విజయవాడలో జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. చిత్రంలో ప్రజాప్రతినిధులు, అధికారులు
సాక్షి, అమరావతి: స్వాతంత్యోద్రమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి అంతా పునరంకితం కావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్ది ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టడం మనలక్ష్యం కావాలన్నారు. సాక్షి మీడియా గ్రూప్ శుక్రవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు చేసిన ఉద్యమాలు, త్యాగాల ఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలని గుర్తుచేశారు.
మహనీయుల ఆశయాలను సాధించడమే మన కర్తవ్యం కావాలన్నారు. రాష్ట్రానికి చెందిన ఎంతోమంది స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం అలుపెరగని పోరాటం చేశారని గవర్నర్ పేర్కొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనే అదృష్టం తనకు దక్కిందన్నారు. పింగళి వెంకయ్య స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీక గా జాతీయ జెండాను రూపొందించి దేశానికి అం దించారన్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో జాతీ య జెండాను ఈ నెల 15వరకు ప్రతి ఇంటిపై ఎగు రవేసేలా ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును జయప్ర దం చేయాలని కోరారు. ఈ ఉత్సవా లను నిర్వహిం చిన సాక్షి మీడియా గ్రూప్‌ను అభినందించారు.
కలసి పనిచేద్దాం
స్వాతంత్య్రోదమ స్ఫూర్తితో దేశాభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ కోరారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య రాష్ట్రానికి చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను సత్కరించి మహనీయుడి సేవలకు సముచిత గౌరవం కల్పించారని తెలిపారు.
సదా స్ఫూర్తిదాయకం
దేశ ప్రజలు 75 ఏళ్లుగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం అందుకు రెండింతల కాలం పాటు ఉద్యమించాల్సి వచ్చిందని సాక్షి ఎడిటర్ వర్ధెల్లి మురళి గుర్తు చేశారు. 150 ఏళ్ల స్వాతంత్య్ర పోరాటంలో వివిధ దశలను ఆయన వివరించారు. మొదటి 50 ఏళ్లు ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాలు చేయగా అనంతరం మరో వందేళ్ల పాటు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నిర్వహించిన తరువాతే దేశానికి స్వేచ్ఛ లభించిందన్నారు.
భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వంలో గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, మహాత్మాగాంధీ, నెహ్రూ లాంటి నేతలు ఒకవైపు ఉద్యమించగా సమాంతరంగా మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, అల్లూరి సీతారామరాజు లాంటి విప్లవ వీరులు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాలు దేశ ప్రజలకు సదా స్ఫూర్తిదాయకమన్నారు.
స్వాతంత్య్ర ఫలాలు కేవలం కొందరికే కాకుండా పేద, నిమ్న వర్గాలకు అందించాలన్న సత్సంకల్పంతో బీఆర్ అంబేడ్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారన్నారు. గొప్ప పోరాటాల ఫలితంగా లభించిన స్వాతంత్య్రాన్ని సద్వినియోగం చేసుకుని దేశాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.
సమరయోధుల కుటుంబాలకు సన్మానం
ఆజాదీ కా అమృత్ మహాత్సవ్ సందర్భంగా రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సాక్షి మీడియా గ్రూప్ సన్మానించింది. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చేతుల మీదుగా వారిని సత్కరించింది. సత్కారం అందుకున్నవారిలో పింగళి వెంకయ్య మనవరాలు సుశీల, కొప్పల్లి హనుమంతరావు మనవడు కొప్పల్లి హనుమంతరావు, కాకాని వెంకటరత్నం మనవడు విజయ్‌కుమార్, అయ్యదేవర కాళేశ్వరరావు మనవడు మహాబలేశ్వరరావు, చింతకాయల బుల్లెమ్మ, సత్యన్నారాయణ దంపతుల కుమారుడు చిట్టిబాబు, పసల కృష్ణమూర్తి, అంజిలక్ష్మి దంపతుల కుమార్తె కృష్ణ భారతి, పెనుమత్స సుబ్బన్న సతీమణి పెనుమత్స శ్యామల ఉన్నారు. గవర్నర్ వారిని సత్కరించి మెమెంటో బహూకరించారు.
విద్యార్థులకు బహుమతులు
ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా వారం రోజులపాటు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గవర్నర్ వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కాంతిరాణా, సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ నేమాని భాస్కర్ తదితరులతోపాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment