
సోమవారం బెంగళూరులో నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రైతు సంఘాల నేతలు, రైతులు
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని బెంగళూరులో సోమవారం రైతులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అలాగే ధరల పెరుగుదల, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేల మంది రైతులు, దళిత, కార్మిక, విద్యార్థి సంఘాల వారు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినవారు మెజెస్టిక్ రైల్వేస్టేషన్ వద్ద సమావేశమై అక్కడ నుంచి చలో విధానసౌధకు సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్రీడం పార్కులో సమావేశం జరిపారు. జాతీయ రైతు నేతలు రాకేశ్ తికాయిత్, డాక్టర్ సుదర్శన్ పాల్, యుద్ధవీర్‌సింగ్, రాష్ట్ర రైతు నాయకులు బి.నాగేంద్ర, జీసీ బయ్యారెడ్డి, కోడిహళ్లి చంద్రశేఖర్, కేవీ భట్ తదితరులు పాల్గొన్నారు. ‘వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకమైనవి.
ఈ చట్టాల ద్వారా దేశంలో రైతుల వ్యవసాయాన్ని నాశనం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పరం చేయడానికి సిద్ధమయింది’అని నేతలు కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీలో నెలల తరబడి రైతులు ధర్నా చేస్తుంటే పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు కేంద్రం భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment