మహోజ్వల భారతి: వీరనారి రాజ్‌కుమారి | Azadi Ka Amrut Mahotsav: Freedom Fighter Rajkumari Gupta In Kakori conspiracy | Sakshi
Sakshi News home page

Rajkumari Gupta: పైకి గాంధీమార్గంలో కనిపిస్తూ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరనారి

Published Tue, Aug 9 2022 1:40 PM | Last Updated on Tue, Aug 9 2022 1:44 PM

Azadi Ka Amrut Mahotsav: Freedom Fighter Rajkumari Gupta In Kakori conspiracy - Sakshi

రాజ్‌కుమారి గుప్త స్వాతంత్య్ర సమరయోధురాలు. 120 ఏళ్ల క్రితం 1902లో కాన్పూర్‌లో జన్మించారు. ఆమె ఏ తేదీన జన్మించిందీ కచ్చితమైన వివరాలు చరిత్రలో నమోదు కాలేదు కానీ, ఆగస్టు 9 అనే తేదీ చరిత్రలో ఆమెను చిరస్మరణీయురాలిని చేసింది. 1925లో లక్నో సమీపంలోని కాకోరీ అనే గ్రామంలో ఆ రోజున జరిగిన రైలు దోపిడీకి రాజ్‌కుమారి విప్లవకారులకు సహకరించారు. ఆ దోపిడీకి పాల్పడింది ‘హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’ అనే విప్లవ సంస్థకు చెందిన చంద్రశేఖర ఆజాద్‌ బృందం. ఆ బృందంలో సభ్యురాలు రాజ్‌కుమారి. ఆమెకు చిన్నప్పుడే మదన్‌మోహన్‌ గుప్తా అనే గాంధేయవాదితో వివాహం జరిగింది. ఆయనకు ఈ ‘హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌’వాళ్లతో పైపై పరిచయాలు ఉండేవి.

రాజ్‌కుమారి తన భర్తతో పాటు భారత జాతీయ కాంగ్రెస్‌ పురమాయించిన కార్యక్రమాలను నిర్వహిస్తుండేవారు. హిందూస్థాన్‌ రిపబ్లిక్‌ అసోసియేషన్‌ ఉద్యమకారుల ప్రభావానికి లోనైన రాజ్‌కుమారి.. భర్తకు కూడా తెలీకుండా రహస్యంగా ఉద్యమ సమాచారాలను చేరవేస్తూ అసోసియేషన్‌ గ్రూపులో కీలక సభ్యురాలిగా మారారు. గ్రూపులో రాజ్‌కుమారి వంటి చురుకైన కార్యకర్తలు ఉన్నారు కానీ, సరిపడా ఆయుధాలే లేవు. ఆయుధాలను కొనేందుకు డబ్బులేదు. అందుకోసం డబ్బు దోచుకోవాలని పథకం వేశారు.

అప్పట్లో బ్రిటిష్‌ అధికారులు పన్నులు, జరిమానాలు, జులుంల రూపంలో తమకు వసూలైన సొమ్మునంతా రైల్లో తరలించేవారు. అది కనిపెట్టి ఆజాద్‌ బృందం రైలు లక్నో దగ్గరకు రాగానే రైల్లోని డబ్బును దోచుకోవాలని పథకం వేసింది. రైలు కాకోరీ సమీపంలోకి రాగానే ఆజాద్, రామ్‌ ప్రసాద్‌ బిస్మిల్, అష్వఖుల్లా ఖాన్, మరికొందరు రైలు గొలుసును లాగి ఆపారు. ఆయుధాలతో రైలు గార్డును బెదరించి డబ్బు దోచుకెళ్లారు. దోడిపీలో రాజ్‌కుమారి పాత్ర ప్రత్యక్షంగా లేకున్నా, అత్యంత కీలకమైన పాత్రే ఉంది. గార్డును బెదిరించడానికి, ముందు జాగ్రత్త కోసం ఆజాద్‌ బృందం తీసుకెళ్లిన ఆయుధాలు రాజ్‌కుమారి తెచ్చి ఇచ్చినవే.

చంటి బిడ్డను చంకనెత్తుకుని, లోదుస్తుల్లో ఆయుధాలను దాచుకుని పొలాల్లో పడి నడుచుకుంటూ వెళ్లి సమయానికి వారికి ఆయుధాలను అందించారు రాజ్‌కుమారి. తర్వాత విషయం తెలిసి భర్త, అత్తమామలు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. ఆమెతో తమకు ఎలాంటి సంబంధమూ లేదని ప్రపంచానికి ప్రకటించారు. తర్వాత ఈ గ్రూప్‌నంతటినీ, రాజ్‌కుమారి సహా  బ్రటిష్‌ ప్రభుత్వం వెంటాడి, వెతికి పట్టుకుని అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత కూడా రాజ్‌కుమారి బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడుసార్లు జైలు శిక్ష అనుభవించారు. గాంధీమార్గంలో పైకి కనిపిస్తూ సాయుధ పోరాటాన్ని సాగించిన వీరనారి రాజ్‌కుమారి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement