ఊరును మరిచిన శ్రీమంతులు
దత్తత పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి సృష్టించారు. మంది మార్భలంతో పల్లెలకు వచ్చి మీడియా ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. పెద్దపెద్దోళ్లు తమ పల్లెలను దత్తత తీసుకుంటుండటంతో తమ ఊరి రూపురేఖలు మారిపోతాయని భావించారు అందరూ. శ్రీమంతుడు సినిమాలో నటుడు మేహ ష్‌బాబు చేసిన తరహాలో అభివృద్ధి జరుగుతుందని ఆశించారు. అయితే వారి ఆశలన్నీ వమ్మయ్యాయి. అభివృద్ధి లేదు..అంతా ఆర్భాటమే అని తేలిపోయేసరికి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. నెలలు గడుస్తున్నా కొన్ని గ్రామాల్లో తట్టడు మట్టి కూడా పోయకపోగా..మరికొన్ని దత్తత గ్రామాల్లో మాత్రం ఒకటి ఆరా పనులతో కొంచెం బెటరనిపిస్తున్నారు.
నెల్లూరు: రాజధాని నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తున్నానని గొప్పలు పోతున్న రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సొంతూరికి చేసింది శూన్యం. రెండేళ్ల క్రితం నెల్లూరులోని 17, 18, 19 డివిజన్లను దత్తత తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు కనీసం ఆ డివిజన్లలోని ప్రాంతాల వైపు కన్నెత్తి కూడా చూడ లేదు. మంత్రి దత్తత తీసుకోవడంతో అభివృద్ధి జరగుతుందని ఆశించిన ప్రజలకు భంగపాటే మిగిలింది.
► నెల్లూరు మేయర్ అబ్దుల్ అజీజ్ తాను కార్పొరేటర్‌గా గెలిచిన 52వ డివిజన్‌ను దత్తత తీసుకున్నారు. ఆయన కూడా తన గురువు మంత్రి దారిలోనే నడిచి అభివృద్ధి పనులను విస్మరించారు.
► జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ 51వ డివిజన్‌ను దత్తత తీసుకున్నారు. పలుమార్లు ఆయన ఆ డివిజన్‌లో పర్యటించారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు.
► క్రికెట్ దేవుడు సచిన్ దిగి వచ్చాడు. మారుమూల పల్లెను దత్తత తీసుకున్నాడు. ఆ ఊరు స్వరూపాన్నే మార్చేస్తాడని గ్రామస్తులు ఊహల్లో తేలారు. కానీ ఈ ఊహలు కొద్ది రోజుల్లోనే తల్లకిందులయ్యాయి. రూ.కోట్లు కుమ్మరించి చేపట్టిన అభివృద్ధి పనులు అన్నీ బౌండరీ లైను దాట కుండానే అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గూడూరు రూరల్ మండలం నెర్నూరు పంచాయతీ పరిధిలోని పుట్టమరాజువారికండ్రిగ గ్రామాన్ని క్రికెటర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ 2014లో దత్తత తీసుకున్నారు. అదే ఏడాది నవంబరు 16న అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ శిలాఫలకం వేశారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ఎంపీ నిధుల నుంచి రూ.2.79 కోట్లు, కలెక్టర్ నిధుల నుంచి రూ.3 కోట్లు మంజూరు చేశారు.
గ్రామస్తులతో చర్చించకనే..
ఎంపీ ల్యాడ్స్‌తో చేపట్టిన అభివృద్ధి పనుల విషయంలో అధికారులు కనీసం గ్రామస్తులతో చర్చించ కుండానే ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎక్కడ పడితే అక్కడ భవనాలు నిర్మించడంతో నిరుపయోగంగా మారాయి. గూడూరు- తిరుపతి రోడ్డు పక్కనే రూ.115.24 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలు, రూ.74.25 లక్షలతో ఏర్పాటు చేసిన పాఠశాల ఆటస్థలం వినియోగంలోకి రాలేదు. రూ.9.85 లక్షలతో ఆధునికీకరించిన శ్మశాన వాటికలోకి ఇప్పటి వరకు ఒక్క మతదేహాన్ని కూడా తీసుకెళ్లలేదు. అనాదిగా వినియోగిస్తున్న శ్మశాన వాటికనే వినియోగిస్తున్నారు. పాత శ్మశాన వాటికనే అభివృద్ధి చేయాలని గతంలో చెప్పినా వినలేదని గ్రామస్తులు వాపోతున్నారు. 12 ఎకరాల మట్టి కట్టపై పూల మొక్కలు పెంచి అందంగా తీర్చిదిద్దేందుకు రూ.10 లక్షలు కేటాయించినా పనులు మాత్రం జరగలేదు. పేడ దొడ్ల నిర్మాణం అంటూ లక్షలు ధార పోసినా కంపోస్టు యార్డు ఉపయోగ పడని పరిస్థితి. గిరిజనులు ఇప్పటికీ పూరిగుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. గతేడాది వరదల సమయంలో గిరిజనులు అల్లాడిపోయారు. ఇప్పుడిప్పుడే గుడిసెలను పునర్నిర్మించుకుంటున్నారు.
ఆదర్శప్రాయులు
దత్తత తీసుకున్న గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తూ కొందరు శ్రీమంతులనే పేరును సార్ధకం చేసుకుంటున్నారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య స్వగ్రామం వెంకన్నపురాన్ని దత్తత తీసుకున్నారు.కుట్టు శిక్షణ, కంప్యూటర్ శిక్షణ, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, పంచాయతీ కార్యాలయ భవనం, సిమెంట్ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టారు. చంద్రశేఖరపురాన్ని ఎస్పీ విశాల్‌గున్నీ దత్తత తీసుకున్నారు. దత్తత ప్రకటించిన రెండు నెలల వ్యవధిలోనే గ్రామంలోని ప్రధాన రహదారులను జేసీబీతో బాగు చేయించారు. కేవలం రోడ్లతో చేతులు దులుపుకోనని ఓ ప్రణాళిక ప్రకారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ప్రకటించారు.
బలవంతపు దత్తత
ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పలువురు టీడీపీ నాయకులకు దత్తత పేరుతో బలవంతంగా కొన్ని గ్రామాలను అప్పగించారు. దామేగుంటను వెంకటేశ్వర్లునాయుడికి, నార్తురాజుపాళెం శ్రీధర్‌రెడ్డికి అప్పగించినా తట్టెడు మట్టి ఎత్తిన దాఖలాలు లేవు
అభివృద్ధివైపు అడుగులు
కలెక్టర్ జానకి ఉదయగిరి మండలం తిరుమలాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆమె మూడుసార్లు పర్యటించి సమస్యలపై గ్రామస్తులతో గుర్తించి పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందించారు. తిరుమలాపురం, ఎస్‌వి.చింతల, దుంపవారిపల్లి, గుడినరవ, ఎస్టీ కాలనీల్లో మినరల్ వాటర్‌ప్లాం ట్‌లు ఏర్పాటుచేసి ప్రజలకు నీరు అందిస్తున్నారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకొని వినియోగించేలా విజయవంతమయ్యారు. అర్హులైన పేదలందరికీ వివిధ కార్పొరేషన్ల ద్వారా బ్యాం కుల సాయంతో రుణాలు అందజేసేందుకు లబ్ధిదారుల జాబితా తయారుచేశారు. మొదటి ఏడాది కేవలం 14 మంది ఎస్టీలకు రుణాలు మంజూరుచేశారు. కానీ అవి ఇంతవరకు గ్రౌండ్ కాలేదు. దీపం పథకం ద్వారా పంచాయతీలో 53 మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. గుడినరవ-దుంపవారిపల్లి ఎస్టీ కాలనీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. చెరువు అభివృద్ధికి రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి.