తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి | Azadi Ka Amrit Mahotsav First Women President And First Tribal President | Sakshi
Sakshi News home page

తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి

Published Mon, Jul 25 2022 8:40 AM | Last Updated on Mon, Jul 25 2022 8:41 AM

Azadi Ka Amrit Mahotsav First Women President And First Tribal President - Sakshi

తొలి మహిళా రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్‌ భారతదేశ తొలి మహిళా రాష్ట్రపతి. 2007 జూలై 25న ఆమె రాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు వరకు రాజస్థాన్‌ గవర్నరుగా (2004–2007) ఉన్నారు. ప్రతిభా పాటిల్‌ 1934 లో మహారాష్ట్ర లోని నందగావ్‌లో జన్మించారు. రాజనీతి శాస్త్రం, ఆర్థిక శాస్త్రం ముఖ్యాంశాలుగా డబల్‌ ఎమ్‌.ఎ. చేశారు. టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి కూడా. 1962లో ప్రతిభా పాటిల్‌ ఎం.జె.కళాశాల ‘కాలేజ్‌ క్వీన్‌‘గా ఎన్నికయ్యారు.

ఉన్నత విద్యాభాసం తర్వాత భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితులను మెరుగుపరచడానికి సామాజిక అంశాలపై ఆసక్తిని ఏర్పరచుకున్నారు. పాటిల్‌ను యునైటెడ్‌ ప్రొగ్రెస్సెవ్‌ ఆలియన్స్‌ (యు.పి.ఎ) తన రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. యు.పి.ఎ మొదటప్రతిపాదించిన శివరాజ్‌ పాటిల్‌ లేదా కరణ్‌ సింగ్‌ల అభ్యర్థిత్వాన్ని వామపక్షాలు అంగీకరించనందు వల్ల పాటిల్‌ను ఒక రాజీ మార్గ అభ్యర్థిగా ప్రకటించారు.

పాటిల్‌ భారత జాతీయ కాంగ్రెస్‌కు, నెహ్రూ గాంధీ కుటుంబానికి అనేక దశాబ్దాల పాటు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నందున కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ ఆమెను ఎంపిక చేశారు. పాటిల్‌ తన ప్రత్యర్థి భైరాన్‌ సింగ్‌ షెకావత్‌పై భారీ మెజారిటీ గెలిచారు. 

తొలి ఆదివాసీ రాష్ట్రపతి
శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (జూలై 25) భారతదేశ 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రతిభా పాటిల్‌ దేశ తొలి మహిళా రాష్ట్రపతి కాగా,  శ్రీమతి ముర్ము దేశ తొలి ఆదివాసీ రాష్ట్రపతి. ముర్ము 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేశారు. తాజా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై భారీ మెజారిటీతో గెలిచారు.

ముర్ము ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా,  బైదాపోసి గ్రామంలో గిరిజన తెగకు చెందిన సంతాల్‌ కుటుంబంలో 1958 జూన్‌ 20 న జన్మించారు. భువనేశ్వర్‌ లోని రమాదేవి మహిళా కాలేజీ నుంచి బీఏ పూర్తి చేసి ఆ తర్వాత ఉపాధ్యాయురాలిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1977–83 మధ్య ఒడిశాలోని నీటిపారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, 1994 నుంచి 97 వరకూ శ్రీ అరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో గౌరవ సహాయ ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.  

అడవిలో పుట్టిన వేటగాడు
జిమ్‌ కార్బెట్‌ వేటగాడు, క్రూరమృగాల జాడల్ని గుర్తించే నేర్పరి. జంతు సంరక్షకుడు కూడా. నేడు జిమ్‌ కార్బెట్‌ జయంతి. 1875 జూలై 25న నార్త్‌ వెస్ట్‌ ప్రావిన్సు (నేటి ఉత్తరాఖండ్‌) లోని నైనిటాల్‌ అటవీ ప్రాంతంలో జన్మించారు. నరమాంసానికి అలవాటు పడిన పులుల్ని, చిరుతల్ని చంపడంలో జిమ్‌ కార్బెట్‌ సిద్ధహస్తుడు. భారత ఉపఖండంలో, ముఖ్యంగా ఆగ్రా, అవధ్‌ల సంయుక్త ప్రావిన్సు మొత్తంలో మనుషుల్ని తినే పులి ఎక్కడ సంచరిస్తున్నా వెంటనే జిమ్‌ కార్బెట్‌కి బ్రిటిష్‌ ప్రభ్వుతం నుంచి పిలుపు అందుతుంది.

వెళ్లి మనుషుల్ని రక్షిస్తాడు. అంతకంటే ముందు ఆ మ్యాన్‌ ఈటర్‌ పులిని రక్షించడానికి (చంపకుండా బంధించడం) ప్రయత్నిస్తాడు. జిమ్‌ కార్బెట్‌ తన అనుభవాలతో ‘మాన్‌–ఈటర్స్‌ ఆఫ్‌ కుమావోన్‌’ అనే గ్రంథం రాశారు. అతడు ఫొటోగ్రాఫర్‌ కూడా. వన్యప్రాణుల్ని అవి మ్యాన్‌ ఈటర్సే అయినా వాటిని అంతరించిపోకుండా కాపాడుకోవలసిన బాధ్యత మనిషిదేనని అంటాడు. 

(చదవండి: జిన్నా రమ్మన్నా అజీమ్‌ తండ్రి వెళ్లలేదు!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement