భద్రతా వలయంలో బాబు యాత్ర
సాక్షి ప్రతినిధి, గుంటూరు: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం అట్టుడుకుతున్న పరిస్థితుల్లో ‘తెలుగు ఆత్మగౌరవ యాత్ర’ అంటూ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టిన యాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలన్నీ టీడీపీ నేతలు తీసుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇచ్చిన నేపథ్యంలో బాబు చేపట్టిన యాత్ర ఎలాంటి పరిణామాలకు తెరతీస్తుందోననే ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలతో పాటు కార్యకర్తలు సైతం పోలీసుల మాదిరిగానే వ్యవహరిస్తూ ఎక్కడా ఎలాంటి ఆటంకం ఎదురుకాకుండా జాగ్రత్తపడ్డారు. వాస్తవానికి జడ్‌ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబు చుట్టూ బ్లాక్‌క్యాట్ కమాండోలు రక్షణగా ఉన్నారు. వీరికి అదనంగా సుమారు వందమంది వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకుని చంద్రబాబు యాత్ర కొనసాగించారు.
కొన్నిచోట్ల జై సమైక్యాంధ్రా అంటూ నినాదాలు చేసిన యువకులను పార్టీ కార్యకర్తలు పక్కకు లాగేసి ఎవరూ నోరుమెదపకుండా చేశారు. గురజాల పరిసర నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలను నేతలు యాత్రకు తరలించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానంటూ, బొగ్గు ఫైళ్లు మాయమయ్యాయంటూ చాలాసేపు చంద్రబాబు ఇలాంటి అంశాలకే పరిమితం కావడంతో సభికుల్లో అసహనం వ్యక్తమైంది. ఆత్మగౌరవ యాత్ర అంటూ వచ్చి ఇవన్నీ ఎందుకు ఏకరువు పెడుతున్నారో అర్థంకాక దిక్కులు చూడటం కన్పించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటలకు దాచేపల్లి మండలం పొందుగల బ్రిడ్జి వద్ద ప్రారంభం కావాల్సిన చంద్రబాబు యాత్ర ఆశించిన మేరకు జన సమీకరణ జరగక పోవడంతో మూడు గంటలు ఆలస్యం అయింది.
ఉదయం 9.30 గంటలకే నల్గొండ జిల్లా వాడపల్లి రాశీ సిమెంట్స్ అతిథి గృహానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వేచి ఉండాల్సి వచ్చింది. నల్గొండ పార్టీ నేతలను పిలిపించుకుని ఆయన మాట్లాడారు. మధ్యాహ్నం 12.30 గంటలప్పుడు పొందుగల బ్రిడ్జి వద్ద జనసమీకరణపై ఆరా తీయగా, అప్పటికి జనం వెయ్యిలోపే ఉన్నారని జిల్లా నేతలు సమాచారం ఇవ్వడంతో వారిపై చంద్రబాబు మండిపడినట్టు తెలిసింది. దీనిపై ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులతో ఆయన మాట్లాడారు.
మొత్తానికి మధ్యాహ్నం 2 గంటల సమయంలో పొందుగల బ్రిడ్జి వద్ద బాబు యాత్ర ప్రారంభమైంది. బ్రిడ్జి వద్ద ప్రసంగిస్తున్నప్పుడే కొందరు యువకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే యరపతినేని రంగంలోకి దిగి వాతావరణం సద్దుమణిగేలా చూశారు. పొందుగల, దాచేపల్లి, పిడుగురాళ్లలో చంద్రబాబు చేసిన ప్రసంగాలన్నీ మూసధోరణిలోనే సాగాయి. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన రోజే యాత్ర ప్రారంభించిన బాబు తన ప్రసంగాల్లో పలుమార్లు ఆయన్ను పొగుడుతూ మాట్లాడారు.