
న్యూఢిల్లీ: దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో సమర యోధులు సర్వస్వాన్ని ధారపోశారని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. వారి అమూల్య త్యాగాలను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృతోత్సవ్ సరైన సందర్భమన్నారు. వారి స్ఫూర్తి గాథలను యువ తరానికి వినిపించి వారిలో దేశభక్తి, సేవా భావం, త్యాగ గుణం వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్ర సిద్ధికి ఎంతగా పోరాడాల్సి వచ్చిందో ఎన్నడూ మరవకూడదన్నారు.
76వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ధన్‌ఖడ్ ఆదివారం ప్రజలకు సందేశమిచ్చారు. ‘‘క్రూరమైన బ్రిటిష్ వలస నుంచి దేశాన్ని విముక్తం చేసిన వీరుల ధైర్య సాహసాలు, త్యాగాలను పంద్రాగస్టు సందర్భంగా మరోసారి గుర్తు తెచ్చుకుని వారికి ఘనంగా నివాళులర్పిద్దాం. నేటి భారతం అంతులేని శక్తి సామర్థ్యాలను కళకళలాడుతోంది. సర్వతోముఖ వృద్ధి పథంలో వడివడిగా పరుగులు పెడుతోంది. జాతి విలువలను, రాజక్యాంగ విలువలను సమున్నతంగా నిలిపేందుకు మరోసారి ప్రతినబూనుదాం. దేశ నిర్మాణ క్రతువుకు పునరకింతం అవుదాం’’ అంటూ పిలుపునిచ్చారు.