రితం 1893లో వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు ఇలా ఒకటేంటి.. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కాశీనాథుని నాగశ్వరరావు రూపొందించిన ఈ నొప్పి నివారణ ఔషధం.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఎంతంటే, తలనొప్పి–అమృతాంజనం అనేంతలా! కుటుంబ సంస్థగా మొదలై.. 1936లో అమృతాంజన్‌ లిమిటెడ్‌ పేరుతో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారింది.

ఈ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను కూడా ప్రారంభించి.. పత్రికా ప్రపంచంలో చరిత్ర సృష్టించడం విశేషం. స్వాతంత్య్రానంతరం అమృతాంజనానికి పోటీగా ఎన్ని రకాల ఔషధాలు వచ్చినా.. నేటికీ దీని స్థానం చెక్కుచెదరలేదు. అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌గా పేరు మార్చుకుని, నాగేశ్వరరావు మనుమడు శంభు ప్రసాద్‌ సారథ్యంలో నేడు అమృంతాంజన్‌ సంస్థ ఫుడ్, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లోకి కూడా విస్తరించింది. స్టాక్‌ మార్కెట్లో సైతం లిస్టయ్యి.. రూ. 2,400 కోట్ల మార్కెట్‌ విలువతో స్వదేశీ ‘బ్రాండ్‌’బాజా మోగిస్తోంది!! 
-శివరామకృష్ణ మిర్తిపాటి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement