సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్‌లోని 75 ఖాళీ ప్రదేశాల్లో ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటును బుధవారం చేపట్టింది. వజ్రోత్సవం గుర్తుగా 75ను ప్రామాణికంగా తీసుకొని పనులు చేయనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్ పార్కులకుగాను ఎల్‌బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌జోన్లలో 12 చొప్పున, ఖైరతాబాద్ జోన్‌లో 15 పార్కులు వెరసి మొత్తం 75 ఫ్రీడమ్‌పార్కులకు శ్రీకారం చుట్టారు.
వాటిల్లో ప్లాంటేషన్ ప్రారంభించారు. ఈ పార్కుల్లోని వాకింగ్ ట్రాక్స్, బెంచీలు సైతం జెండా రంగులను కలిగి దేశ ఫ్రీడమ్‌ను గుర్తుచేస్తాయి. ఎటొచ్చీ ఫ్రీడమ్ థీమ్‌తోనే ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తారు. పార్కులకున్న స్థలాల్ని బట్టి 75 లేదా 750 లేదా 7500 మొక్కలు నాటుతున్నారు.
75 జాతులతో..
జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 36లోని రెండెకరాల విస్తీర్ణంలోని ఫ్రీడమ్ పార్కులో 75 జాతులకు చెందిన మొక్కల్ని ఒక్కో జాతివి పది చొప్పున 750 మొక్కలు నాటినట్లు జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్యవిభాగం అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు 75 వెరైటీల ఔషధమొక్కలు ఒక్కో వెరైటీవి 100 చొప్పున 7500 మొక్కలు నాటుతున్నారు.
75 జాతుల్లో పొగడ, మర్రి, మోదుగు, కదంబ, మారేడు, జువ్వి, పొన్న, సంపంగి, గోవర్ధనం, ఎర్రచందనం, జమ్మి, ఫౌంటెన్ ట్రీ, గోవర్ధనం, వెలగ, బూరుగు, వేప తదితరమైనవి ఉన్నాయి.
పూలు సైతం..
ఈ పార్కుల బోర్డులు సైతం వజ్రోత్సవాల ఎంబ్లమ్‌ను కలిగి ఉంటాయి. పార్కుల్లో నాటే మొక్కల పూలు సైతం జెండారంగులో కనిపించేలా ఆయా రంగుల మొక్కలు నాటుతున్నారు. ఉదాహరణకు 12 వరుసల్లో మొక్కలు వచ్చేచోట నాలుగేసి వరుసలు ఒక్కోరంగు చొప్పున జెండాలోని మూడు రంగుల్లో కనిపించేలా సంబంధిత మొక్కలు నాటుతున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడు చూసినా అవి దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ప్రత్యేకపార్కులని తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆయా రోడ్ల వెంబడి వర్టికల్ గార్డెన్స్, జంక్షన్లలో విగ్రహాలు, జలపాతాలు వంటివి సైతం జెండా రంగుల్లో స్వాతంత్య్రాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మ్యూజిక్‌ట్రాక్స్..
వాకర్స్ ఎక్కువగా వచ్చే చాచా నెహ్రూపార్క్, కేబీఆర్‌పార్క్, కేఎల్‌ఎన్‌యాదవ్ పార్క్, జేవీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, ఏఎస్‌రావునగర్ పార్క్, ఉప్పల్ అర్బన్‌పార్క్, ఎన్జీఓకాలనీపార్క్, ఇందిరాపార్క్, సుందరయ్యపార్క్ వంటి పార్కుల్లో వాకింగ్‌ట్రాక్‌ల వెంబడి ఏర్పాటు చేసే మ్యూజిక్ సిస్టమ్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో మంద్రస్థాయిలో స్వాతంత్య్ర స్ఫూర్తి కలిగించే దేశభక్తిపాటలు వినిపించనున్నాయి. 15 రోజుల పాటు దేశభక్తి గీతాలు వినిపిస్తారు. అనంతరం ఇతర గీతాలు వినిపిస్తారు.
నగరంలోని వివిధ పార్కుల గేట్లు, పార్కులోని కెర్బింగ్‌లు, బెంచీలు మాత్రమే కాదు.. కొద్దినెలల తర్వాత వాటిల్లోని మొక్కలు..పూచే పూలు సైతం జెండారంగుల్లో కనిపించనున్నాయి. అంతేకాదు.. పెద్ద పార్కుల ప్రహరీ గోడలపై స్వాతంత్య్ర సంగ్రామ ఘటనల దృశ్యాలు కనపడనున్నాయి. ఎవరైనా సరే వాటిని చూడగానే దూరం నుంచే ‘ఫ్రీడమ్’ పార్కులుగా గుర్తించేలా ఫ్రీడమ్ పార్కుల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment