ఇక ఆనం ఒంటరే !
నెల్లూరు : అధికార పార్టీ నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. ఆనం సోదరుల వైఖరితో విభేదించి కొందరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పుట్టిమునిగి కాంగ్రెస్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని చూసి మరికొందరు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆ పార్టీకి ప్రస్తుత మున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. మునిగేనావలో తాము ఎందుకనుకుంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం వలసబాట పట్టారు.
ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీకి, ఆనం సోదరులకు గుడ్‌బై చెప్పి బయటకెళ్లిపోగా, మిగిలిన వారు ముహుర్తాలు, అవకాశాలు చూసుకుంటూ తట్టాబుట్టా సిద్ధం చేసుకుంటున్నారు. వీరందరూ మొదట వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గుచూపినప్పటికీ, అక్కడ బెర్తులు దక్కవని భావించి టీడీపీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. మరికొందరు సీఎం కొత్తపార్టీ పెడతాడనే ఆశలో ఉన్నారు.
ఈ పరిణామాలన్నీ జిల్లాలో ఆనం సోదరుల హవాకు గండికొడుతున్నాయి. గ్రూప్ రాజకీయాలకు పేరుగాంచిన ఆనం సోదరులు ఒంటరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికై , పార్టీ విలీనంలో భాగంగా కాంగ్రెస్ సభ్యుడిగా మారిన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఆనం సోదరులకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మొదటి నుంచి టీడీపీ నేతే అయిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీలో చేరారు. ఆనం సోదరుల మద్దతుతో చివరి నిమిషంలో విజయం
సాధించారు. అప్పటి నుంచి వారికి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్‌లోనే ఉంటే నష్టం తప్పదని భావించిన ఆయన వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ముంగమూరు కోరిన సిటీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చే అవకాశం లేకపోవడంతో చివరకు టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కిరణ్ సొంతపార్టీ పెడితే అటువైపు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి అయితే నెలాఖరులో కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఇటీవల ఆదాల హాజరవుతున్న అధికారిక కార్యక్రమాల్లో టీడీపీ శ్రేణులు పాల్గొంటుండటం అందుకు బలం చేకూరుస్తోంది. మొదట టీడీపీలోనే ఉన్న ఆదాల సోమిరెడ్డిని విభేదించి 2004లో కాంగ్రెస్‌లో చేరారు.
అనంతరం ఆనం సోదరులతో సత్సంబంధాలు కొనసాగించినా తర్వాత విభేదాలు పొడచూపాయి. సహకార ఎన్నికల్లో అవి ముదిరిపాకాన పడ్డాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో బంధాన్ని తెంచుకునేందుకు సిద్ధమయ్యాడు. మొదట వైఎస్సార్‌సీపీలో చేరే ప్రయత్నం చేసిన ఆయన సర్వేపల్లి లేనిపక్షంలో నెల్లూరు రూరల్ నుంచి అవకాశం ఇవ్వమని కోరినట్లు సమాచారం. ఇవి రెండు దక్కే పరిస్థితి లేకపోవడంతో చివరకు టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.
కోవూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా అదే దారిలో ఉన్నారు. గతంలో టీడీపీ నేతే అయిన పోలంరెడ్డి కాంగ్రెస్‌ను వీడి సొంతగూటిలో చేరేందుకు సిద్ధమయ్యారు. కోవూరు స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై పోటీ చేసిన ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఆనం సోదరులు చేయివ్వడంతోనే తనకు ఘోర పరాజయం ఎదురైందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కావలి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డి సైతం ఆనం సోదరుల వైఖరిని పూర్తిస్థాయిలో విభేదిస్తున్నారు.
కేవలం సీఎం కిరణ్‌తోనే ఉన్న సాన్నిహిత్యంతోనే ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఓ వైపు ఆనం సోదరులతో విభేదాలు, మరోవైపు సీమాంధ్రలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొందరు ముఖ్య నేతలు విష్ణును వైఎస్సార్‌సీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
సూళ్లూరుపేట నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. దీని వెనుక ఆనం సోదరుల హస్తం ఉందన్న ప్రచారం జరిగింది. మనస్థాపానికి గురైన వాకాటి నారాయణరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. సీఎం పార్టీ పెడితే జిల్లా అధ్యక్షుడిగా వాకాటి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
మంత్రి ఆనం అండదండలతో కాంగ్రెస్ చేరిన ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి సైతం ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో కొనసాగితే భవిష్యత్తు ఉండదనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి సైతం ఆనం సోదరులను విభేదిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన పనబాక కృష్ణయ్య విజయానికి అక్కడి ఆనం వర్గీయులు అడ్డుపడినట్లు ప్రచారం ఉంది.