‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్నాడు కవి. కానీ ఆ తల్లి బానిస సంకెళ్ల చెరలో ఉంటే ఏ దేశమేగినా, ఎందుకాలిడినా బిడ్డలు సంతోషంగా ఉండలేరు. బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న తల్లి భారతి దుస్థితికి స్వదేశంలోని భారతీయులతో పాటు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా తీవ్రవేదన అనుభవించారు.
మాతృమూర్తి దాస్యం చూసీ చూసీ ప్రవాస భారతీయుల కన్నీరు ఎరుపెక్కింది! ఎలాగైనా బ్రిటిష్ చెర నుంచి జన్మభూమికి విముక్తి కల్పించాలని ఆ ఎర్రటి కన్నీటి సాక్షిగా ప్రవాస భారతీయులు చేసుకున్న ప్రతిజ్ఞ నుంచి ఆవిర్భవించింది గదర్ పార్టీ!
పార్టీకి ముందే పత్రిక
‘గదర్’ అనే పేరు వెనుక చాలా నేపథ్యం ఉంది. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిషు వారు ‘గదర్’ అని పిలిచేవారు. గదర్ అంటే పంజాబీ, ఉర్దూ భాషలలో తిరుగుబాటు అని అర్థం! ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తిని, పోరాటాన్ని కొనసాగించి, అంతిమంగా దేశాన్ని దాస్య శృంఖలాల నుంచి విముక్తి చేయాలన్న లక్ష్యంతో ‘హిందుస్థాన్ గదర్’ అనే పత్రికను ప్రవాస భారతీయులు ఆరంభించారు.
ఈ పత్రిక ఆధారంగా పలువురు వీరులు దగ్గరై గదర్ సంఘంగా మారారు. ఇదే అనంతర కాలంలో గదర్ పార్టీగా రూపొందింది. ఈ పార్టీ హిందూ, సిక్కు, ముస్లిం నాయకుల సమ్మేళనం. 1913లో బ్రిటిష్ పాలనతో సంబంధం లేకుండా విదేశాల నుంచి స్వదేశంలోని స్వాతంత్య్ర విప్లవోద్యమానికి సహాయం చేయాలన్న సంకల్పంతో పార్టీ అవతరించింది.
ఆరంభంలో ఈ పార్టీలో అత్యధికులు అమెరికా, కెనెడాల్లోని ప్రవాస భారతీయులు కాగా తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లోని ప్రవాస భారతీయులు ఇందులో చేరారు. హిందూస్థాన్ గదర్ పత్రిక కార్యాలయం ఉన్న కాలిఫోర్నియాలోని శాన్ ప్రాన్సిస్కోలో పార్టీ ప్రధాన కార్యాలయం ఏర్పాటైంది.
జాతీయవాద చైతన్యం
1903–1913 కాలంలో దాదాపు పదివేలకు పైగా భారతీయులు ఉత్తర అమెరికాలో పలు ఉద్యోగాలకు వలసవెళ్లారు. వీరిలో సగంమంది బ్రిటిష్ మిలటరీలో చేరారు. నానాటికీ పెరుగుతున్న భారతీయుల, ముఖ్యంగా పంజాబీల ప్రాధాన్యం తగ్గించేందుకు కెనడా ప్రభుత్వం పలు చట్టాలు తీసుకువచ్చింది. దీంతో కెనడాకు వెళ్లడం కష్టంగా మారింది. ఇప్పటికే కెనడాలో ఉన్న భారతీయుల హక్కులపై పరిమితి విధించడం జరిగింది.
ఇవన్నీ ప్రవాస భారతీయుల్లో అసంతృప్తిని పెంచాయి. వీరు గురుద్వారాల్లో, హిందుస్థానీ సమాఖ్య సమావేశాల్లో కలుసుకొని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను చర్చించేవారు. ఇదే సమయంలో ప్రవాసీల్లో జాతీయతా భావనలు పెరిగాయి. బ్రిటిష్ పాలన నుంచి స్వదేశానికి విముక్తి కల్పించాలన్న ఆలోచన పలువురిలో కలిగింది. ముఖ్యంగా యూనివర్సిటీ ఆఫ్ బర్కిలీ విద్యార్థుల్లో జాతీయవాద చైతన్యం ఉప్పొంగనారంభించింది. ఇందుకు హర్‌దయాళ్, తారక్‌నాథ్ దాస్ తదితరుల ఉపన్యాసాలు దోహదం చేశాయి. వీరికి భారతీయ విప్లవకారుడు రాస్‌బీహారీ బోస్‌తో సంబంధాలు పెరిగాయి.
‘పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ’
దేశానికి విప్లవ మార్గంలో స్వాతంత్య్రం సంపాదించాలన్న ఆలోచనతో ఇలాంటి భావనలున్న వారంతా కలిసి పసిఫిక్ కోస్ట్ హిందుస్తానీ అసోసియేషన్ గా 1913 జూలై 15న ఏర్పడ్డారు. ఇదే తదనంతరం గదర్‌పార్టీగా మారింది. సోహన్ సింగ్ భక్నా దీనికి తొలి అధ్యక్షుడు. ఇందులో భాయ్ పర్మానంద్, హర్ దయాల్, మొహమ్మద్ ఇక్బాల్ శేదై, కర్తార్ సింగ్ శరభ, అబ్దుల్ హఫీజ్ బరకాతుల్లా, సులామన్ చౌదరి, అమీర్ చౌదరి, రష్బీరి బోస్, గులాబ్ కౌర్ తదితరులు కీలక సభ్యులు.
– దుర్గరాజు శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment