samikandhra
-
సమస్తం బంద్
సాక్షి,నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్సీపీ, ఎన్జీఓ, విద్యార్థి జేఏసీ, ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఉదయం నుంచే నగరంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, సమైక్య వాదుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. దీంతో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, కార్యకర్తలు నగరంలో మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్ నుంచి ఎన్జీఓలు ఆర్టీసీ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును రాజ్యసభ, పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వీఎస్‌యూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పెన్నాబ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక వీఆర్సీ సెంటర్లో ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనం జయకుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. గాంధీబొమ్మ సెంటర్లో ముస్లిం యువకులు సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వెంకటాచలం జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో మనుబోలులో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొదలకూరులో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల జాతీయరహదారిపై రాస్తారో నిర్వహించారు. వెంకటగిరి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెంలో ధర్నా నిర్వహించారు. ఇందుకూరుపేట, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది. -
నేడు జిల్లా బంద్
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో బంద్ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ నేత బీ. ఎర్రిస్వామి రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. సీమాంధ్ర ఎంపీలను దురుద్దేశంతో సస్పెండ్ చే శారని ఆరోపించారు. ఎంపీలను సస్పెండ్ చేస్తే ఇక లోక్‌సభలో సమైక్యాంధ్రపై మాట్లాడే వారెవరుంటారని ప్రశ్నించారు. విద్యా, వ్యాపార సంస్థలు బంద్‌కు సహకరించాలని కోరారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు నగరంలోని నందిని హోటల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోవాలని సమైక్యవాదులకు పిలుపునిచ్చారు. -
సమైక్య పోరుకు 90 రోజులు
జిల్లాలో సమైక్య ఉద్యమం ప్రారంభమై 90 రోజులైంది. వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్ర మా ఊపిరి అంటూ నినదిస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు పోరు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్య ఉద్యమం పురుడు పోసుకుని 90 రోజులైంది. ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికు లు సమ్మె విరమించినప్పటికీ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సమైక్య శంఖారావం నింపిన నూతనోత్తేజంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమైక్యాంధ్ర మా ఊపిరి అంటూ నినదిస్తున్నారు. తిరుపతి తుడా సర్కిల్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో సోమవారం చెన్నారెడ్డికాలనీ (అం బేద్కర్ కాలనీ)కి చెందిన మహిళలు పాల్గొన్నారు. ఎమ్మె ల్యే కరుణాకరరెడ్డి దీక్ష శిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన కార్యకర్తలతో కలసి ఇంది రా మైదానంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమకు సాగునీటి కష్టాలు మొదలవుతాయని, రైతులు వ్యవసాయాన్ని మానుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతు వేషంలో నాగళ్లు తగులబెటి ్ట నిరసన తెలి పారు. పలమనేరులో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించా రు. సమైక్యానికి మద్దతుగా ఎన్జీవోలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. చిత్తూరులో ఎన్జీవో హోం వద్ద ఎన్జీవోలు రిలే దీక్షలు ప్రారంభించారు. తిరుపతిలో రెవెన్యూ ఉద్యోగులు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మదనపల్లెలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. జేఏసీ, మిట్స్ కళాశాల ఆధ్వర్యంలో సమైక్యవాదులు మల్లికార్జున సర్కిల్ లో మానవహారం నిర్వహించారు. సమైక్య ఉద్యమం ప్రారంభమై 90 రోజులైన సందర్భంగా 90 సంఖ్య ఆకారంలో కూర్చొని నిరసన తెలిపారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ చైర్మన్ వరదారెడ్డి ఆధ్వర్యంలో ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు, వీఆర్వోలు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రాష్ర్ట విభజన జరిగి తే యువత ఉద్యోగాలపై ఆశ వదులుకొని పనులు చేసుకుని బతకాల్సిందేనంటూ చేపలు, పాలు అమ్మి నిరసన తెలిపారు. శ్రీకాళహస్తిలో స్కిట్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి పెండ్లిమండపం వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. బి,కొత్తకోటలో ప్రభు త్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ర్యాలీ చేశారు. -
