అమృత మహోత్సవం ముగిసింది! స్వర్ణ శకం ప్రారంభమైంది! కొత్త సంకల్పాలతో, కొత్త సంతోషాలతో, నవయుగంలోకి ప్రవేశిస్తున్నాం. వచ్చే 25 ఏళ్ల ప్రయాణాన్ని గతిశక్తితో, అగ్నిపథంలో ఆరంభిస్తున్నాం. ఈ స్ఫూర్తి 130 కోట్ల ప్రజల సమీకరణ, అనుసంధానం ద్వారా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను చేపట్టడంతో మొదలైంది.
ఈ వేడుకల ప్రధాన స్ఫూర్తి ప్రజా భాగస్వామ్యమే. ఈ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం ఒక జాతీయ పండుగగా మారి, స్వాతంత్య్ర సమర స్ఫూర్తి, త్యాగం, అంకిత భావం నేటి తరానికి అనుభవంలోకి వచ్చాయి. తద్వారా ఈ మహోత్సవం సనాతన భారత ఆత్మవిశ్వాసం సాక్షాత్కరించే పండుగగా రూపుదాల్చింది. అమృత మహోత్సవంలో భాగమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు దేశాన్ని సమైక్యంగా ఉంచేవి.
మరికొన్ని దేశానికి పురోగతిని అందించేవి. ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్, వినియోగదారులకు సాధికారత, విద్యార్థుల ద్వారా ప్రధానికి పోస్ట్ కార్డులు రాయించడం, ఎర్రకోట వద్ద వేడుకలు.. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాల జాతీయ భావనకు ప్రేరణనిస్తాయి. ‘‘ఈ 21 వ శతాబ్దంలో ప్రపంచం వేగంగా మారిపోతోంది.
కొత్త అవసరాలకు అనుగుణంగా భారతదేశ ప్రజానీకంలో, యువతరంలో ఆశలు, ఆకాంక్ష పెరిగిపోతున్నాయి. వాటిని నెరవేర్చవలసిన ప్రజాస్వామ్య వ్యవస్థల్ని వచ్చే పాతికేళ్ల కోసం సంసిద్ధం చేసుకోవాలి. అందుకు ఈ అమృత మహోత్సవాల కృషి, చిత్తశుద్ధి తోడ్పడతాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు. మనం ఇక కలిసికట్టుగా స్వర్ణోత్సవ స్వాతంత్య్ర భారతంలోకి పయనించవలసిన తరుణం ఆసన్నమైంది.
(చదవండి: ఆ రోజు.. ఐదు నదులకు పోటీగా పంజాబ్‌లో నెత్తురు పారింది!)
Comments
Please login to add a commentAdd a comment