బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చిన్నగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చర్చా వేదికలు, కవితా గోష్టులు తదితర కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర ఆకాంక్షను గట్టిగా వినిపిస్తున్న ప్రవాసాంధ్రులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని నినదించారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ ముందు చేపట్టిన ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు.
లేనట్లయితే ఆ నాయకులందరూ తల దించుకునే విధంగా కర్ణాటకలో రోడ్లను శుభ్రం చేసి, నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. త్వరలో నగరంలోని ఫ్రీడం పార్కులో లక్ష గళ గర్జనను చేపడతామని వెల్లడించారు. కోరమంగలలో వంటా వార్పు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు సీవీ. శ్రీనివాసయ్య, అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కోటె వెంకటేష్, అఖిల కర్ణాటక రామ్‌చరణ్ యువ సేన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, అఖిల కర్ణాటక సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, సీహెచ్.
గురువయ్య, ప్రతాప్, అంబరీశ్, కే. సునీత, ఎస్. వరలక్ష్మి, విజయకుమారి, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజపురం, కోరమంగల, తావరకెరె, అత్తిబెలె, హలసూరు, యలహంక, హోడి, పద్మనాభ నగర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.