ఘనంగా మేడే
సాక్షి, బెంగళూరు : తమ స్వేదాన్ని ఇంధనంగా మార్చి ప్రపంచ ప్రగతి రథ చక్రాలను నడుపుతున్న కార్మికులు ‘మే’ డే సంబరాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలోని దాదాపు 70కి పైగా కార్మిక సంఘాలు ఒకే చోట చేరి సంబరాలను నిర్వహించాయి. నగరంలోని ఫ్రీడం పార్క్ నుంచి సిటీ రైల్వేస్టేషన్ వరకు బృహత్ ర్యాలీని నిర్వహించాయి. ఈ సందర్భంగా ఫ్రీడం పార్క్‌లో నిర్వహించిన సమావేశంలో టీయుసీసీఐ అధ్యక్షుడు జి.ఆర్.శివశంకర్ మాట్లాడుతూ... కాంట్రాక్టు, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు కనిష వేతనం, ఇఎస్‌ఐ, భవిష్యనిధి వంటి సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో హోటల్, రిసార్టు రంగాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయని, అయితే వాటిలో పనిచేస్తున్న కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లోని కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి సమస్యలు తీర్చే దిశగా ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు మినర్వా సర్కిల్ నుంచి బన్నప్ప పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బన్నప్ప పార్క్ వద్ద నిర్వహించిన బిహ రంగ సమావేశంలో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి రాజన్ మాట్లాడుతూ...ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికులకు భవిష్యనిధితో పాటు రూ.3వేల పింఛన్‌ను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్‌ల సాధన కోసం రానున్న రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేయనున్నట్లు పేర్కొన్నారు.