రేపు మహాశివరాత్రి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు.
పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం.
భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు.
శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ.
గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు.
తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది.
శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు.
శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు.
శివ తత్త్వం
శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది.
శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం.
మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
శివరాత్రులు ఐదు రకాలు
1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు.
2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం.
3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి.
4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి.
5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన.
ఆ రూపంలోనే అంతా!
శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది.
క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి.
– చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
ఆధ్యాత్మికవేత్త.
Comments
Please login to add a commentAdd a comment