కాంగ్రెస్, దేశంలో కలవరం
సాక్షి, విజయవాడః రాజధానిలో సమైక్య శంఖారావం విజయం జిల్లాలోని కాంగ్రెస్, దేశం పార్టీల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. భారీ వర్షాలు ... వెల్లువెత్తుతున్న వరద ... తెగిపోయిన రహదారులు ... రైలు పట్టాలపై వరద నీరు ... ఇన్ని ఇక్కట్ల మధ్య జిల్లా దాటలేని పరిస్థితి. ఇంకెక్కడ హైదరాబాదుకు పయనం ... సభ విజయం అంటూ చంకలు గుద్దుకున్న అధికార, విపక్షాలు శనివారం సాయంత్రం ఐదు గంటల తరువాత గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్టయింది. బయటకు రావడానికి ... తమ అనుచరుల్లో కలుసుకోవడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఒక వైపు చంద్రబాబు రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నానని, సీమాంధ్ర కోసం ప్యాకేజ్‌లు ప్రకటించడమే కాకుండా ఏకంగా ఢిల్లీ వెళ్లి విభజనకు అనుకూలంగా ధర్నా చేసిన నేపథ్యంలో జననేత జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్రప్రదేశ్‌కు సంపూర్ణమద్దతు ప్రకటించడంతో జిల్లా తెలుగుదేశం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. కనీసం జిల్లాలో పర్యటించినప్పుడైనా అనుకూలంగా మాట్లాడాడంటే అదీ లేదాయే. ఈ సమయంలో జనంలోకి ఎలా వెళ్లేదీ ... ఏ సమాధానం చెప్పేదంటూ తమ ద్వితీయ క్యాడర్ వద్ద నేతలు వాపోతున్నారు. దీనికి తోడు ఆ పార్టీ నుంచి వచ్చిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఏకంగా ఆ వేదికపై నుంచి ‘దేశం’ పార్టీకే కాదు ఈ జిల్లా నేతలకు కూడా తన ఉపన్యాసంలో మర ఫిరంగులే విసిరారు. విభజన ప్రక్రియను చేపట్టిన దుర్మార్గుడు చంద్రబాబునాయుడని, ఒక ఓటు.. రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1999లో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆ విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన పిచ్చికుక్కలను తమ నాయకుల మీదకు వదిలితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 150 మంది సంతకాలు పెట్టినా పదవికి ఆశ పడని నైజం జగన్‌దని, కానీ చంద్రబాబు మాత్రం ఎమ్మెల్యేలతో వైస్రాయ్ హోటల్లో క్యాంపు రాజకీయాలు నడిపి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ‘తెలుగుదేశం’ దొంగలు తెలుసుకోవాలని ఘాటుగా చురకలు అంటించడంతో జిల్లా నేతల గుండెల్లో గుబులు పుడుతోంది. జగన్, బాబులపై చర్చ... జగన్మోహన్రెడ్డి, చంద్రబాబునాయుడుల ప్రసంగాల్లో ఎంతో వ్యత్సాసం ఉందని, జగన్మోహన్రెడ్డి స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెబితే చంద్రబాబునాయుడు ‘నీకు ఎంత మంది కొడుకులు.. నువ్వు ఎవర్ని ప్రేమిస్తావంటూ’ ప్రశ్నలతో వేధిస్తూ ఉండటంతో ప్రజల్లో పార్టీ పలచనై పోతోందని సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభకు వచ్చినవారికి కృతజ్ఞతలు : భాను అత్యంత ప్రతికూల పరిస్థితిలో సైతం... భారీ వర్షాలు, తుపాన్‌తో అష్టకష్టాలు పడుతున్నా హైదరాబాద్ సమైక్య శంఖారావానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు, నేతలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. సభకు కార్యకర్తలకే కాకుండా ఉద్యోగ సంఘాల జేఏసీ తరఫున కూడా వేలాది సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారని చెప్పారు. -
తరగని పోరాట స్ఫూర్తి
అదే ఉద్యమ దీప్తి.. అదే పోరాట స్ఫూర్తి.. 60 రోజులుగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా.. జనం రోడ్లపైకొచ్చి సమైక్యవాణి వినిపిస్తున్నారు. విభజన నిర్ణయంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం శనివారానికి 60 రోజులు పూర్తిచేసుకుంది. రెండు నెలలు గడిచినా సమైక్యవాదుల్లో పోరాట స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 47 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఇంకా ఉధృత రూపం తీసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల బంద్ రెండోరోజూ కొనసాగింది. విద్యాసంస్థలు వరుసగా ఆరో రోజు మూతపడ్డాయి. సకల జనుల రిలేదీక్ష... సమైక్యాంధ్రకు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో ఎన్జీఓలు, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సకల జనుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రెవెన్యూ సిబ్బందితో పాటు 200 మంది సమైక్యవాదులు ఈ దీక్షలో పాల్గొన్నారు. వత్సవాయిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లికి వినతిపత్రాన్ని అందజేశారు. గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కోరుతూ పోలిమెట్ల సర్పంచ్ ఆధ్వర్యంలో దీక్షల్లో పాల్గొన్నారు. పామర్రులో జేఏసీ నాయకులు నిల్వ కూలీల వేషంలో వలసలు వెళ్తున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. డీఎస్ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శన జరిపారు. నాగాయలంక మండలంలో రేపల్లె హర్షవర్ధన్ అనే బధిరుడు దీక్ష చేశారు. తుంగలవారిపాలేనికి చెందిన విద్యార్థులు భారీ జాతీయపతాకంతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిపారు. నూజివీడులో దిష్టిబొమ్మలతో శవయాత్ర.. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నూజివీడులో విలేకరుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను పట్టణంలో శవయాత్ర చేసి దహనం చేశారు. మండవల్లి జేఏసీ నేతలు కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారిపై ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ముదినేపల్లి మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 214 జాతీయ రహదారిపై తెలుగుతల్లి చిత్రపటం ఏర్పాటుచేసి కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్లో మహిళా జేఏసీ నాయకులు శిబిరం వద్ద ఉదయమే గారెలు వండారు. జాతీయ రహదారిపై సీమాంధ్ర టిఫిన్ సెంటర్, తెలంగాణ టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు గెడ్డాలు గీయించుకుంటూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలులో చేపట్టిన రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న ఆర్టీసీ కార్మికులకు డ్వాక్రా సంఘ లీడర్లు, అంగన్వాడీ కార్యకర్తలు జై సమైక్యాంధ్ర, సేవ్ ఏపీ అంటూ చేతులపై గోరింటాకు పెట్టి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వత్సవాయి జిల్లా పరిషత్ సెంటర్లో జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. తిరుపతమ్మ తల్లికి వినతిపత్రం.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికుల జేఏసీ నేతలు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారికి వినతిపత్రం అందజేశారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విమలాభాను శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నందమూరు గ్రామ వాసులు గుడివాడ-విజయవాడ ఆర్ అండ్ బీ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు జిలేబీ అమ్మి నిరసన కార్యక్రమం చేపట్టారు. కోడూరు శ్రీగాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గణపతి హోమాన్ని నిర్వహించారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మున్సిపల్ చేపల మార్కెట్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్లో యువకులు కర్రసాము, కత్తిసాముతో సాహస విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. చనుబండ గ్రామంలో వివేకానంద విద్యావిహార్ విద్యార్థు పిరమిడ్ ఆకారంలో విన్యాసాలు చేశారు. ముదినేపల్లి మండలంలోని వణుదుర్రు శివారు కొత్తపల్లి సెంటర్లో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ముదినేపల్లి - బంటుమిల్లి ఆర్అండ్బీ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం వ ద్ద ఎముకల వైద్య నిపుణుడు అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యాన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన రహదారిపై పాస్టర్లతో కలసి ప్రార్థనలు చేశారు. విజయవాడలో... విజయవాడలో శనివారం విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించగా, మున్సిపల్ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎన్జీవోలు బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపై జాగరణ చేశారు. ఉపాధ్యాయులు సబ్‌కలెక్టరేట్ ముందు కూరగాయల దండలతో నిరసన తెలిపారు. చిట్టినగర్‌లో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఇంజనీర్లు అత్యవసర విధులను 72 గంటలపాటు బహిష్కరించి మూడో రోజు కూడా దీక్షలలో పాల్గొన్నారు. ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) చేపట్టిన రిలే దీక్షలు శనివారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఓల్డ్ స్క్రాప్ అండ్ ప్లాస్టిక్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన నాయకులు, మహిళలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమం పేరుతో హెల్త్ యూనివర్సిటీని ముట్టడించాలని మెడికల్ జేఏసీ నిర్ణయించింది. ఎన్జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించి వేశారు. -
జై సమైక్యాంధ్ర
బెంగళూరు, న్యూస్‌లైన్ : నగరంలో సమైక్యాంధ్ర ఉద్యమాలు చిన్నగా ఊపందుకుంటున్నాయి. ఇప్పటికే చర్చా వేదికలు, కవితా గోష్టులు తదితర కార్యక్రమాల ద్వారా సమైక్యాంధ్ర ఆకాంక్షను గట్టిగా వినిపిస్తున్న ప్రవాసాంధ్రులు బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని నినదించారు. కర్ణాటక తెలుగు ప్రజా సమితి ఆధ్వర్యంలో టౌన్‌హాల్ ముందు చేపట్టిన ఈ ప్రదర్శనలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి మాట్లాడుతూ సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే ఆ నాయకులందరూ తల దించుకునే విధంగా కర్ణాటకలో రోడ్లను శుభ్రం చేసి, నిరసన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. త్వరలో నగరంలోని ఫ్రీడం పార్కులో లక్ష గళ గర్జనను చేపడతామని వెల్లడించారు. కోరమంగలలో వంటా వార్పు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు సీవీ. శ్రీనివాసయ్య, అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కోటె వెంకటేష్, అఖిల కర్ణాటక రామ్‌చరణ్ యువ సేన రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, అఖిల కర్ణాటక సమైక్యాంధ్ర జేఏసీ నాయకులు బాబు రాజేంద్రకుమార్, శివకుమార్, సీహెచ్. గురువయ్య, ప్రతాప్, అంబరీశ్, కే. సునీత, ఎస్. వరలక్ష్మి, విజయకుమారి, రాజేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజపురం, కోరమంగల, తావరకెరె, అత్తిబెలె, హలసూరు, యలహంక, హోడి, పద్మనాభ నగర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. -
భద్రతా వలయంలో బాబు యాత్ర
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన యాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ టీడీపీ నేతలు తీసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన నేపథ్యంలో బాబు చేపట్టిన యాత్ర ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుందోననే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలతో పాటు కార్యకర్తలు సైతం పోలీసుల మాదిరిగానే వ్యవహరిస్తూ ఎక్కడా ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డారు. వాస్తవానికి జడ్‌ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు చుట్టూ బ్లాక్‌క్యాట్ కమాండోలు రక్షణగా ఉన్నారు. వీరికి అదనంగా సుమారు వందమంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు యాత్ర కొనసాగించారు. కొన్నిచోట్ల జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేసిన యువకులను పార్టీ కార్యకర్తలు పక్కకు లాగేసి ఎవరూ నోరుమెదపకుండా చేశారు. గురజాల పరిసర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను నేతలు యాత్రకు తరలించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటూ, బొగ్గు ఫైళ్లు మాయమయ్యాయంటూ చాలాసేపు చంద్రబాబు ఇలాంటి అంశాలకే పరిమితం కావడంతో సభికుల్లో అసహనం వ్యక్తమైంది. ఆత్మగౌరవ యాత్ర అంటూ వచ్చి ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నారో అర్థంకాక దిక్కులు చూడటం కన్పించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు దాచేపల్లి మండలం పొందుగల బ్రిడ్జి వద్ద ప్రారంభం కావాల్సిన చంద్రబాబు యాత్ర ఆశించిన మేరకు జన సమీకరణ జరగక పోవడంతో మూడు గంటలు ఆలస్యం అయింది. ఉదయం 9.30 గంటలకే నల్గొండ జిల్లా వాడపల్లి రాశీ సిమెంట్స్ అతిథి గృహానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వేచి ఉండాల్సి వచ్చింది. నల్గొండ పార్టీ నేతలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12.30 గంటలప్పుడు పొందుగల బ్రిడ్జి వద్ద జనసమీకరణపై ఆరా తీయగా, అప్పటికి జనం వెయ్యిలోపే ఉన్నారని జిల్లా నేతలు సమాచారం ఇవ్వడంతో వారిపై చంద్రబాబు మండిపడినట్టు తెలిసింది. దీనిపై ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులతో ఆయన మాట్లాడారు. మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పొందుగల బ్రిడ్జి వద్ద బాబు యాత్ర ప్రారంభమైంది. బ్రిడ్జి వద్ద ప్రసంగిస్తున్నప్పుడే కొందరు యువకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే యరపతినేని రంగంలోకి దిగి వాతావరణం సద్దుమణిగేలా చూశారు. పొందుగల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ మూసధోరణిలోనే సాగాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజే యాత్ర ప్రారంభించిన బాబు తన ప్రసంగాల్లో పలుమార్లు ఆయన్ను పొగుడుతూ మాట్లాడారు.