1947 ఆగస్ట్ 7న ఉదయమే బొంబాయిలోని మజ్గావ్‌లో ఉన్న ఇస్నాషరి శ్మశానవాటికకు వెళ్లారు జిన్నా. చేతిలో పుష్పగుచ్ఛం. ఒకచోట పెద్ద పేటిక వంటి పాలరాతి సమాధి ముందు నిలిచారు. ముందు భాగంలో శిలాఫలకం మీద నల్లటి అక్షరాలు : రతన్‌బాయి మహమ్మద్ అలీ జిన్నా (జననం 20 ఫిబ్రవరి 1900–మరణం 20 ఫిబ్రవరి 1929). పుష్పగుచ్ఛం ఆ సమాధి మీద పెట్టారు. రతన్‌బాయి పెటిట్ లేదా రతన్‌బాయి జిన్నా లేదా రూతీ.. జిన్నా భార్యే. బొంబాయి కోటీశ్వరులలో ఒకరైన దిన్షా మానేక్‌జీ పెటిట్, దీన్‌ల కూతురు రూతీ. జిన్నా ప్రేమలో పడింది.
అప్పటికి జిన్నా వయసు 41 ఏళ్లు. అంత వయసున్న జిన్నాను మైనారిటీ తీరని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించింది? జిన్నాకు ఆ రోజుల్లో ఉన్న ఖ్యాతి వల్లనే. కరాచీ వదిలి బొంబాయి వచ్చిన జిన్నా పెద్ద బారిస్టర్ అయ్యారు. 1904 నాటికే భారత జాతీయ కాంగ్రెస్‌లో ముఖ్యుడయ్యారు. 1910 నాటికే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. గోపాలకృష్ణ గోఖలేకే కాదు, బాలగంగాధర్ తిలక్‌కూ, అనిబీసెంట్‌కూ, మదన్‌మోహన్ మాలవీయకూ సన్నిహితులు. సరోజినీ నాయుడు.. జిన్నాను హిందూ ముస్లిం స్నేహ వారధిగా శ్లాఘించేవారు. కొన్ని అభిరుచులు కూడా జిన్నాను ఆ రూతీకి చేరువచేశాయి.
అయితే ఆ ఇద్దరు మాట్లాడుకోకుండా దిన్షా పెటిట్ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చారు. కానీ పద్దెనిమిదేళ్లు నిండగానే రూతీ మలబార్ హిల్స్‌లోనే ఉన్న జిన్నా పాత ఇంటికి కట్టుబట్టలతో వచ్చేశారు. ఆ ఇంటిలోనే జిన్నా ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. భర్తను ‘జే’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారామె. 1919 ఆగస్ట్ 14న వారికి కూతురు దీనా (వాడియా) పుట్టింది. తరువాత జిన్నా ముస్లింలీగ్ రాజకీయాలలో తలమునకలైపోయారు. అప్పటికే రూతీకి పేగు క్యాన్సర్. సరిగ్గా పుట్టిన రోజునే అంటే 1929 ఫిబ్రవరి 20న ఆమె కన్ను మూశారు.
దేశ విభజన సమయంలో తనతో పాకిస్తాన్ వచ్చేయమని కూతురు దీనాను ఆర్తితోనే అడిగారు జిన్నా. ఆమె వెళ్లలేదు. ప్రతి ఆగస్ట్ 14న పాకిస్తాన్ ఆవిర్భావ దినోత్సవానికి జెండా ఎగురవేస్తుంటే భారత్‌లోనే ఉండిపోయిన ఒక్కగానొక్క కూతురు దీనా పుట్టినరోజు గుర్తుకు రాకుండా ఉంటుందా? కానీ అలాంటి హింసాత్మక సంఘర్షణకు గురయ్యే పరిస్థితి నుంచి కాలమే అతడిని కరుణించింది. 1948 సెప్టెంబర్ 11న, పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి ఏడాదే మేధస్సుతో కాకుండా, హృదయంతో స్పందించడం మొదలు పెడుతున్న వేళ బారిస్ట్టర్ జిన్నా చనిపోయారు.
(చదవండి: ఉద్యమం కాదు.. మహాభారత యుద్ధం!)
Comments
Please login to add a commentAdd a comment