కళాశాలలో మెరిట్ సర్టిఫికెట్ అందుకుంటున్న మిద్దె రూప
వైవీయూ: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది కడపకు చెందిన యువతి మిద్దె రూప. ఆర్థిక ఇబ్బందులు వెక్కిరిస్తున్నా.. అధ్యాపకుల తోడ్పాటుతో అన్ని రంగాల్లో రాణిస్తూ సత్తా చాటుతున్న ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్త్రి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్‌లో ప్రసంగించే అరుదైన చాన్స్ పొందింది.
దేశవ్యాప్తంగా 15 మంది యువతీ యువకులను పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేయగా, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కడప జిల్లాకు చెందిన మిద్దె రూప ఒక్కరే ఉండటం విశేషం. వైఎస్సార్ జిల్లా రైల్వే కొండాపురానికి చెందిన మిద్దె సత్యనారాయణ (లారీ డ్రైవర్), రమాదేవి (గృహిణి) దంపతుల కుమార్తె మిద్దె రూప కడపలోని ఎస్‌కేఆర్ అండ్ ఎస్‌కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ టూరిజం కోర్సును ఇటీవల పూర్తి చేసింది.
అధ్యాపకులు, ప్రిన్సిపాల్ తోడ్పాటుతో రూప చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణిస్తూ పోటీ ఏదైనా విజేతగా నిలుస్తూ వచ్చింది. ప్రస్తుతం ఆమె దాతల సహకారంతో హైదరాబాద్‌లోని ఓ స్టడీ సర్కిల్‌లో సివిల్స్‌కు సన్నద్ధం అవుతోంది.
ప్రభుత్వ కళాశాల నుంచి పార్లమెంట్ వరకు...
అక్టోబర్ రెండో తేదీన పార్లమెంట్‌లో ప్రసంగించే విద్యార్థులు, యువతీ యువకులను ఎంపిక చేసేందుకు నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న తొలుత జిల్లాస్థాయిలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా, వీరిలో రూప అగ్రస్థానంలో నిలిచింది. తర్వాత రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన నలుగురిలో ఒకరిగా నిలిచింది.
అనంతరం జాతీయ స్థాయిలో 35 మంది పోటీపడ్డారు. చివరగా టాప్–15 అభ్యర్థులను పార్లమెంట్‌లో ప్రసంగించేందుకు ఎంపిక చేశారు. ఈ 15 మంది జాబితాలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక విద్యార్థిని మిద్దె రూప కావడం విశేషం. రూప పార్లమెంట్‌లో అక్టోబర్ 2వ తేదీన మహాత్మాగాంధీ గురించి ఇంగ్లిష్‌లో ప్రసంగించనుంది.
కడప విద్యార్థినికి పార్లమెంట్‌లో ప్రసంగించే అవకాశం లభించడంపై నెహ్రూ యువకేంద్రం జిల్లా సమన్వయకర్త మణికంఠ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సుబ్బలక్షుమ్మ, చరిత్ర అధ్యాపకుడు బాలగొండ గంగాధర్ తదితరులు సంతోషం వ్యక్తంచేశారు. (క్లిక్ చేయండి: దళిత సాహిత్య కృషికి దక్కిన గౌరవం)
Comments
Please login to add a commentAdd a comment