స్వార్థపరుల గొంతెమ్మ కోర్కెల వల్లే సంపద అందరికీ సమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు గాంధీ. ధనిక, పేద వర్గాలుగా విడిపోయిన సామాజిక పరిస్థితుల నిర్మూలనే దేశంలో రావాల్సిన సాంఘిక విప్లవానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు లోహియా. కేంద్రంలో అధికారం చలాయించిన ఏలికలూ, రకరకాల రంగుల ఐక్య సంఘటన ప్రభుత్వాలూ కూడా ఇలాంటి మహనీయుల మాటలను పెడచెవిన పెట్టాయి. కాలక్రమంలో జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. మార్పును ప్రతిఘటించేవే గొప్ప శక్తులుగా చలామణీ అవుతున్నాయి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ శుభముహూర్తాన అయినా మహనీయుల మాటల్ని మననం చేసుకుందాం. మనల్ని మనం మార్చుకుందాం.
‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ ఈ మన దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందు బాటులోకి రాకపోవడానికి అసలు కారణం– ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొద్దిమంది స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోర్కెలే.’’
– మహాత్మా గాంధీ
భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండి, ఈ ఏడాది అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న శుభముహూర్తాన, భావి తరాల జాగ్రత్త కోసం గాంధీజీ గుర్తు చేసిన ఈ హెచ్చరికలోని ఔన్నత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. దేశ పగ్గాలు చేబట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలోని ఏలికలూ, రకరకాల రంగుల ఐక్య సంఘటన ప్రభుత్వాలూ కూడా కాలం గడిచిన కొద్దీ గాంధీజీ హెచ్చరికలను ఆచరణలో పెడచెవిన పెట్టినవే. ప్రజాబాహుళ్యాన్ని మోసగించినవే.
ఈ పరిణామాల్ని నిశిత దృష్టితో ఎప్పటికప్పుడు పరిశీలిçస్తూ వచ్చిన నిస్వార్థపరుడైన సోషలిస్టు నాయకుడు రామ మనోహర్ లోహియా తన నిశితమైన అంచనాను ఏనాడో అందించారు: ‘‘జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. ఎలా? ఉన్నత కులాల వారు సంస్కారం ఉన్న కుతంత్రపరులుగానూ, బడుగు కులాల వారేమో మార్పు ఎరుగని జీవచ్ఛవాలుగానూ తయార య్యారు. దేశంలోని మేధావుల్ని గుర్తించడం కోసం కొలబద్దగా వారి విజ్ఞాన సంపదను గణించడానికి బదులుగా వారి మాటల్లోని సొంపులు, సొగసులు మాత్రమే తీసుకోవడం జరుగుతోంది.
నిర్మొహమాటం, నిర్భయత్వం అనే సుగుణాల కన్నా చాకచక్యం, కుహనా విధేయత, చాటుమాటు వ్యవహారాలు అనేవి ఔన్నత్యానికి చిహ్నాలుగా మారాయి. రాజకీయ జీవితంలో బొంకులకు గొప్ప గౌరవ స్థానం లభించింది. సంకుచిత తత్వం, స్వార్థపరత, బొంకు– ఈ దారుణాలు గొప్పవిగానూ... కుల వ్యవస్థ మార్పును ప్రతిఘటించే గొప్ప శక్తులుగానూ తయారయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత పౌరుల్ని స్వదేశంలోనే పరాయివారుగా చూస్తున్నారు.’’
అంతేగాదు, ఈ దేశంలో నిజమైన సాంఘిక విప్లవానికి, ధనిక పేద వర్గాలుగా విడిపోయిన సామాజిక పరిస్థితుల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు లోహియా. అందుకోసం భారత సమాజంలో ఆదాయాల రూపంలో గానీ, సామాజిక గౌరవ ప్రపత్తుల రూపంలో గానీ పీడిస్తున్న అసమానతలు 10 లక్షల రకాలుగా ఆయన అంచనా వేశారు. ఇంతటి వ్యత్యాసాల మధ్య, ఇంతటి అసమానతల మధ్య జీవిస్తున్న సామాన్య భారతీయులైన అట్టడుగు నిరుపేదల మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా లోహియా అంచనా ఇచ్చారు. ఎవరికి వారు తనకన్నా హీన స్థితిలో ఉన్న వాడినిచూసి, తాను మెరుగ్గా ఉన్నానన్న ఆత్మ సంతృప్తితో నేడు పేదవాళ్లు బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని పేదవాళ్లు ఏ విప్లవాలనూ అర్థం చేసుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజకీయవేత్తలంటే ‘చొల్లు కబుర్లుగాళ్ల’న్న అభిప్రాయం కూడా వారిలో ఏర్పడిందని లోహియా భావించారు.
భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన దళిత నాయకుడు డాక్టర్ అంబేడ్కర్... ‘గొప్ప వ్యక్తీ, గాంధీ తర్వాత ఏ గొప్ప అగ్రవర్ణ హిందువుతోనైనా తూగగల్గిన గొప్ప నాయకుడూ’ అని లోహియాను కీర్తించారు. సర్వమత సమ్మేళనానికి ఉద్దేశించిన చికాగో (అమెరికా) ప్రపంచ మహాసభ ద్వారా ప్రపంచాన్ని మత్తిల్ల చేసిన వివేకానందుడు– మరోసారి బుద్ధుడు ఈ దేశంలోకి అడుగుపెడితే తప్ప భారత ప్రజా బాహుళ్యానికి ముక్తి ఉండబోదన్నారు!
తీరా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు కలవర పరుస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్ పాలకవర్గం ఇతర ప్రతిపక్షాల నాయకుల బెడదను వదిలించుకోవడం కోసం వారిని క్రిమినల్ కేసుల ద్వారా వేధించుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే, దేశంలో రాజ్యాంగ ఫెడరల్ స్వభావాల్ని తారుమారు చేసే యత్నంలో ఉన్న బీజేపీ– ఆర్‌ఎస్‌ఎస్ పాలకులు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రతిపక్ష ప్రభుత్వాలు విమర్శించడం దేశ ప్రయోజనాల దృష్ట్యా సబబే. బీజేపీ పాలకులు చేస్తున్నదాన్ని ఎవరో కాదు, స్వయాన బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన వరుణ్ గాంధీయే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా బాహుళ్యం నడ్డివిరుస్తూ తలపెడుతున్న జీఎస్టీ బాదుడు వల్ల ఒక్క గ్యాస్ సిలిండర్ రీఫిల్ సౌకర్యాన్ని గత ఐదేళ్లలో 4.13 కోట్ల మంది ప్రజలు కోల్పోయారని వెల్లడించారు. కాగా 7.67 కోట్లమందికి కేవలం ఒకే ఒక్క ఎల్పీజీ రీఫిల్ అవకాశం దక్కింది.
భారతదేశ అవినీతిమయ బడాబాబులకు సంబంధించిన స్విస్ బ్యాంకుల్లోని దొంగ ఖాతాలను వెలికితీసి, అందులో మూలుగుతున్న సంపదను తెస్తామనీ, దేశంలోని ఒక్కో పేద కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామనీ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ హామీ కాస్తా ఆచరణలో ‘‘నీటిమూట’’గా మారింది. ఈ దారుణ పరిణామాలు, అబద్ధాల చిట్టా గీత ఈ పదేళ్ళలో భారత ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి. దేశ స్వాతంత్య్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి ‘‘మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని రచించుకుని, మా భావి భాగ్యోదయం కోసం మాకు అంకితం ఇచ్చుకుంటున్నాం’’ అని స్వయంగా ప్రకటించుకున్న ప్రజాబాహుళ్యానికి పాలకులు తలపెట్టిన క్షమించరాని అన్యాయం ఇది.
భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండి అమృతోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో మహాత్మాగాంధీ లాంటివారి త్యాగాలు స్మరణకు రావడం సహజం. కానీ అదే గాంధీజీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను దయ్యంగా కాకుండా దేవుడిగా కొలవమని పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడాన్ని అనుమతించిన పాలకులను ప్రజలు క్షమించగలరా? కనుకనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏ రాజకీయ పార్టీ అయినా ‘కాలుగాలిన పిల్లి’లా మౌనంగా ఉంటోందే గానీ, ‘గజ్జె కట్టడానికి’ ముందుకు రావడం లేదని విమర్శించాల్సి వచ్చింది.
‘హిందుత్వ’వాదులు ఇతర మత మైనార్టీలపై స్వేచ్ఛగా జరుపుతున్న దాడులను పాలకులు అదుపు చేయడంలేదు సరికదా... 2002 నాటి గుజరాత్ మైనారిటీలపై నాటి ప్రభుత్వం జరిపిన ఊచకోతలను ఖండిస్తూ పాలక బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కొట్టివేయించుకున్న ఘటన కూడా తాజా చరిత్రకు ఎక్కడం మరో విశేషం. ఈ అమృతోత్సవాల సందర్భంగానైనా మరెవరి మాటలనో కాదు, కనీసం కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజిజూ అన్న మాటలనైనా పాలకులు పట్టించుకోవాలి.
‘‘దేశంలో కోర్టులున్నది సంపన్న వర్గాల కోసమే కాదు. న్యాయస్థాన ద్వారాలు అందరికీ సమంగా తెరచి ఉండాలి. ఒక్కొక్క సమావేశంలో పాల్గొనడానికి కక్షిదారుల వద్ద లాయర్లు 10–15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే సామాన్య మానవుడికి న్యాయం దక్కేదెలా?’’ అని ఆయన అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాల ఫలితం ఆచరణలో అందరికీ దక్కాలంటే విధానాలు మారవలసిందేనన్న రిజిజూ మాట అయినా ప్రధాని మోదీ గౌరవిస్తారా?
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment