సమాజంలో పత్రికలది ప్రధాన పాత్ర. ఒక్క పత్రిక చాలు వెయ్యిమంది సైన్యంతో సమానం అని పెద్దలు పేర్కొంటారు. పత్రికలు సమాజాన్ని ఎంత గొప్పగా ప్రభావితం చేస్తాయో స్వాతంత్య్ర ఉద్యమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఎందరో దేశభక్తులు తమ చదువు, విజ్ఞానం కలబోసి ఉన్నంతలో పత్రికలను వెలువరించారు. సమాజం పట్ల తమ ధోరణి, నిరసనను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. భరతమాతను బానిస సంకెళ్ల నుంచి విడిపించడానికి జరిగిన పోరాటంలో జిల్లా పత్రికలు కీలకపాత్ర పోషించాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జిల్లాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన పత్రికలు, సంపాదకులు, నిర్వాహకుల గురించి సాక్షి ప్రత్యేక కథనం..
కడప కల్చరల్: 1835లో బళ్లారి నుంచి వెలువడిన సత్యదూతను తొలి తెలుగు పత్రికగా చెప్పాల్సి వస్తుంది. తెలుగు జర్నలిజానికి మాతృభూమి రాయలసీమేనని పలువురు పేర్కొంటారు.మరికొందరు తొలి పత్రిక వృత్తాంతిని అని కూడా చెబుతారు. ఈ పత్రిక సంపాదకులు కడపజిల్లాకు చెందిన మండిగల వెంకటరామశాస్త్రి. వృత్తాంతిని పత్రికను ఆయన మద్రాసు నుంచి వెలువరించేవారు. అప్పట్లో దానికి ఫ్రముఖ దినపత్రికగా పేరుండేది.
ఆంధ్రపత్రిక తొలి సంపాదకుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు స్వరాజ్య పత్రికలో రాసిన సంపాదకీయానికి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అలా స్వాతంత్య్ర పోరాటంలో తొలిసారిగా జైలుకు వెళ్లిన ఈ ప్రాంతం వ్యక్తిగా గాడిచర్ల పేరొందారు. ఎడిటర్ అన్న పదానికి సంపాదకుడని అనువాదం చేసింది కూడా ఆయనే అంటారు. భారత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో పత్రికలు ఉద్యమానికి అండగా నిలిచి ప్రజల్లో జాతీయ భావాలను రగిలించాయి. ఎన్నో పత్రికలు ఎన్నెన్నో రకాల వ్యాసాలు, కథనాలతో తెలుగు నేలను ప్రభావితం చేశాయి.
కడప నుంచి కూడా..
జిల్లా స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ప్రధానంగా పత్రికా రంగ వికాస దశలో జిల్లాలో తొలి పత్రిక వెలువడినట్లు తెలుస్తోంది. 1897–98 ప్రాంతంలో ప్రభావతి పేరిట కడప నగరం నుంచి తొలి పత్రిక వెలువడింది. దీనిని టి.గోపాలనాయుడు కంపెనీ వారు తమ కల్యాణ కుమార్ విలాస్ ముద్రణాలయం నుంచి ప్రచురించారు. 1899లో ఆ సంస్థ నుంచి పూర్ణిమ అనే మరోమాస పత్రిక కూడా వెలువడింది 1910లో ఆంధ్ర చంద్రిక అనే వారపత్రిక ప్రొద్దుటూరు నుంచి బీఎన్ స్వామి సంపాదకత్వంలో వచ్చింది. ఇది రాజకీయ, సాంఘిక అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. 1920లో కడప నుంచి క్రైస్తవ సమాజం పక్షాన గెయిల్స్ మెయిల్ అనే ఆంద్ల మాసపత్రిక వెలువడేది.
ఇంకా....
1924లో రాజంపేట నుంచి పద్మశాలీయ సంఘం పక్షాన పద్మశాలి అనే పత్రిక వెలువడింది. 1925లో అవధానం కృష్ణముని ఆధ్వర్యంలో బ్రహ్మనందిని పత్రికను ప్రొద్టుటూరు నుంచి వెలువరించారు. గాంధేయవాది ఏకే మునికి తోడుగా ప్రముఖ సాహితీవేత్త కైక శేషశాస్త్రి, దుర్బాక రాజశేఖర శతావధాని లాంటి కవులు ఈ పత్రికలో సాహిత్య ప్రచారానికి దోహదం చేశారు. 1926లో ప్రొద్దుటూరు నుంచి దాదాపు పదేళ్లపాటు భారత కథానిధి పేరిట మాసపత్రిక వెలువడింది. 1927లో కడప నుంచి గుళ్లపల్లి వెంకట పున్నయ్య సంపాదకత్వంలో ప్రజాశక్తి వారపత్రిక వచ్చింది.
1928లో పచ్చిమాంధ్ర అనే వారపత్రిక కడప నుంచి జీవీ పున్నయ్యశాస్త్రి సంపాదకత్వంలో వచ్చింది. 1929–31 మధ్యకాలంలో ఆర్య ప్రణాళిక పేరిట గడియారం చిదంబరయ్య సంపాదకత్వంలో జమ్మలమడుగు నుంచి పత్రిక వెలువడింది. 1929లో భక్త సంజీవిని పేరిట వావిలికొలను సుబ్బారావు సంపాదకత్వంలో ఒంటిమిట్ట నుంచి మాస పత్రిక వెలువడింది. 1940లో కడపజిల్లా ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కందుల బాలనారాయణరెడ్డి ప్రధాన సంపాదకుడిగా వెల్లాల మైసూరయ్య సహాయకునిగా ప్రొద్దుటూరు నుంచి రేనాడు వారపత్రక వెలువడేది.
ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూ
1940లో మాజీ శాసనసభ్యులు వై.ఆదినారాయణరెడ్డి సంపాదకునిగా మాజీ ఎమ్మెల్యే శంభురెడ్డి ఉప సంపాదకునిగా కడప నుంచి ఆజాద్ హింద్ పత్రిక వెలువడింది. ఇది జిల్లాలో రాజకీయ చైతన్యానికి దోహదం చేసింది. 1945లో రహస్యం పత్రిక పి.కృష్ణారెడ్డి సంపాదకునిగా, వైసీవీ రెడ్డి ఉప సంపాదకునిగా వెలువడేది. ఇందులో సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని బహిర్గతం చేసేవారు. 1946లో రెడ్డి పేరిట పక్షపత్రికను కడప నుంచి బి.సుబ్బారెడ్డి సంపాదకత్వంలో వెలువరించారు. ఇలా కడప జిల్లా నుంచి పలు దిన, వార, మాసపత్రికలు స్వాతంత్రోద్యమ పోరాటస్ఫూర్తిని రగిలిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment