వందేళ్లు దాటినా తరగని ఉత్సాహంతో పేపర్ చదువుతున్న రుద్రప్ప
స్వాతంత్య్ర సమరయోధుడైన ఆయనంటే అందరికీ గౌరవం. అచంచల దేశభక్తి ఆయన సొంతం. స్వాతంత్య్రం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. వందేళ్లు దాటినా అదే తరగని ఉత్సాహం. నేటికీ తన పని తాను చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్నారు. రోజూ ఉదయం గ్రంథాలయానికి వెళ్లి పత్రికలు, పుస్తకాలు చదువుతుంటారు. ఆయన అచ్చం గాంధీలానే కనిపిస్తారు. అందుకే చెట్ల రుద్రప్ప ‘శెట్టూరు గాంధీ’గా పేరుతెచ్చుకున్నారు.
అనంతపురం కల్చరల్: స్వాతంత్య్రం కోసం భారతీయులు చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించారు. నాయకులను నిర్బంధించి.. జైలుకు పంపితే ఉద్యమం ఆపవచ్చని భావించారు. అయితే నాయకుల స్ఫూర్తితో పోరాటంలో భాగస్వాములైన వారు తదుపరి ఉద్యమానికి నాయకత్వం వహిస్తారని ఊహించలేకపోయారు. అలాంటి బాధ్యతలు నిర్వర్తించిన వారిలో జిల్లాకు చెందిన చెట్లరుద్రప్ప ఒకరు. ‘శెట్టూరు గాంధీ’ అని ఆయన్ని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటుంటారు. శతాధిక వృద్ధుడైన ఈయన ఆనాటి జ్ఞాపకాలను ఆజాదీ కా అమృత్ మహోత్సవాల వేళ ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... ‘మా పూర్వీకులందరూ కళ్యాణదుర్గం తాలూకాలోని శెట్టూరు గ్రామంలోనే నివసించారు. మా నాన్న చెట్ల తిమ్మప్ప, అమ్మ రంగమ్మ. నాన్న ఫారెస్ట్ హెడ్ వాచర్‌గా బ్రిటీష్ వారి దగ్గర పనిచేసేవాడు. తిరుమలరావు అని మా గురువు ఉండేవారు. దేశం కోసం పరితపించే ఆయన వద్ద ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. యాజమాని నారాయణరావు, ఉమాబాయి అనే వాళ్లు స్వాతంత్య్రం కోసం పనిచేశారు. కళ్యాణదుర్గానికి చెందిన ఐ.ఓబయ్య, బంగి ఎర్రిస్వామి నన్ను అమితంగా ప్రభావితం చేశారు. ప్రజా సమస్యలంటే ఏవిధంగా ఉంటాయో నేను దగ్గరగా చూశాను.
కరువుకు కనికరం లేదు
స్వాతంత్య్ర పోరాటం సాగుతున్న తరుణంలోనే మా ప్రాంతాలను కరువు పట్టిపీడించేది. మేము ఇంటింటా ధాన్యం సేకరించి ప్రజలకు గంజినందించి ఆకలి తీర్చేవారం. అసలు పోరాటం చేయాలంటే బతికుండాలనే భావన అధికంగా ఉండేది. జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్, నీలం రాజశేఖరరెడ్డి, గుత్తి రామకృష్ణ వంటి వారితో నేను కలిసి పనిచేశాను. వారు అరెస్టై జైలుకెళ్లినా మా ఉద్యమం ఆగలేదు.
తరిమెల నాగిరెడ్డి విడిపించారు
కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు పార్టీలకతీతంగా స్వాతంత్య్ర పోరులో పనిచేశారు. మేమెక్కువగా కమ్యూనిస్టుల వైపే నడిచాము. మా ఊరి కరణం భీమసేనరావు మా నాన్నను, పెద్దనాన్నపాలయ్యను అధికార బలంతో ఉద్యమాలకు పోనీకుండా అరెస్టు చేయించారు. అయితే తరిమెల నాగిరెడ్డి స్వయంగా వచ్చి విడిపించిన సంఘటన నాకింకా గుర్తుంది. స్వాతంత్య్ర పోరుకు మేము సైతం అనే వాళ్ల సంఖ్య అధికంగా ఉండేది.
గాంధీజీకి రక్షణగా సదాశివన్ నిలబడ్డారు
కల్లూరు సుబ్బారావు ప్రధాన శిష్యగణంలో నీలం సంజీవరెడ్డి, తరిమెల నాగిరెడ్డి, ఐదుకల్లు సదాశివన్ ఉండేవారు. వారి అనుయాయులుగా మేమూ వారి బాటలోనే నడిచాము. మాకు నేరుగా పెద్దవారితో పరిచయం ఉండేది కాదు. ఒకరిని తొక్కి ముందుకుపోవాలన్న యావ అప్పట్లో ఎవరికీ ఉండేది కాదు. నిబద్ధత, నిజాయితీ అధికంగా ఉండేరోజులవి. సదాశివన్ ఓ చిన్నకొట్టులో పనిచేసేవారు. ఆయన గాంధీజీ స్ఫూర్తితో స్వాతంత్య్ర పోరులో నడిచారు. ఆ క్రమంలో గాంధీజీ జిల్లా పర్యటనకొచ్చినపుడు రక్షణగా నిలబడిన సదాశివన్ పోలీసు దెబ్బలు తిన్న విషయం తెలిసి మేము బ్రిటీష్‌వారికి వ్యతిరేకంగా పనిచేశాము.
మాకు పెద్ద పండుగ
ఎంతో మంది ప్రజాక్షేత్రంలో ఉన్నవారే కాకుండా అజ్ఞాతంగా ఉండి దేశమాత దాస్య శృంఖలాలను తొలగించడానికి పోరు సల్పారు. వారందరి కృషితో స్వాతంత్య్రం సిద్ధించింది. స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15వ తేదీ మాకు పెద్ద పండుగ. ఆ రోజు జాతీయ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచుకున్నాము. అవన్నీ జ్ఞాపకం వస్తే కళ్లు చెమరుస్తాయి.
అదే స్ఫూర్తి కొనసాగుతోంది
ప్రజల సమస్యలు, స్వాతంత్య్ర కోసం పోరాడేవాడిని. ఇంటిని పట్టించుకునేవాడిని కాదు. మేము పొందిన స్ఫూర్తి అలాంటిది మరి. మా ఊరు చైతన్యవంతం కావాలని గ్రంథాలయం తెప్పించుకున్నాం. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చినపుడు మా ప్రాంతానికి నీళ్లు ఎందుకివ్వరని నిలదీసిన సంఘటన పెద్ద సంచలనమైంది. స్వాతంత్య్ర కాలం నాటి స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతోంది. నన్ను మా మండల ప్రజలు ఎంతో ప్రేమిస్తారు. జాతీయ పండుగలొస్తే త్రివర్ణపతాకం ఎగురవేయమని కోరుతారు. ఇవన్నీ భరతమాత నాకందించిన భాగ్యమే.
గాంధీని తలపించే చెట్ల రుద్రప్ప
సమాజ హితం.. ఆనందమయ జీవితం
నాకు నలుగురు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. అందరూ నేను చెప్పింది ఈనాటికీ చక్కగా వింటారు. వారిలో చెట్ల ఈరన్న డిగ్రీ దాకా చదివాడు. టీచర్ ఉద్యోగం వస్తే వెళ్లిపోతానన్నాడు. కానీ ప్రజల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో విశాలాంధ్ర బుక్‌హౌస్‌లో ఓ చిన్న ఉద్యోగమైనా సరే చేరమన్నాను. ఇటీవల బుక్‌హౌస్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేశాడు. వందేళ్లు వచ్చినా ఎలా ఉత్సాహంగా ఉంటావని నన్ను చాలామంది అడిగారు. ఆహార నియమాలు పాటించడంతో పాటు మనసును ప్రశాంతంగా
ఉంచుకోవడం వల్లే ఆరోగ్యంగా, చలాకీగా ఉంటున్నాను. సమాజం కోసం బతికితే ఆనందంగా ఉంటుందన్నది నా జీవితం చెప్పే సత్యం.’
Comments
Please login to add a commentAdd a comment