అదే ఉద్యమ దీప్తి.. అదే పోరాట స్ఫూర్తి.. 60 రోజులుగా కొనసాగుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్ర పరిరక్షణే ధ్యేయంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. పల్లె, పట్టణం తేడా లేకుండా.. జనం రోడ్లపైకొచ్చి సమైక్యవాణి వినిపిస్తున్నారు. విభజన నిర్ణయంపై తమ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేవరకు పోరు ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం చేపట్టిన ఉద్యమం శనివారానికి 60 రోజులు పూర్తిచేసుకుంది. రెండు నెలలు గడిచినా సమైక్యవాదుల్లో పోరాట స్ఫూర్తి ఏమాత్రం తగ్గలేదు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 47 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు చేస్తున్న సమ్మె ఇంకా ఉధృత రూపం తీసుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా శనివారం కూడా ఉద్యోగులు, విద్యార్థుల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల బంద్ రెండోరోజూ కొనసాగింది. విద్యాసంస్థలు వరుసగా ఆరో రోజు మూతపడ్డాయి.
సకల జనుల రిలేదీక్ష...
సమైక్యాంధ్రకు మద్దతుగా ఇబ్రహీంపట్నంలో ఎన్జీఓలు, ఆర్టీసీ, రెవెన్యూ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సకల జనుల రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. రెవెన్యూ సిబ్బందితో పాటు 200 మంది సమైక్యవాదులు ఈ దీక్షలో పాల్గొన్నారు. వత్సవాయిలో సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికులు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లికి వినతిపత్రాన్ని అందజేశారు.
గుడ్లవల్లేరులో సమైక్యాంధ్రను కోరుతూ పోలిమెట్ల సర్పంచ్ ఆధ్వర్యంలో దీక్షల్లో పాల్గొన్నారు. పామర్రులో జేఏసీ నాయకులు నిల్వ కూలీల వేషంలో వలసలు వెళ్తున్నట్టుగా వినూత్న నిరసన తెలిపారు. డీఎస్‌ఆర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శన జరిపారు. నాగాయలంక మండలంలో రేపల్లె హర్షవర్ధన్ అనే బధిరుడు దీక్ష చేశారు. తుంగలవారిపాలేనికి చెందిన విద్యార్థులు భారీ జాతీయపతాకంతో ఐదు కిలోమీటర్ల మేర ర్యాలీ జరిపారు.
నూజివీడులో దిష్టిబొమ్మలతో శవయాత్ర..
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నూజివీడులో విలేకరుల జేఏసీ ఆధ్వర్యంలో సోనియా, దిగ్విజయ్‌సింగ్, షిండేల దిష్టిబొమ్మలను పట్టణంలో శవయాత్ర చేసి దహనం చేశారు. మండవల్లి జేఏసీ నేతలు కత్తిపూడి-పామర్రు జాతీయ రహదారిపై ఒంటికాలిపై నిల్చుని నిరసన తెలిపారు. ముదినేపల్లి మండల ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో 214 జాతీయ రహదారిపై తెలుగుతల్లి చిత్రపటం ఏర్పాటుచేసి కొబ్బరికాయలు కొట్టి నిరసన వ్యక్తం చేశారు. కైకలూరు తాలూకా సెంటర్‌లో మహిళా జేఏసీ నాయకులు శిబిరం వద్ద ఉదయమే గారెలు వండారు.
జాతీయ రహదారిపై సీమాంధ్ర టిఫిన్ సెంటర్, తెలంగాణ టీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. కలిదిండి సెంటరులో ఉపాధ్యాయులు గెడ్డాలు గీయించుకుంటూ నిరసన తెలిపారు. పెనుగంచిప్రోలులో చేపట్టిన రిలే దీక్షా శిబిరంలో కూర్చున్న ఆర్టీసీ కార్మికులకు డ్వాక్రా సంఘ లీడర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు జై సమైక్యాంధ్ర, సేవ్ ఏపీ అంటూ చేతులపై గోరింటాకు పెట్టి వినూత్న కార్యక్రమం చేపట్టారు. వత్సవాయి జిల్లా పరిషత్ సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు.
తిరుపతమ్మ తల్లికి వినతిపత్రం..
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో కార్మికుల జేఏసీ నేతలు పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ అమ్మవారికి వినతిపత్రం అందజేశారు. జగ్గయ్యపేట జేఏసీ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలో స్థానిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఉపాధ్యాయినులు, ఉద్యోగులు పాల్గొన్నారు. విమలాభాను శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నందమూరు గ్రామ వాసులు గుడివాడ-విజయవాడ ఆర్ అండ్ బీ రహదారిపై నిరసన కార్యక్రమం చేపట్టారు.
గుడివాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. చల్లపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు జిలేబీ అమ్మి నిరసన కార్యక్రమం చేపట్టారు. కోడూరు శ్రీగాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం గణపతి హోమాన్ని నిర్వహించారు. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో మున్సిపల్ చేపల మార్కెట్ వర్తకుల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. నెహ్రూ చౌక్ సెంటర్‌లో యువకులు కర్రసాము, కత్తిసాముతో సాహస విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. చనుబండ గ్రామంలో వివేకానంద విద్యావిహార్ విద్యార్థు పిరమిడ్ ఆకారంలో విన్యాసాలు చేశారు.
ముదినేపల్లి మండలంలోని వణుదుర్రు శివారు కొత్తపల్లి సెంటర్‌లో సమైక్య రైతు శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ముదినేపల్లి - బంటుమిల్లి ఆర్‌అండ్‌బీ రహదారిపై సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో నిర్వహించారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం వ ద్ద ఎముకల వైద్య నిపుణుడు అల్లాడ శ్రీనివాసరావు ఆధ్వర్యాన వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. పమిడిముక్కల మండలం వీరంకిలాకులో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పులేటి కల్పన రహదారిపై పాస్టర్లతో కలసి ప్రార్థనలు చేశారు.
విజయవాడలో...
విజయవాడలో శనివారం విద్యార్థులు కాగడాల ప్రదర్శన నిర్వహించగా, మున్సిపల్ ఉద్యోగులు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఎన్జీవోలు బెంజిసర్కిల్ వద్ద జాతీయ రహదారిపై జాగరణ చేశారు. ఉపాధ్యాయులు సబ్‌కలెక్టరేట్ ముందు కూరగాయల దండలతో నిరసన తెలిపారు. చిట్టినగర్‌లో విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని మానవహారం నిర్మించారు. మునిసిపల్ ఇంజనీర్లు అత్యవసర విధులను 72 గంటలపాటు బహిష్కరించి మూడో రోజు కూడా దీక్షలలో పాల్గొన్నారు.
ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ (ఏటీఏ) చేపట్టిన రిలే దీక్షలు శనివారం 44వ రోజుకు చేరుకున్నాయి. ఓల్డ్ స్క్రాప్ అండ్ ప్లాస్టిక్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు చెందిన నాయకులు, మహిళలు రిలే దీక్షల్లో కూర్చున్నారు. ఈ నెల 30న చలో విజయవాడ కార్యక్రమం పేరుతో హెల్త్ యూనివర్సిటీని ముట్టడించాలని మెడికల్ జేఏసీ నిర్ణయించింది. ఎన్‌జీఓల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లను మూయించి వేశారు.
తరగని పోరాట స్ఫూర్తి
Published Sun, Sep 29 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
Advertisement
Advertisement