న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీలో ఇడా తుపాను ప్రభావంతో సంభవించిన ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నట్లు తెలిసింది. వీరిని మాలతి కంచె(46) అనే సాఫ్ట్‌వేర్ డిజైనర్, ధనుష్ రెడ్డి(31)గా అధికారులు గుర్తించారు. ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రేరిటాన్‌కు చెందిన మాలతి కంచె(46) తన కుమారుడిని రట్జెర్స్ యూనివర్సిటీ కాలేజీలో దించి, కుమార్తె(15)తో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. బ్రిడ్జివాటర్ ప్రాంతంలో రూట్ –22 రోడ్డుపైకి అకస్మాత్తుగా చేరుకున్న నడుముల్లోతు వరద నీటిలో వారు చిక్కుకు పోయారు. కారులో నుంచి బయటపడిన తల్లి, కూతురు ఒక చెట్టును పట్టుకున్నారు. ఆ చెట్టు కూడా కూలిపోగా మాలతి వరద ఉధృతికి కొట్టుకు పోయారు.
ఈదడం తెలిసిన ఆమె కూతురు సురక్షితంగా బయటపడింది. మాలతి గల్లంతైనట్లు సమాచారం అందుకున్న అధికారులు అన్వేషణ ప్రారంభిం చారు. ఆమె మృత దేహాన్ని అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని బౌండ్‌బ్రూక్ వద్ద శుక్రవారం కనుగొన్నారు. మాలతి స్వస్థలం హైదరాబాద్ కాగా, ఆమె భర్త ప్రసాద్ కంచె తెనాలికి చెందినవారు. వీరిది ప్రేమ వివాహం. మరో ఘటన న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్‌ఫీల్డ్ ప్రాంతంలో ఈ నెల 1వ తేదీన చోటు చేసుకుంది. ధనుష్ రెడ్డి అనే వ్యక్తి నడిచి వెళ్తుండగా అకస్మాత్తుగా వచ్చిన వరద తీవ్రతకు కొట్టుకు పోయారు. ధనుష్ రెడ్డి మృతదేహాన్ని మరుసటి రోజు అక్కడికి 8 కిలోమీటర్ల దూరంలోని పిస్కాట్‌ఎవే అనే ప్రాంతంలో కనుగొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment