న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి రైతులు పెద్ద సంఖ్యలో పంజాబ్, హర్యానా నుంచి శనివారం ఉదయం జాతీయ రాజధాని శివార్లలోని నిరంకరి సమగం మైదానానికి రావడం ప్రారంభించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు, రాస్తారోకోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిన్న 'దిల్లీ చలో' మార్చ్‌ను చేపట్టగా.. బురారీలో ఉన్న నిరంకరి మైదానంలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. "వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు మా నిరసన కొనసాగుతుంది. సుదీర్ఘకాలం మేము ఇక్కడ ఉంటాం" అని స్పష్టం చేశారు.. మైదానంలోనే రైతులు వంటలు చేసుకునేందుకు ఢిల్లీ సర్కార్ ఏర్పాట్లు చేసింది. అలాగే శాంతియుతంగా నిరసన చేపట్టాలని పోలీసులు రైతులకు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని సింగు వద్ద ఇవాళ ఉదయం పంజాబ్ రైతుల సమావేశం జరిగింది. నిరంకరి సమాగం మైదానంలో ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో తిక్రీ సరిహద్దు వద్ద భద్రత బలగాలు మోహరించాయి. రైతులు ఉత్పత్తి, వాణిజ్యం (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్) చట్టం-2020, రైతుల ధర భరోసా, వ్యవసాయ సేవా చట్టం-2020, సవరణ (ఎసెన్షియల్ కమోడిటీస్) చట్టం అనే 3 చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
శాంతియుత నిరసన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, తమపై బాష్పవాయువును ప్రయోగించడం నేరమని రైతులు ఆగ్రహిస్తున్నారు. అయితే.. ఈ మూడు చట్టాల వల్ల దళారి వ్యవస్థ పోతుందని, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లలో విక్రయించడానికి వీలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ప్రభుత్వం మద్ధతు ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోవచ్చని, ఒకవేళ కొనుగోలు చేసినా సకాలంలో చెల్లింపులు జరగవని రైతులు ఆందోళన చెందుతున్నారు. చట్టాలను నిరసిస్తూ రైతుల బృందం ఫతేఘర్ సాహిబ్ నుంచి ఢిల్లీకి చేరుకుంది. కొవిడ్-19 మహమ్మారి, శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ నిరసనను ముగించాలని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ విజ్ఞప్తి చేశారు. చట్టాలకు సంబంధించిన సమస్యలను రైతు సంస్థల ప్రతినిధులతో చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment