![PM Modi Urged People To Make Efforts To Remove Malnutrition - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/28/Modi.jpg.webp?itok=MTIloG2F)
న్యూఢిల్లీ: దేశంలో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రజలు కృషి చేయాలని, దానికి సామాజిక అవగాహన కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా జాతినుద్దేశించి ప్రసంగించారు. భారత్ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహించిన ‘అమృత్ మహోత్సవ్’ అమృత ధారలు దేశం నలుమూలలా ప్రవహించాయని పేర్కొన్నారు.
‘పండుగలతోపాటు ఈ సారి సెప్టెంబర్ నెలను పోషకాహారంపై ప్రచారానికి అంకితం చేద్దాం. మనం సెప్టెంబర్ 1 నుంచి 30 తేదీ వరకూ ‘షోషణ్ మాహ్’ ( పోషకాహార మాసం)గా పాటిద్దాం. పోషకాహార నివారణకు చాలా సృజనాత్మక, విభిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పోషణ్ అభియాన్‌లో సాంకేతిక, ప్రజాభాగస్వామ్యాన్ని మెరుగైన పద్ధతుల్లో వాడటం చాలా కీలకం. భారత్‌లో పోషకాహార లోపాన్ని రూపుమాపడంలో ‘జల్‌జీవన్ మిషన్’ భారీగా ప్రభావం చూపనుంది. పోషకాహార లోపాన్ని రూపుమాపటంలో సామాజిక అవగాహన కీలక పాత్ర పోషిస్తుంది.’ అని ప్రధాని మోదీ తెలిపారు. దూరదర్శన్‌లో స్వతంత్ర సమరయోధుల త్యాగాలపై వచ్చే ‘స్వరాజ్’ సీరియల్‌ను వీక్షించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు ప్రధాని మోదీ. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న యోధుల కృషిని యువతరానికి తెలియజేయడానికి ఇదో గొప్ప ప్రయత్నమన్నారు.
ఇదీ చదవండి: బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై సీబీఐ దర్యాప్తు?
Comments
Please login to add a commentAdd a comment