
సాక్షి, నెల్లూరు : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి ఎన్నికల్లో ఓటమి తప్పదని అర్థమైందని, అందుకే ఆ నెపాన్ని ఈవీఎంలపై వేయాలని హంగామా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విమర్శించారు. ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే ఇతరులపై ఆయన దాడి చేస్తున్నారని, ఎన్నికల ముందు తనకు అనుకూలంగా ఉన్న అధికారులను ఎస్పీలుగా, కలెక్టర్లుగా చంద్రబాబు నియమించుకున్నారని, ప్రజలను మెప్పించి కాకుండా అధికారుల సహకారంతో ఎన్నికల్లో గెలవాలని ఆయన అనుకున్నారని అన్నారు.
ఈవీఎంను దొంగిలించిన కేసులో నిందితుడైన హరిప్రసాద్‌కు 14 రోజుల రిమాండ్ కూడా విధించారని, అలాంటి వ్యక్తిని ఎన్నికల కమిషన్ వద్దకు చంద్రబాబు ఎలా తీసుకెళతారని ప్రశ్నించారు. సొంత ఓటు గురించి కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, అధికారాన్ని అడ్డంపెట్టుకుని కలెక్టర్లు, ఎస్పీలను బెదిరించి.. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేశారని, విలువలు దిగజార్చిన ఆయన గురించి మాట్లాడాలంటే సభ్యత అడ్డం వస్తోందని ఆనం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment