ఆఫ్గన్ మిషన్ ఇన్ కాబూల్ ::: 1915 కాబూల్‌లో సమావేశమైన టర్కీ, జర్మనీ దౌత్యాధికారులతో బర్కతుల్లా భోపాలి (కుడి చివర); రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ (కూర్చొన్న వారి మధ్యలో)
‘మౌలానా బర్కతుల్లా’ గా భారత స్వాతంత్య్రోద్యమంలో గౌరవ ప్రతిష్టలు అందుకున్న మహమ్మద్ బర్కతుల్లా భోపాలీ.. సమరశీల విప్లవ యోధుడు. తిరుగుబాటు వీరుడు. తొలి స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ధీరుడు. స్వతంత్ర భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చుకునే అపురూపమైన క్షణాలను చూడకముందే కన్నుమూసిన ‘దేశ ప్రధాని’!
మౌలానా బర్కతుల్లా 1854 జూలై 7న బ్రిటిష్ ఇండియాలోని భోపాల్ రాష్ట్రంలో జన్మించారు. భోపాల్‌లోని సులేమానియా హైస్కూల్‌లో టీచరుగా ఉన్న సమయంలో ఆయన మీద షేక్ జమాలుద్దీన్ ఆఫ్ఘనీ అనే ఉద్యమకారుడి ప్రభావం ఎక్కువగా ఉండేది. జమాలుద్దీన్ ముస్లింలలో సోదరభావం పెంపొందించడానికి ప్రపంచదేశాల్లో పర్యటించేవారు. బర్కతుల్లా తల్లిదండ్రులు మరణించడంతో జమాలుద్దీన్‌తోపాటు ఆయన భోపాల్ నుంచి ముంబయికి మారారు.
ఖండాలా, ముంబయిలలో ఇంగ్లిష్ టీచర్‌గా తన వృత్తిని కొనసాగించారు. అక్కడ శ్యామ్‌జీ కృష్ణవర్మ వంటి అతివాద నాయకులతో సన్నిహితంగా మెలిగారు. క్రమంగా జాతీయోద్యమం వైపు మళ్లారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన దశలో మనదేశంలో ఉన్న హిందువులు, ముస్లింలు ఎవరికి వారు ఉండరాదని, ఐక్యంగా పోరాడాలని నమ్మిన ఆనాటి తొలి వ్యక్తి బర్కతుల్లా. ఈ రెండు మతాల మధ్య వేర్పాటువాదం ఉన్నంత కాలం అది బ్రిటిష్ పాలకులకు ఆయుధంగా ఉంటుందని, సోదరభావంతో ఒకటై ఉంటే తప్ప వలస పాలకుల గుండెల్లో దడ పుట్టదని తన ప్రసంగాల్లో, వార్తా పత్రికల వ్యాసాల్లో ఉద్బోధించారు.
విదేశాలే స్థావరం
జమాలుద్దీన్ స్ఫూర్తితో బర్కతుల్లా ఎక్కువ కాలం విదేశాల్లోనే గడిపారు. ఇంగ్లండ్‌లో ఉన్న సమయంలో హథ్రాస్ రాజకుటుంబీకుడు రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్‌తో పరిచయమైంది. అనంతరం ఒక ఏడాది అమెరికాలో గడిపిన తర్వాత 1904లో టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరారు. అమెరికా, జపాన్‌ల మధ్య పర్యటిస్తూ, భారత జాతీయోద్యమానికి ఐరిష్ ఉద్యమకారుల మద్దతును కూడా సాధించారు. స్వదేశీ ఉద్యమాన్ని చేపట్టిన లాలాలజ్‌పత్‌రాయ్, అజిత్ సింగ్‌లకు మద్దతుగా విదేశాల్లో ఉన్న భారతీయులను చైతన్యవంతం చేశారు. ఈ క్రమంలో ఎక్కువ కాలం అమెరికాలో నివసించిన బర్కతుల్లా గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా క్రియాశీలకంగా పనిచేశారు.
కాబూల్ వ్యూహరచన
గదర్ మూవ్‌మెంట్‌లో భాగంగా బర్కతుల్లా జర్మనీ, టర్కీల సహాయంతో కాబూల్ చేరారు. అక్కడి నుంచి భారత స్వాతంత్య్ర సిద్ధి కోసం తన వ్యూహరచనను వేగవంతం చేశారు. ఫలితమే కాబూల్‌లో స్వయం ప్రకటిత స్వతంత్ర భారత ప్రభుత్వం ఏర్పాటు! 1915 డిసెంబర్ 1 న ‘ఫ్రీ హిందూస్థాన్’ పేరుతో బర్కతుల్లా బృందం ఆ ఇండియన్ ప్రొవిజనల్ గవర్నమెంట్‌ను స్థాపించింది. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అధ్యక్షుడిగా బర్కతుల్లా ప్రధానమంత్రిగా ఏర్పడిన ఆ ప్రభుత్వమే తొలి భారత స్వాతంత్య్ర సమర ప్రభుత్వం. ఆజాద్ హింద్ ఫౌజ్‌కు చాలా ఏళ్లకు ముందే బర్కతుల్లా, ఆయన సహ విప్లవకారులు ప్రకటించుకున్న ఆ ప్రభుత్వానికి ప్రారంభంలో స్థానిక ఆఫ్గన్ పాలకుల పరోక్ష మద్దతు ఉన్నప్పటికీ, బ్రిటిష్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి వారు పక్కకు తప్పుకున్నారు. 1919 నాటికి ఆ తాత్కాలిక ప్రభుత్వం కూలిపోయింది.
చివరి క్షణాల్లోనూ..!
1927 సెప్టెంబర్ 20 వ తేదీ రాత్రి బర్కతుల్లా ప్రపంచాన్ని వీడిపోయారు. ఆ చివరి రాత్రి కూడా శాన్‌ఫ్రాన్సిస్కోలో ఆయన తన తోటి ఉద్యమకారులతో భారతదేశ విముక్తి గురించే మాట్లాడారు. ‘‘నా మాతృభూమికి స్వాతంత్య్రం సముపార్జించేవరకు విశ్రమించకూడదనుకున్నాను. ఎంత కష్టాన్నైనా భరిస్తూ నిజాయితీగా పోరాడాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే ఈ రోజు నేను ఈ జీవితాన్ని వదిలి వెళ్లిపోతున్నాను. నా జీవితంలో అత్యంత విచారకరమైన రోజు ఇది.
బ్రిటిష్ పాలన నుంచి మాతృభూమిని విముక్తం చేసే ప్రయత్నంలో విజయం సాధించలేకపోయాను. అయితే లక్షలాది ధైర్యవంతులు నా కలను నిజం చేస్తారని నమ్ముతున్నాను. నా తర్వాత ఈ మహోద్యమాన్ని వారు చేపట్టి విజయం సాధిస్తారు’’ అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన దేశం ఈ దేశభక్తుడికి సగౌరవంగా నివాళిని సమర్పించుకుంది. ఆయన గౌరవార్థం భోపాల్ యూనివర్సిటీకి బర్కతుల్లా యూనివర్సిటీగా పేరు మార్చి ఆయన పోరాటాన్ని చిరస్మరణీయం చేసుకుంది.
– వాకా మంజులారెడ్డి
ఆఫ్గన్ మిషన్ ఇన్ కాబూల్ ::: 1915
కాబూల్‌లో సమావేశమైన టర్కీ, జర్మనీ దౌత్యాధికారులతో బర్కతుల్లా భోపాలి (కుడి చివర); రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ (కూర్చొన్న వారి మధ్యలో)
Comments
Please login to add a commentAdd a comment