Rally former
-
సాగు చట్టాలను రద్దు చేయాలి
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని బెంగళూరులో సోమవారం రైతులు భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. అలాగే ధరల పెరుగుదల, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేల మంది రైతులు, దళిత, కార్మిక, విద్యార్థి సంఘాల వారు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినవారు మెజెస్టిక్ రైల్వేస్టేషన్ వద్ద సమావేశమై అక్కడ నుంచి చలో విధానసౌధకు సిద్ధం కావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్రీడం పార్కులో సమావేశం జరిపారు. జాతీయ రైతు నేతలు రాకేశ్ తికాయిత్, డాక్టర్ సుదర్శన్ పాల్, యుద్ధవీర్‌సింగ్, రాష్ట్ర రైతు నాయకులు బి.నాగేంద్ర, జీసీ బయ్యారెడ్డి, కోడిహళ్లి చంద్రశేఖర్, కేవీ భట్ తదితరులు పాల్గొన్నారు. ‘వ్యవసాయ బిల్లులు రైతులకు వ్యతిరేకమైనవి. ఈ చట్టాల ద్వారా దేశంలో రైతుల వ్యవసాయాన్ని నాశనం చేసి కార్పొరేట్ వ్యవసాయాన్ని అమల్లోకి తేవాలనుకుంటున్నారు. ప్రభుత్వ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల పరం చేయడానికి సిద్ధమయింది’అని నేతలు కేంద్రంపై మండిపడ్డారు. ఢిల్లీలో నెలల తరబడి రైతులు ధర్నా చేస్తుంటే పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్‌కు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాటి నుంచి ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు కేంద్రం భావోద్వేగ అంశాలను తెరపైకి తెస్తోందన్నారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. -
‘రైతుల్లో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు’
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం శనివారం నాడు ఢిల్లీ నగరాన్ని ముట్టడించడం పట్ల హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల ప్రదర్శనలో ‘ఖలిస్థాని’ వేర్పాటు వాదులున్నట్లు తమకు సమాచారం అందిందని ఆరోపించారు. ‘రైతుల ప్రదర్శనలో అవాంఛిత శక్తులు ఉన్నట్లు మాకు ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. బలమైన ఆధారాలు దొరికినాకా ఆ శక్తుల వివరాలను వెల్లడిస్తాం’ అని మీడియాతో చెప్పారు. (చదవండి : దేశ రాజధానిని తాకిన రైతుల సెగ) ‘జబ్ ఇందిరాగాంధీ కో హే కర్ సక్తే హై, తో మోది కో క్యోం నహీ కర్సక్తే (ఇందిరాగాంధీనే చేసినప్పుడు మోదిని చేయలేమా!)’ అని కొంతమంది రైతులు నినాదాలు ఇస్తోన్న ఆడియో, వీడియో క్లిప్పులు తమ వద్దకు వచ్చాయని కూడా కట్టర్ తెలిపారు. ప్రత్యేక ‘ఖలిస్థాన్’ కోసం జరిగిన వేర్పాటు ఉద్యమాన్ని నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ అణచి వేసిన నేపథ్యంలో 1984లో ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డులే హత్య చేయడం తెల్సిందే. రైతులు ఆందోళనలో తమ హర్యానా రాష్ట్రానికి చెందిన రైతులెవరూ లేరని, పంజాబ్ రాష్ట్రానికి చెందిన రైతులు ఉన్నారంటూ కూడా కట్టర్ ఆరోపణలు చేశారు. రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ రెచ్చగొడుతున్నారని కూడా ఆయన విమర్శించారు. -
దేశ రాజధానిని తాకిన రైతుల సెగ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రైతులు పెద్ద సంఖ్యలో పంజాబ్, హర్యానా నుంచి శనివారం ఉదయం జాతీయ రాజధాని శివార్లలోని నిరంకరి సమగం మైదానానికి రావడం ప్రారంభించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న 'దిల్లీ చలో' మార్చ్‌ను చేపట్టగా.. బురారీలో ఉన్న నిరంకరి మైదానంలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. "వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా నిరసన కొనసాగుతుంది. సుదీర్ఘకాలం మేము ఇక్కడ ఉంటాం" అని స్పష్టం చేశారు.. మైదానంలోనే రైతులు వంటలు చేసుకునేందుకు ఢిల్లీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. అలాగే శాంతియుతంగా నిరసన చేపట్టాలని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని సింగు వద్ద ఇవాళ ఉదయం పంజాబ్ రైతుల సమావేశం జరిగింది. నిరంకరి సమాగం మైదానంలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో తిక్రీ సరిహద్దు వద్ద భద్రత బలగాలు మోహరించాయి. రైతులు ఉత్పత్తి, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం-2020, రైతుల ధర భరోసా, వ్యవసాయ సేవా చట్టం-2020, సవరణ (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టం అనే 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, తమపై బాష్పవాయువును ప్రయోగించడం నేరమని రైతులు ఆగ్రహిస్తున్నారు. అయితే.. ఈ మూడు చట్టాల వల్ల దళారి వ్యవస్థ పోతుందని, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లలో విక్రయించడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ప్రభుత్వం మద్ధతు ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవచ్చని, ఒకవేళ కొనుగోలు చేసినా సకాలంలో చెల్లింపులు జరగవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలను నిరసిస్తూ రైతుల బృందం ఫతేఘర్ సాహిబ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. కొవిడ్-19 మహమ్మారి, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ నిరసనను ముగించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. చట్టాలకు సంబంధించిన సమస్యలను రైతు సంస్థల ప్రతినిధులతో చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. -
ర్యాలి మాజీ సర్పంచ్ మృతి
ర్యాలి (ఆత్రేయపురం), న్యూస్‌లైన్ :రాజకీయ దురంధరుడు, ర్యాలి మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు పేరిచర్ల నరసింహరాజు(85) మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందారు. సుమారు 20 ఏళ్లు సర్పంచ్‌గా, ఒక పర్యాయం ఎంపీటీసీ సభ్యునిగా సేవలందించిన నరసింహరాజు మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నరసింహరాజు మృతికి సంతాపంగా ర్యాలిలో బుధవారం బంద్ పాటించారు. పార్టీలకు అతీతంగా నాయకులు నరసింహరాజు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నరసింహరాజు భౌతిక కాయంతో బుధవారం ర్యాలి నుంచి రాజమండ్రి కోటి లింగాల క్షేత్రం వరకు అంతిమయాత్ర నిర్వహించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఓటమి ఎరగని నేత నరసింహరాజు అని, ర్యాలి గ్రామస్తుల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాలు, దళితుల అభ్యున్నతికి ఆయన విశేషంగా కృషి చేశారన్నారు. ర్యాలి గ్రామాభివృద్ధికి నరసింహరాజు అందించిన సేవలు మరవలేనివన్నారు. తన తండ్రి సోమసుందరరెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ కొత్తపేట రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నరసింహరాజు తనకు రాజకీయంగా అండదండలు అందించారని కొనియాడారు. సమైక్యాంధ్ర ఆందోళనలు వాయిదా : నరసింహరాజు మృతికి సంతాప సూచికంగా బుధవారం ఆలమూరు మండలం నుంచి కొత్తపేట మండలం వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించ తలబెట్టిన బస్సు యాత్ర, ఆత్రేయపురం మండలంలో నిర్వహించే కార్యక్రమాలు, ఈనెల 24 నుంచి చేపట్ట బోయే నిరాహార దీక్షలు వాయిదా వేస్తున్నట్టు చిర్ల తెలిపారు. నరసింహరాజు మృతికి సంతాపం తెలిపిన వారిలో డీసీఎంఎస్ చైర్మన్ కె.వి. సత్యనారయణరెడ్డి, మల్లిడి శ్రీనివాసరెడ్డి , గొలుగూరి మునిరెడ్డి, మాజీ ఎంపీపీ పి.ఎస్. రాజు, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, ర్యాలి సొసైటీ అధ్యక్షుడు పేరిచర్ల పుల్లంరాజు, డీసీసీబీ డెరైక్టర్ చిలువూరి రామకృష్ణంరాజు తదితరులు ఉన్నారు.