Freedom Park
-
హైదరాబాద్‌లో 75 ఫ్రీడమ్ పార్కులు
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రానికి 75 సంవత్సరాల సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్‌లోని 75 ఖాళీ ప్రదేశాల్లో ఫ్రీడమ్ పార్కుల ఏర్పాటును బుధవారం చేపట్టింది. వజ్రోత్సవం గుర్తుగా 75ను ప్రామాణికంగా తీసుకొని పనులు చేయనున్నారు. గ్రేటర్ వ్యాప్తంగా 75 ఫ్రీడమ్ పార్కులకుగాను ఎల్బీనగర్, చార్మినార్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్‌జోన్లలో 12 చొప్పున, ఖైరతాబాద్ జోన్లో 15 పార్కులు వెరసి మొత్తం 75 ఫ్రీడమ్‌పార్కులకు శ్రీకారం చుట్టారు. వాటిల్లో ప్లాంటేషన్ ప్రారంభించారు. ఈ పార్కుల్లోని వాకింగ్ ట్రాక్స్, బెంచీలు సైతం జెండా రంగులను కలిగి దేశ ఫ్రీడమ్‌ను గుర్తుచేస్తాయి. ఎటొచ్చీ ఫ్రీడమ్ థీమ్‌తోనే ఈ పార్కుల్ని అభివృద్ధి చేస్తారు. పార్కులకున్న స్థలాల్ని బట్టి 75 లేదా 750 లేదా 7500 మొక్కలు నాటుతున్నారు. 75 జాతులతో.. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 36లోని రెండెకరాల విస్తీర్ణంలోని ఫ్రీడమ్ పార్కులో 75 జాతులకు చెందిన మొక్కల్ని ఒక్కో జాతివి పది చొప్పున 750 మొక్కలు నాటినట్లు జీహెచ్ఎంసీ జీవవైవిధ్యవిభాగం అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు 75 వెరైటీల ఔషధమొక్కలు ఒక్కో వెరైటీవి 100 చొప్పున 7500 మొక్కలు నాటుతున్నారు. 75 జాతుల్లో పొగడ, మర్రి, మోదుగు, కదంబ, మారేడు, జువ్వి, పొన్న, సంపంగి, గోవర్ధనం, ఎర్రచందనం, జమ్మి, ఫౌంటెన్ ట్రీ, గోవర్ధనం, వెలగ, బూరుగు, వేప తదితరమైనవి ఉన్నాయి. పూలు సైతం.. ఈ పార్కుల బోర్డులు సైతం వజ్రోత్సవాల ఎంబ్లమ్‌ను కలిగి ఉంటాయి. పార్కుల్లో నాటే మొక్కల పూలు సైతం జెండారంగులో కనిపించేలా ఆయా రంగుల మొక్కలు నాటుతున్నారు. ఉదాహరణకు 12 వరుసల్లో మొక్కలు వచ్చేచోట నాలుగేసి వరుసలు ఒక్కోరంగు చొప్పున జెండాలోని మూడు రంగుల్లో కనిపించేలా సంబంధిత మొక్కలు నాటుతున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడు చూసినా అవి దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రారంభించిన ప్రత్యేకపార్కులని తెలుస్తాయని అధికారులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆయా రోడ్ల వెంబడి వర్టికల్ గార్డెన్స్, జంక్షన్లలో విగ్రహాలు, జలపాతాలు వంటివి సైతం జెండా రంగుల్లో స్వాతంత్య్రాన్ని గుర్తు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యూజిక్ట్రాక్స్.. వాకర్స్ ఎక్కువగా వచ్చే చాచా నెహ్రూపార్క్, కేబీఆర్పార్క్, కేఎల్ఎన్యాదవ్ పార్క్, జేవీఆర్ పార్క్, కృష్ణకాంత్ పార్క్, ఏఎస్‌రావునగర్ పార్క్, ఉప్పల్ అర్బన్‌పార్క్, ఎన్జీఓకాలనీపార్క్, ఇందిరాపార్క్, సుందరయ్యపార్క్ వంటి పార్కుల్లో వాకింగ్ట్రాక్ల వెంబడి ఏర్పాటు చేసే మ్యూజిక్ సిస్టమ్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో మంద్రస్థాయిలో స్వాతంత్య్ర స్ఫూర్తి కలిగించే దేశభక్తిపాటలు వినిపించనున్నాయి. 15 రోజుల పాటు దేశభక్తి గీతాలు వినిపిస్తారు. అనంతరం ఇతర గీతాలు వినిపిస్తారు. నగరంలోని వివిధ పార్కుల గేట్లు, పార్కులోని కెర్బింగ్లు, బెంచీలు మాత్రమే కాదు.. కొద్దినెలల తర్వాత వాటిల్లోని మొక్కలు..పూచే పూలు సైతం జెండారంగుల్లో కనిపించనున్నాయి. అంతేకాదు.. పెద్ద పార్కుల ప్రహరీ గోడలపై స్వాతంత్య్ర సంగ్రామ ఘటనల దృశ్యాలు కనపడనున్నాయి. ఎవరైనా సరే వాటిని చూడగానే దూరం నుంచే ‘ఫ్రీడమ్’ పార్కులుగా గుర్తించేలా ఫ్రీడమ్ పార్కుల నిర్మాణానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. -
సాగు చట్టాలను రద్దు చేయాలి
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని బెంగళూరులో సోమవారం రైతులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అలాగే ధరల పెరుగుదల, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేల మంది రైతులు, దళిత, కార్మిక, విద్యార్థి సంఘాల వారు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినవారు మెజెస్టిక్ రైల్వేస్టేషన్ వద్ద సమావేశమై అక్కడ నుంచి చలో విధానసౌధకు సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్రీడం పార్కులో సమావేశం జరిపారు. జాతీయ రైతు నేతలు రాకేశ్ తికాయిత్, డాక్టర్ సుదర్శన్ పాల్, యుద్ధవీర్‌సింగ్, రాష్ట్ర రైతు నాయకులు బి.నాగేంద్ర, జీసీ బయ్యారెడ్డి, కోడిహళ్లి చంద్రశేఖర్, కేవీ భట్ తదితరులు పాల్గొన్నారు. ‘వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకమైనవి. ఈ చట్టాల ద్వారా దేశంలో రైతుల వ్యవసాయాన్ని నాశనం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పరం చేయడానికి సిద్ధమయింది’అని నేతలు కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీలో నెలల తరబడి రైతులు ధర్నా చేస్తుంటే పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు కేంద్రం భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. -
ఆ చీకటి రోజుల్లోకి తిరిగి చూస్తుంటే..
30 అడుగుల ఎత్తున్న ఆ గోడలో భాగమైన పొడవాటి ఆ రాతి వైపు అదే పనిగా చూస్తున్నాను. అమ్మ తన జీవితంలోని చివరి నెలలు గోడకు ఆ వైపున ఉన్న జైలు గదిలోనే గడిపింది. ఆ గదిలో మంచమ్మీద కూచుని అమ్మ ఇందిరాగాంధీ హయాంలో భారత్‌కు పట్టిన గతిని తలచుకుని ఆగ్రహంతో రగిలింది, విలవిలలాడింది. నియంతృత్వ ప్రధాని విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడలేని నిస్సహాయతను అక్కడే అనుభవించింది. 40 ఏళ్లు గడిచాయి. ఆ నిశ్శబ్దపు బాధాకర చీకటి రోజుల జ్ఞాపకాలను, చరిత్రను కొత్త తరం ఎరుగదు. అవి చరిత్ర పుస్తకాలకు ఎక్కలేదు. నాటి ఎమర్జెన్సీ బాధితుల్లో చాలా మంది ఇప్పుడు మంత్రులు, అధికార పార్టీ సభ్యులు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే సూత్రాలకు అంటిపెట్టుకున్న మాలాంటివాళ్లం కొద్ది మందిమే. మేం ఆధునిక, వినియోగవాద, మోదీయ భారతం సాగిస్తున్న దాడి ధాటికి నిశ్చేష్టులమై ఉన్నాం. అయినా మోదీ నియంతృత్వ ఎత్తుగడలలో, ఆధిపత్య పాలనా నమూనాలలో ద్యోతకమవుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ రూపు రేఖలను గుర్తించగలుగుతున్నాం. మేం స్వేచ్ఛా భారతంలో పుట్టే అదృష్టానికి నోచుకున్న ‘మిడ్నైట్స్ చిల్డ్రన్’ (అర్ధరాత్రి పిల్లలం). మా హీరోలంతా తొలి విపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ధన, అధికార వ్యసనాలకు బానిసలై పతనమయ్యారు. దీంతో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరులో మాకు ప్రేరణగా నిలిచిన ఆదర్శవాదం కొద్ది కాలానికే ముక్కలు చెక్కలైంది. మిగిలిన ఆ శకలాల్లోంచి తిరిగి జీవితాన్ని ప్రారంభించి, మా విశ్వాసాన్ని చిగురింపజేసుకోవడానికి మా శక్తియుక్తులకు ఊపిరులూదడమే ఒక పోరాటమైంది.మోదీ తెలివిగా తన నియంతృత్వానికి భరోసా ఉండేలా పావులు కదిపారు. సమ్మిళిత అభివృద్ధి, సంఘటితమయ్యే స్వేచ్ఛ, వాక్స్వాతంత్య్రమూ, మన సంస్కృతిని, మతాన్ని అనుసరించడానికి స్వేచ్ఛా మొదలైనవి ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్ణయాత్మకమైన అంశాలు. ఈ జాబితాలోని ప్రతిదానికీ ఆయన క్రమపద్ధతిలో తూట్లు పొడుస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైన అసమ్మతిని వ్యక్తం చేసే స్వేచ్ఛను కుదించేశారు. ఈ కార్పొరేట్ అనుకూల కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేసే ఎలాంటి విమర్శయినా అభివృద్ధి వ్యతిరేకతే, జాతి వ్యతిరేకతే.. కాబట్టి కచ్చితంగా మీరొక ఉగ్రవాదే! ఇందిరలాగా మోదీ అసమ్మతిదారులను జైళ్లలో కుక్కడంవంటి మొరటు పద్ధతులను ప్రయోగించరు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారు, వారికి విదేశీ విరాళాలు రాకుండా చేస్తారు. 1975 ఎమర్జెన్సీ నాటి గుర్తింపులేని యోధులు వేలల్లో ఉన్నారు. వారిలో కొందరు బతికే ఉన్నారు, కొందరు బీజేపీ సభ్యులుగాఉన్నారు. నాటి బరోడా డైనమేట్ కేసులో జార్జి ఫెర్నాండెజ్, సీజీకే రెడ్డిల తరపున వాదించిన న్యాయవాదుల బృందంలో సుష్మా స్వరాజ్ అత్యంత చురుకైన సభ్యురాలిగా ఉండేవారు. ఇప్పుడామె మోదీ మంత్రివర్గ సభ్యురాలు. అప్పుడు జైళ్లపాలైన బీజేపీ నేతలు చాలామంది ఇప్పుడు ఇష్టంగానే మోదీ ఎజెండాకు అనుగుణంగా నడుచుకుంటున్నట్టు అనిపిస్తోంది. దేశ అంతర్గత శక్తులే ప్రజాస్వామ్యాన్ని కాలరాచివేయగలవని, ఎమర్జెన్సీ పునరావృతం కావచ్చని అంటూ మోదీ నాయకత్వ శైలి వైపు వేలెత్తి చూపే ధైర్యాన్ని ఒక్క అద్వానీనే చూపారు. ఇందిర నిరంకుశ పాలన ఫలితంగా అసువులు బాసినవారెందరో ఉన్నారు. వారినందరినీ అనుద్దేశపూర్వక మరణాల జాబితాలోకి చేర్చేశారు. ఏ పేరూ, ఊరూ, గుర్తింపూ లేని అలాంటి ఆ అభాగ్యుల క్రమసంఖ్యల జాబితాలో మా అమ్మా ఓ సంఖ్య. నా తల్లిదండ్రులు కళాకారులు. నా తండ్రి కవి, గణిత శాస్త్రవేత్త, సినీ నిర్మాత. నా తల్లి నృత్య కళాకారిణి, నటి, చిత్రకారిణి. ఇద్దరూ సోషలిస్టులు, రామ్మనోహర్ లోహియా అనుచరులు. లోహియా మా సన్నిహిత కుటుంబ మిత్రులు. వారిద్దరూ రాజకీయాలను ప్రగాఢంగా పట్టించుకున్నవారు. ఎంతో ఉద్వేగంతో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేవారు. అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు జార్జి ఫెర్నాండెజ్, సీజీకే రెడ్డిల నేతృత్వంలోని అజ్ఞాత పోరాటంలోకి దూకారు. వారిద్దరూ నా తల్లిదండ్రులకు దీర్ఘకాలిక మిత్రులు, సహచరులు. జార్జి అరెస్టును తప్పించుకొని అజ్ఞాత ఉద్యమాన్ని నిర్మిస్తుంటే, సీజీకే అప్పటికింకా ‘హిందూ’ పత్రికలోనే పనిచేస్తున్నారు. నియంతను కూలదోయడానికి జాతీయ, అంతర్జాతీయ మద్దతును కూడగ ట్టడానికి ఆయన తన పాత్రికేయ ముసుగును వాడుకునేవారు. నా తల్లిదండ్రులు రాజకీయ శరణార్థులకు సురక్షిత గృహాలను ఏర్పాటు చేసేవారు. బలమైన ఇందిర వ్యతిరేకతను పెంపొందింపజేయడానికి ప్రయత్నించారు. ఒక్కసారి మళ్లీ నాటి అత్యవసర పరిస్థితి వైపు తిరిగి చూస్తుంటే... భారత రాజకీయాల స్వరూపాన్నే మార్చేసే అవకాశాన్ని అది అందించిందని నాకు కనిపిస్తోంది. ఫాసిజానికి వ్యతిరేకంగా, మార్పును కోరుతూ ఆనాడు బ్రహ్మాండమైన ప్రజా తీర్పు లభించింది. ఇప్పుడు దేశం మళ్లీ నియంతృత్వ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మరోసారి దాన్ని మనం సవాలు చేయాల్సి ఉంది. మనలాంటివాళ్లం ఆనాటి అత్యవసర పరిస్థితిని సవివరంగా, సమూలంగా విశ్లేషించి ప్రజల ముందుంచాలి. అప్పుడే నేటి యువతకు దాని గురించి తెలుస్తుంది. అప్పుడు మాత్రమే భారతదేశం ఎమర్జెన్సీకి అతీతమైన దేశం కాగలుగుతుంది. నా మేనకోడలు జూయిలాగే నాకు కూడా గోడలు రహస్యాలను, జ్ఞాపకాలను నిక్షిప్తం చేసుకుంటాయని నమ్మకం. అందుకే ఇప్పుడు 'ఫ్రీడం పార్క్'గా పిలుస్తున్న ఒకప్పటి బెంగుళూరు కేంద్రీయ కారాగారానికి నేనీ పవిత్ర యాత్ర చేపట్టాను. మన అమర వీరులను 'మరచి పోకుండా ఉండటానికి' ఆ గోడలో తాపడం చేసిన రాతి మీద నా చేతిని ఉంచాను. (వ్యాసకర్త మానవ హక్కుల, సామాజిక, రాజకీయ కార్యకర్త. ప్రముఖ తెలుగు కవి పఠాభి, నర్తకి స్నేహలతా రెడ్డిల కుమార్తె) Email:nandanareddy54@gmail.com -
ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పుకాదు
* రవాణా శాఖా మంత్రి రామలింగారెడ్డి బనశంకరి: ఆంగ్లభాషను నేర్చుకోవడం తప్పుకాదని, అయితే కన్నడభాష ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, లేకుంటే కన్నడసాహిత్యం, సంస్కృతి ఉని కికిపెనుప్రమాదమని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి రామలింగారెడ్డి అభిప్రాయపడ్డారు. ఫ్రీడం పార్కులో సోమవారం ఏర్పాటు చేసిన కువెంపుజయంతి, కన్నడ జాగృతి రోజును ప్రారంభించిన ఆయన మాట్లాడారు. నగరంలో ఉ న్న వారందరూ కన్నడ భాషను ప్రేమించి, నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు అశ్వర్థ నారాయణ, మాజీ మేయర్ ఏ ఉత్తప్ప, మేయర్ శాంతకుమారి, కన్నడ అభివృద్ధి ప్రాధికార కార్యదర్శి కే మురళీధర, రంగక ర్మ నాగరాజమూర్తి, అనికేతన కన్నడ బలగద అధ్యక్షుడు మాయామాయణ్ణ, కర్ణాటక విచారవేదిక అధ్యక్షుడు పాలనేత్ర తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మేడే
సాక్షి, బెంగళూరు : తమ స్వేదాన్ని ఇంధనంగా మార్చి ప్రపంచ ప్రగతి రథ చక్రాలను నడుపుతున్న కార్మికులు ‘మే’ డే సంబరాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 70కి పైగా కార్మిక సంఘాలు ఒకే చోట చేరి సంబరాలను నిర్వహించాయి. నగరంలోని ఫ్రీడం పార్క్ నుంచి సిటీ రైల్వేస్టేషన్ వరకు బృహత్ ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఫ్రీడం పార్క్‌లో నిర్వహించిన సమావేశంలో టీయుసీసీఐ అధ్యక్షుడు జి.ఆర్.శివశంకర్ మాట్లాడుతూ... కాంట్రాక్టు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కనిష వేతనం, ఇఎస్ఐ, భవిష్యనిధి వంటి సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోటల్, రిసార్టు రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని, అయితే వాటిలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లోని కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు తీర్చే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు మినర్వా సర్కిల్ నుంచి బన్నప్ప పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బన్నప్ప పార్క్ వద్ద నిర్వహించిన బిహ రంగ సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రాజన్ మాట్లాడుతూ...ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు భవిష్యనిధితో పాటు రూ.3వేల పింఛన్‌ను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు పేర్కొన్నారు. -
29న సమైక్య గర్జన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :నగరంలోని తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 29న ఇక్కడి ఫ్రీడం పార్కులో ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున సమైక్య గర్జనను నిర్వహిస్తున్నట్లు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఏ. రాధాకృష్ణ రాజు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమైక్య గర్జనను నిర్వహిస్తామని వెల్లడించారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలంటూ ఏక వాక్య తీర్మానం చేయనున్నట్లు చెప్పారు. తీర్మాన ప్రతులను రాష్ట్రపతి, ప్రధానిలకు పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి నగరంలోని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కాగా ఈ సమైక్య గర్జనకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై అన్ని రాష్ట్రాల్లోని తెలుగు వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని తెలిపారు. తెలుగు వారు తల ఎత్తుకుని తిరిగే పరిస్థితి లేదని వాపోయారు. విభజనను శాస్త్రీయంగా కాకుండా రాజకీయంగా చేసినందునే ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. ఈ పరిణామాలకు కాంగ్రెస్ వాడిగా సిగ్గు పడుతున్నానని చెప్పారు. ఏదేమైనా విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో తెలుగు విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి ఏకే. జయచంద్రా రెడ్డి, కోశాధికారి సీవీ. శ్రీనివాసయ్య పాల్గొన్నారు -
జై సమైక్యాంధ్ర
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చిన్నగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చర్చా వేదికలు, కవితా గోష్టులు తదితర కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర ఆకాంక్షను గట్టిగా వినిపిస్తున్న ప్రవాసాంధ్రులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని నినదించారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ ముందు చేపట్టిన ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆ నాయకులందరూ తల దించుకునే విధంగా కర్ణాటకలో రోడ్లను శుభ్రం చేసి, నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. త్వరలో నగరంలోని ఫ్రీడం పార్కులో లక్ష గళ గర్జనను చేపడతామని వెల్లడించారు. కోరమంగలలో వంటా వార్పు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు సీవీ. శ్రీనివాసయ్య, అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కోటె వెంకటేష్, అఖిల కర్ణాటక రామ్‌చరణ్ యువ సేన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, అఖిల కర్ణాటక సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, సీహెచ్. గురువయ్య, ప్రతాప్, అంబరీశ్, కే. సునీత, ఎస్. వరలక్ష్మి, విజయకుమారి, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజపురం, కోరమంగల, తావరకెరె, అత్తిబెలె, హలసూరు, యలహంక, హోడి, పద్మనాభ నగర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.