సాక్షి,నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ, ఎన్‌జీఓ, విద్యార్థి జేఏసీ, ఎన్‌ఎస్‌యూఐ, టీఎన్‌ఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. ఉదయం నుంచే నగరంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ సందర్భంగా నిరసన ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం, రాస్తారోకోలు నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని సమైక్యవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
నెల్లూరు నగరంతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీలు, సమైక్య వాదుల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. దీంతో జనజీవనం స్తంభించింది. వైఎస్సార్‌సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు, కార్యకర్తలు నగరంలో మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్గామిట్టలోని ఎన్‌జీఓ భవన్ నుంచి ఎన్‌జీఓలు ఆర్టీసీ వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి జై సమైక్యాంధ్ర నినాదాలతో హోరెత్తించారు.
రాష్ట్ర అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును రాజ్యసభ, పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. వీఎస్‌యూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో పెన్నాబ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. స్థానిక వీఆర్‌సీ సెంటర్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్ కార్యకర్తలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనం జయకుమార్‌రెడ్డి సమైక్యాంధ్రకు మద్దతుగా మోటారు బైక్ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది.
గాంధీబొమ్మ సెంటర్లో ముస్లిం యువకులు సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మండలం వాసిలి వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో సూళ్లూరుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. వెంకటాచలం జాతీయ రహదారిపై కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో మనుబోలులో జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పొదలకూరులో వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆర్‌టీసీ బస్సుల రాకపోకలు నిలిపివేశారు. వైఎస్సార్‌సీపీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. దగదర్తి మండలం ఉలవపాళ్ల జాతీయరహదారిపై రాస్తారో నిర్వహించారు. వెంకటగిరి వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వీరారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెంలో ధర్నా నిర్వహించారు. ఇందుకూరుపేట, కోవూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో బంద్ ప్రశాంతంగా జరిగింది.
సమస్తం బంద్
Published Fri, Feb 14 2014 3:34 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement