mahadev
-
త్వరలోనే భారత్‌కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
అభిషేకప్రియుడైన శివుడికి చీపురు సమర్పించడం గురించి విన్నారా..?
అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం. చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు. ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్‌ను కోరాడు. అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!) -
అక్కా తమ్ముడు-అన్నా చెల్లెళ్లకు ఆ ఆలయంలోకి నో ఎంట్రీ!
సాధారణంగా ఏ గుడికైన కుటుంబ సమేతం వెళ్లి దర్శించుకుంటాం. కానీ ఓ గుడికి మాత్రం అక్కా-తమ్ముడు, అన్నా-చెల్లెళ్ల కలిసి వెల్లకూడదట. అలాంటి వింత ఆలయం భారత్‌లో ఒకటి ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఎందుకని ఈ నిషేధం విధించారంటే.. ఆ ఆలయం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ గ్రామంలో ఉంది. అది సాక్షాత్తు భోళా శంకరుడు ఆలయం. ఈ శివాలయాన్నిఏడు, ఎనిమిదో శతాబ్దకాలంలో కాలచూరి పాలకులు ఎరుపు, నలుపు రంగులతో కూడిన ఇసుకరాయితో నిర్మించారట. ఆలయ స్తంభాలపై అనేక అందమైన శిల్పాలు పర్యాటకులను అమితతంగా ఆకర్షిస్తాయి. ఈ దేవాలయంలోనే ఓ చిన్న మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం వివిధ రకాల విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ఎందుకు ఈ నిషేధం అంటే.. ఈ ఆలయాన్ని కేవలం రాత్రుళ్లులోనే నిర్మించారట. అయితే ఆ గుడిని నిర్మించే శిల్పి నారాయణ్ నగ్నంగా ఈ ఆలయాన్ని నిర్మించేవాడట. రోజూ అతడి భార్యే అతనికి భోజనం తీసుకొచ్చేదట. కానీ, ఓ రోజు నారాయణ్ చెల్లెలు భోజనం తీసుకుని ఆలయంలోకి వచ్చింది. నగ్నంగా ఉన్న అతడిని ప్రమాదవశాత్తు చూస్తుంది. దీన్ని నారాయణ్ చాలా అవమానంగా భావించి ఆ గుడిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అప్పటి నుంచి సోదర సోదరీమణులు ఈ ఆలయంలోకి రాకూడదని ఆ గ్రామ పెద్దలు నిషేధం విధించారు. అంటే అక్క తమ్ముడు, అన్నా- చెల్లికి మ్రాతమే నో ఎంట్రీ. అంటే అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లుకు ఇది వర్తించదు. ఏదీఏమైన కొన్ని దేవాలయాల నిర్మాణ శైలి, ఆచారాలు అత్యంత విచిత్రంగా ఉంటాయి. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజెర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
Mahashivratri 2024 : ఒక చైతన్య జాగృతి
చతుర్దశి నాడు మహాశివరాత్రిని భక్తులు శివుని జన్మదినంగా వైభవంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు అత్యంత ప్రాధాన్యత గల పవిత్ర దినం. ప్రతి నెలా అమావాస్య ముందు వచ్చే బహుళ (రాత్రిగల) చతుర్దశినాడు మాసశివరాత్రిగా జరుపుకుంటారు. పరమ శివునికి ఎంతో ప్రీతికరమైన∙శివరాత్రినాడు పగలంతా ఉపవాసం ఉండి, రోజంతా శివనామస్మరణతో గడుపుతూ, ప్రదోషవేళ శివుని అభిషేకించి, బిల్వదళాలతో పూజించాలి. అ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుంది. ఉపవాసం, శివార్చన, జాగరణ.. ఈ మూడూ శివరాత్రినాడు ఆచరించవలసిన విధులు. ఉపవాసం అంటే దేవునికి అతి సమీపంలో వసించడం. మనం ఇంద్రియాలతో అనుభవిస్తున్నవన్నీ ఆహారాలే. వాటన్నింటికీ దూరంగా ఉండడమే నిజమైన నియంత్రణ. అదే నిజమైన ఉపవాసం. భౌతిక రుచులన్నింటినీ పక్కకు పెట్టి పూర్తిగా శివసంబంధమైన కార్యక్రమాల్లోనే త్రికరణ శుద్ధిగా తాదాత్మ్యం చెందాలి. భోగానందాన్ని విస్మరించి, యోగానందావస్థలోకి ప్రవేశిస్తూ కోటి వెలుగుల ఆ శివజ్యోతి ప్రకాశాన్ని అంతరంగంలో నింపుకొని సచ్చిదానందమైన ఆధ్యాత్మిక ప్రస్థానం చేయడమే మహాశివరాత్రి ఆంతర్యం. మహాశివరాత్రినాటి అర్ధరాత్రి సమయంలో శివలింగ ప్రాదుర్భావం జరుగుతుందంటారు. లింగం నిర్గుణోపాసనకు, శివస్వరూపం సగుణోపాసనకు సంకేతాలు. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మాసశివరాత్రులు/మహాశివరాత్రినాడు రుద్రాభిషేకాలు శివార్చనలు, బిల్వార్చనలు జరపడం ఆయురారోగ్యఐశ్వర్య ప్రదం. ప్రత్యేకించి శివునికి ప్రీతికరమైన సోమవారం నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తిచేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన చేసి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్రవ్రతం అంటారు. సోమవారం ’ఇందుప్రదోషం’ గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని శాస్త్ర వచనం.16 సోమవారాలు నియమ పూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభీష్టాలు నెరవేరతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికందరూ ఒకే రూపం అయినప్పటికీ, శివ రూపమే సనాతనం. ఇదే సకల రూపాలకు మూలం. సాక్షాత్తు శివుడు గుణాతీతుడు. కాలాతీతుడు. నిత్యుడు, అద్వితీయుడు, అనంతుడు, పూర్చుడు, నిరంజనుడు, పరబ్రహ్మ పరమాత్మ. గుణనిధి అనే ఒక దుర్వ్యసనపరుడు నేరం చేసిన భయంతో శివరాత్రినాడు శివాలయంలో శివుని వెనుక దాగున్నాడు. కొండెక్కుతున్న దీపం వత్తిని కాకతాళీయంగా ఎగదోసి, తన ఉత్తరీయపు కొంగులను చించి వత్తిగా చేసి దానికి జత చేసి ఆవునెయ్యి పోసి దీపప్రజ్వలనం కావించాడు. తెల్లవార్లూ భయంతో మేలుకొని ఉండి తెల్లవారాక తలారి బాణపు దెబ్బకు మరణించాడు. బతుకంతా దుశ్శీలుడై నడచినా శివరాత్రినాడు దైవసన్నిధిలో ఉపవాసం, జాగరణ తనకు తెలియకుండానే చేసిన మహాపుణ్య ఫలితంగా మరుజన్మలో కళింగరాజు అరిందముడికి పుత్రుడై జన్మించి దముడనే పేరుతో మహారాజై తన రాజ్యంలోని శివాలయాలన్నింటిలో అఖండ దీపారాధనలు చేయించి అపై కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడై శివుడికి ప్రాణసఖుడయ్యాడన్న కథ శ్రీనాథుడి కాశీఖండంలో ఉంది. శ్రీరాముడు లంకపైకి దండెత్తే ముందు సాగరతీరంలో ఇసుకతో లింగం చేసి పూజించాడు. ఆ సైకతలింగ క్షేత్రమే నేటి రామేశ్వరం. లంకాధీశుడు తన పది తలలు కోసి శివుణ్ణి ప్రసన్నం చేసుకున్నది ఈ రోజునే అని చెబుతారు. జాంబవతికి సత్సంతానాన్ని ప్రసాదించమని ఇదే రోజున శివుణ్ణి కృష్ణుడు ప్రార్థించాడనే కథనం వ్యాప్తిలో ఉంది. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థాలు. శివరాత్రివేళ అభిషేక ప్రియుడైన శివుడి పార్ధివ లింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో, నమక చమకాలతో, పురుష సూక్తంతో పూజిస్తారు. మొదటి జాములో పాలతో, రెండో జాములో పెరుగుతో, మూడోజాములో నెయ్యితో, నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు. పరమశివునికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి, రుద్రాక్షమాలతో ‘ఓం నమశ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ శివపురాణ పారాయణ చేస్తారు. శివ తత్త్వం శివతత్త్వం ఎవరికీ అంత సులువుగా అర్థమైనది కాదు. శివుని కన్నా పెద్దది గాని, చిన్నది గాని సాటి మరొకటి లేదనేది తత్త్వ సాధకులు మోక్ష సాధకులకు ఆశ్రయించదగ్గ ఏకైక రూపం శివస్వరూపం. శివతత్త్వంలోని నిగూఢమైనటువంటి విషయాలలో ప్రప్రథమమైనవి జ్యోతిర్లింగాలు. శివుడు ద్వాదశ జ్యోతిర్లింగ రూపాలలో ఉన్నాడని, ఇది శివతత్త్వంలో భాగమేనని జ్యోతిర్లింగమనగా చీకటిని, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు (అనగా జ్ఞానము) ప్రసాదించేది అని జ్యోతిర్లింగాల తత్త్వం తెలియచేస్తుంది. శివతత్త్వంలో మరొకటి లింగాకారం. శివలింగాకారం పై భాగం లింగంగా కింద పానపట్టం యోని రూపంలో ప్రకృతీ పురుషుల ప్రతీకగా ప్రకృతీ పురుషులలో ఒకరు లేనిదే మరొకరు లేరు అని చెప్పేటటువంటి తత్త్వం. శివతత్త్వంలో మరొక తత్త్వం ప్రళయ తత్త్వం. ప్రళయతత్త్వం మూడు విధాలుగా ఉన్నది. రాత్రి సమయంలో నిద్ర ఇది ప్రళయతత్త్వంలో ఒక భాగం (నిద్ర) ప్రాపంచిక మాయ నుండి మరపునిస్తుంది. రెండవది మరణం. ఇది స్థూల శరీరానికి సంబంధించినటువంటి ప్రళయం. మూడవది మహా ప్రళయం. సమస్తం శివునిలో కలసిపోవటం. నాలుగవది త్రిమూర్తితత్త్వం (శివ, విష్ణు, బ్రహ్మ). శివుని నుండి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ ఆవిర్భవించారనేది శాస్త్రం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు నడిపించి శివుడు అంతం చేయటం లోకోక్తి. పంచభూతలింగాల తత్త్వం. పంచభూతాలు అనగా అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, జలం. అన్నిటిలోను శివుడున్నాడు అనేటటువంటి తత్త్వం. రుద్రతత్త్వం అంటే శివుడిని పూజించేటటువంటి పద్ధతి. రుద్రంలో మహన్యాసం, నమకం, చమకం అనే విధానం. మహన్యాసం అంటే చేసేది శివుడే, నీవు శివుడవే అని నిర్ధారిస్తుంది. శివతత్త్వంలో శివస్వరూపంలో దాగివున్న విషయాలు ఈ విధంగా ఉన్నాయి. శివరాత్రులు ఐదు రకాలు 1. నిత్యశివరాత్రి: ప్రతిరోజూ శివారాధన చేస్తారు. 2. పక్ష శివరాత్రి : ప్రతి మాసంలో శుక్ల, బహుళ పక్షాలలో వచ్చే చతుర్దశులలో శివార్చన చేయడం. 3. మాస శివరాత్రి : ప్రతి మాసంలో బహుళ చతుర్దశినాడు మాసశివరాత్రి. 4. మహాశివరాత్రి : మాఘ బహుళ చతుర్దశి నాటి సర్వశ్రేష్ఠమనదగిన శివరాత్రి. 5. యోగ శివరాత్రి: యోగులు యోగసమాధిలో ఉండి చేసే శివచింతన. ఆ రూపంలోనే అంతా! శివుని తలపై గంగ ప్రవాహం ఒక తరంనుండి మరొక తరానికి జ్ఞానం ప్రసారమవుతుందని సూచిస్తుంది. శివుని తలపై చంద్రుడు భగవంతుడిపై ధ్యాస ఎల్లవేళలా ఉండాలని సూచిస్తుంది. శివునికి మూడో కన్ను చెడును, అజ్ఞాన నాశనాన్ని చూపిస్తుంది. శివుని వద్ద ఉన్న త్రిశూలం జ్ఞానం, కోరిక, అమలు అనేటటువంటి మూడింటి స్వరూపం. శివుని ఢమరుకం వేదగ్రంథాలు వేదస్వరాన్ని తెలియచేసే ఢమరుకం. శివుని మెడపై ఉన్న సర్పం అహం నియంత్రణను సూచిస్తుంది. శివుడు ధరించే రుద్రాక్ష స్వచ్ఛతను, ధరించే మాలలు ఏకాగ్రతనూ సూచిస్తాయి. నడుముకు చుట్టుకునే పులి చర్మం భయం లేనటువంటి తత్త్వాన్ని సూచిస్తుంది. క్షీరసాగర మథన సమయంలో నిప్పులు చిమ్ముకుంటూ పెల్లుబికి వచ్చిన ఘోర కాకోల విషాగ్నుల నుంచి లోకాలను రక్షించవలసిందిగా దేవగణం వేడుకోగా, శివుడు ఆ గరళాన్ని తన గళాన నిలిపి ముల్లోకాలనూ కల్లోలం నుంచి కాపాడాడు. ఆ కాళరాత్రే శివరాత్రి. ‘నిర్ణయసింధు’లోని నారద సంహితలో శివరాత్రి వ్రతవిధానం ఉంది. మార్కండేయుడు, నత్కీరుడు, సిరియాళుడు, చిరుతొండనంబి, తిన్నడు, శక్మనారు, అక్కమహాదేవి, బెజ్జ్ఞ మహాదేవి వంటి ఎందరో శివభక్తుల అమేయ భక్తిగాథలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఆధ్యాత్మికవేత్త. -
AP: విశాఖలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ వైజాగ్‌లో కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్‌కు చెందిన అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్‌ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. నితిన్, అమిత్‌లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్‌లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
మహదేవ్ బెట్టింగ్ స్కామ్: కీలక నిందితుడి అరెస్టు!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో ప్రధాని నిందితుడు రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో ఇంటర్‌పోల్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)విజ్ఞప్తి మేరకు ఇంటర్‌పోల్ రవి ఉప్పల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రవిని భారత్ తీసుకువచ్చేందుకు ఈడీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో రాయ్‌పూర్ పీఎంఎల్ఏ కోర్టులో ఇప్పటికే ఈడీ రవి ఉప్పల్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. రవి తన భారత పౌరసత్వాన్ని రద్దు చేసుకోకుండానే వనాతు ఐలాండ్ పాస్పోర్టుతో దుబాయ్‌లో ఉంటున్నట్లు ఈడీ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌లో రూ.6 వేల కోట్ల దోపిడీ జరిగిందని ఈడీ పేర్కొంది. ఆశిమ్ దాస అనే కొరియర్ ద్వారా రూ.508 కోట్ల ముడుపులను మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బాగేల్కు చెల్లించారని అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈడీ ఆరోపించడం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేయగా దీనికి పూర్తి విరుద్ధంగా బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇదీచదవండి..డ్యూటీలో కత్తి తీసుకెళ్తా: కోర్టుకెక్కిన ఇండిగో పైలట్ -
Mahadev app case: సీఎం బఘేల్‌కు డబ్బు పంపలేదు
రాయ్‌పూర్: మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ అరెస్ట్‌చేసిన నగదు కొరియర్ ఆసిమ్ దాస్ తాజాగా మాటమార్చాడు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్‌కు రూ.508 కోట్ల నగదు పంపించారని విచారణలో అతడు అంగీకరించాడని ఈడీ వెల్లడించడం తెల్సిందే. ఆసిమ్ తన లాయర్ షోయబ్ అల్వీ ద్వారా మరో వాంగ్మూలమిస్తూ ఈడీ డైరెక్టర్, ప్రధాని కార్యాలయానికి లేఖ రాశారు. ‘‘ఈ కేసులో నన్ను బలిపశువును చేస్తున్నారు. వాస్తవానికి సీఎం బఘేల్సహా ఏ రాజకీయనేతకూ నేను డబ్బులు అందజేయలేదు. ఈడీ అధికారులు ఇంగ్లిష్‌లో ఉన్న వాంగ్మూలంపై బలవంతంగా నా సంతకం చేయించుకున్నారు. నాకు ఇంగ్లిష్ రాదు. ఎవరో వచ్చి డబ్బు సంచులు కారులో పెట్టి వెళ్లిపోయాడు. డబ్బుతో నేను హోటల్రూమ్కి వెళ్లగానే ఈడీ అధికారులొచ్చి అరెస్ట్‌చేశారు. కేసులో నన్ను కావాలనే ఇరికించారని నాకప్పుడు అర్ధమైంది’’ అని దాస్ వివరించారు. -
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపుల అంశంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్‌తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
మహదేవ్ ప్రమోటర్ల నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎంకి రూ.508 కోట్లు.. ఈడీ సంచలన ఆరోపణలు
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు ప్రచారంలో దూసుకున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్ రూ. 508 కోట్లు స్వీకరించినట్లు ఈడీ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో భారీ మొత్తంలో నగదు చెలామణి అవుతున్నట్లు తమకు గురువారం సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు ఈ మేరకు హోటల్ ట్రిటన్లతోపాటు భిలాయ్‌లోని మరోచోట ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం యూఏఈ నుంచి నగదు తీసుకొస్తున్న అసిమ్ దామ్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయన కారు, నివాసంపై సోదాలు జరపగా.. రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. అయితే ఆ డబ్బును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెట్టేందుకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు డెలివరి చేసేందుకు ఉద్ధేశించినట్లు నగదుతో పట్టుబడిన వ్యక్తి తమకు తెలిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేగాక మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని పేర్కొంది. కాగా చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇదిలా ఉండగా మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల్లో ఉంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పటివరకు రూ. 450 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకుంది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు. -
‘మహాదేవ్’ లూటీ రోజుకు రూ.200 కోట్లు
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన వ్యవహారమిది. బాలీవుడ్ ప్రముఖ నటులకు ఇందులో భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. యాప్‌పై దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గత నెలలో భారత్‌లో 39 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.417 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు, ఆభరణాలు, నగదు స్వా«దీనం చేసుకుంది. యాప్ కోసం ప్రచారం చేసిన బాలీవుడ్ నటులు రణబీర్ కపూర్, శ్రద్ధ కపూర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురి నిందితులను అదుపులోకి తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ యాప్ బాగోతం బయటపడింది. ► ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి పట్టణానికి చెందిన సౌరభ్ చంద్రశేఖర్, రవి ఉప్పల్ దుబాయ్‌లో మకాం వేసి, మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ► కొత్తకొత్త వెబ్సైట్లు, చాటింగ్ యాప్‌ల ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తారు. ఆన్లైన్లో బెట్టింగ్‌ల్లో భారీగా లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ► తమ వలలో చిక్కిన కస్టమర్లతో వాట్సాప్‌లో గ్రూప్‌లు ఏర్పాటు చేస్తారు. వారితో నేరుగా ఫోన్లలో మాట్లాడరు. వాట్సాప్ ద్వారానే సంప్రదిస్తుంటారు. ► కస్టమర్లను బెట్టింగ్ యాప్‌లో సభ్యులుగా చేర్చి, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. తర్వాత వారితో నగదు జమ చేయించుకుంటారు. ఈ వ్యవహారాన్ని మహాదేవ్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు పర్యవేక్షిస్తుంటారు. ఈ డబ్బంతా తప్పుడు పత్రాలతో తెరిచిన యాప్ నిర్వాహకుల బినామీ బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. ► యాప్‌లో బెట్టింగ్‌లు కాస్తే తొలుత లాభాలు వచి్చనట్లు నమ్మిస్తారు. దాంతో కస్టమర్లో ఆశ పెరిగిపోతుంది. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేలా అతడిని ప్రేరేపిస్తారు. చివరకు అదంతా నష్టపోయేలా బెట్టింగ్ యాప్‌లో రిగ్గింగ్ చేస్తారు. మళ్లీ కొత్త బకరా కోసం వేట మొదలవుతుంది. ► మహాదేవ్ బెట్టింగ్ యాప్ సంపాదన ప్రతిరోజూ రూ.200 కోట్లు ఉంటుందని ఈడీ దర్యాప్తులో తేలింది. ► భారత్, మలేసియా, థాయ్‌లాండ్, యూఏఈలో మహాదేవ్ యాప్‌నకు వందలాది కాల్ సెంటర్లు ఉన్నాయి. ప్రధాన కార్యాలయం యూఏఈలో ఉంది. నాలుగు దేశాల్లో పెద్ద సంఖ్యలో బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. ► భారత్‌లోని 30 కాల్ సెంటర్లను అనిల్ దమానీ, సునీల్ దమానీ నిర్వహిస్తున్నారు. వీరిద్దరిని ఈడీ అరెస్టు చేసింది. ► బెట్టింగ్ యాప్ జోలికి రాకుండా ఉండడానికి పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు నిర్వాహకులు హవాలా మార్గాల్లో లంచాలు ఇచి్చనట్లు వెల్లడయ్యింది. ► బెట్టింగ్ సిండికేట్ నడిపిస్తున్న ఓ యాప్‌ను బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ప్రమోట్ చేస్తున్నట్లు ఈడీ చెబుతోంది. ► ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఓ పెళ్లి నిర్వహణకు రూ.200 కోట్లు నగదు రూపంలో చెల్లించారు. దీనిపై దర్యాప్తు చేయగా మహాదేవ్ బెట్టింగ్ యాప్ గురించి బయటపడింది. ఈ పెళ్లిలో రణబీర్ కపూర్, శ్రద్ధాకపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్‌తోపాటు మరికొందరు బాలీవుడ్ నటులు ప్రదర్శన ఇచ్చారు. వారికి హవాలా మార్గంలో రూ.కోట్లలో చెల్లింపులు చేసినట్లు తేలింది. పెళ్లిలో ప్రదర్శన ఇవ్వడానికి 17 మంది బాలీవుడ్ సెలబ్రిటీలను చార్టర్డ్ విమానంలో దుబాయ్‌కి తీసుకెళ్లారని ఈడీ అధికారులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. స్టార్ హీరోయిన్‌కు సమన్లు!
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో రణ్‌బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్, హ్యూమా ఖురేషికి సమన్లు జారీ చేసిన ఈడీ తాజాగా మరో నటి శ్రద్ధా కపూర్‌కు సైతం నోటీసులిచ్చారు. ఇవాళ ఈడీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ప్రస్తావించగా.. రణ్‌బీర్ కపూర్ హాజరయ్యేందుకు రెండు వారాల గడువు కోరారు. అయితే ఈరోజు శ్రద్ధా కపూర్ ఈడీ ముందుకు హజరవుతారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: బాలీవుడ్లో బెట్టింగ్ యాప్ ప్రకంపనలు.. ప్రముఖులకు ఈడీ సమన్లు..!) ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న కపిల్ శర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్లకు కూడా వేర్వేరు తేదీల్లో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరంతా కూడా ఈడీ ముందు హాజరు కావడానికి రెండు వారాల సమయం కోరినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో వీరందరినీ నిందితులుగా ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం యాప్ ప్రమోటర్లు వారికి చేసే చెల్లింపు విధానం మాత్రమే ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. రణబీర్ కపూర్ మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేస్తూ పెద్ద మొత్తంలో డబ్బు అందుకున్నట్లు ఈడీ పేర్కొంది. -
సౌరభ్ చంద్రకర్ ఎవరు? పెళ్లి నేపధ్యంలో ఈడీకి ఎందుకు చిక్కాడు?
సౌరభ్ చంద్రకర్ పేరు ఎప్పుడైనా విన్నారా? కొంతకాలం క్రితం వరకు ఈ పేరు గురించి ఎప్పుడూ చర్చ జరగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పతాక శీర్షికల్లో ఈ పేరు కనిపిస్తోంది. సౌరభ్ చంద్రకర్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘా పెట్టడం, అధికారుల విచారణలో వెల్లడైన షాకింగ్ వివరాలే ఇందుకు కారణంగా నిలిచాయి. సౌరభ్ తన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీల ఇంట జరిగిన పెళ్లిళ్లు గుర్తుకొస్తాయి. ఈ పెళ్లిళ్లకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారు. లక్ష్మీ మిట్టల్ తన కుమార్తెకు పారిస్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహానికి ఆయన రూ. 240 కోట్లు ఖర్చు చేశారు. బంధువుల కోసం ప్రైవేట్ జెట్ మీడియా కథనాల ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ పెళ్లికి సౌరభ్ చంద్రకర్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. తమ బంధువులు, ప్రముఖులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్ తీసుకువచ్చేందుకు ఆయన ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్లి ఖర్చుల్లో ఎక్కువ భాగం నగదు రూపంలోనే వెచ్చించాడు. దీనిని చూస్తే సౌరభ్ దగ్గర ఎంత సంపద ఉందో అంచనా వేయవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు మహదేవ్ యాప్‌తో లింక్ కలిగిన 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి, రూ.417 కోట్ల విలువైన షేర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను నడుపుతున్నాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు. పలువురు ప్రముఖులు హాజరు సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోనిఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. తన పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్‌కు ఆయన రూ.120 కోట్లు చెల్లించాడు. సౌరభ్ తన బంధువులను దుబాయ్‌కు తీసుకురావడానికి నాగ్‌పూర్ నుండి ప్రైవేట్ జెట్లను పంపాడు. వివాహ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీనికి సంబంధించిన మొత్తం చెల్లింపును హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించారని సమాచారం. యోగేష్ బాపట్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆర్-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హవాలా ద్వారా రూ.112 కోట్లు ఇచ్చినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించినట్లు ఈడి తెలిపింది. అదేవిధంగా హోటల్ బుకింగ్ కోసం యూఏఈ కరెన్సీలో రూ.42 కోట్లు చెల్లించాడు. ఇది కూడా చదవండి: ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే? -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నటి ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఆమెరికన్ పాప్ సింగర్ నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. తాజాగా ప్రియాంక పెళ్లికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రియాంక వివాహం మొదట దేవొంకే దేవ్ మహదేవ్ అనే హిందీ సీరియల్ నటుడు మోహిత్ రైనాతో చేయాలని ఆమె కుటుంబసభ్యులు భావించారట. ఈ సీరియల్లో శివుడి పాత్రలో కనిపించిన మోహిత్ ప్రియాంకకు సరిజోడి అని ఆమె తల్లి ఫిక్సయిందట. అంతేకాకుండా అతడి గురించి ఎంకర్వ్యైరీ కూడా చేసి ఎంతో మంచివాడని, మోహిత్తోనే ప్రియంకకు పెళ్లి జరిపించాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వార్త మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మోహిత్‌తో ప్రస్తావించగా..ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను సూపర్ స్టార్ అని కొనియాడారు. తాను కేవలం టెలివిజన్ నటుడిని అని, అయినా తన గురించి ప్రియాంక పేరేంట్స్ ఇలా ఆలోచించడం చాలా గొప్పవిషయమని అన్నారు. అయితే తనలాంటి చిన్న వ్యక్తితో ప్రియాంక పెళ్లి ఈ జన్మలో జరగకపోయినా, వచ్చే జన్మలో అయినా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
‘నాకు రూ.40 కోట్లు ఆఫరిచ్చారు ’
బెంగళూరు : కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే కె.మాధవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గమైన పిరియపట్నలో బుధవారం ప్రజలతో మాట్లాడుతూ.. తనకు రూ.40 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని మాధవ్ తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని ఎవరు ఇస్తారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. ‘నాకు రూ.30–40 కోట్లు ఇస్తామన్నారు. భారీగా నగదును 2–3 సార్లు నా గదికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే వెళ్లిపోకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించా. నేను అమ్ముడుపోను. అంత డబ్బును ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకూడదంటే రూ.80 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళీ నాముందే కూటమి నేతల్ని డిమాండ్ చేశారు’ అని వ్యాఖ్యానించారు. -
సినిమాలంటే అంత పిచ్చి
మహాదేవ్ హీరోగా, మమతా సాహాస్, సునైన హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘నివురు’. ఋషికృష్ణ దర్శకత్వంలో అభిరామ్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగోని ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజా విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –‘‘హీరో మహాదేవ్ చిన్నప్పటి నుంచి అందరి హీరోల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అతనికి సినిమాలంటే అంత పిచ్చి. సంగీతం, ఛాయాగ్రహణం అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రం హిట్ అవ్వాలి’’ అన్నారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా తప్ప వేరే ప్రపంచం తెలియదు. చదువు పెద్దగా అబ్బకపోయినా, సినిమా మీద ప్యాషన్‌తో ఎన్నో కష్టాలకోర్చి ఈ చిత్రాన్ని తెరకెక్కించాం’’ అన్నారు మహాదేవ్. ‘‘మా ఇల్లు అమ్ముకుని, ఆటో తోలుకుంటూ ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రం హిట్ అయ్యి, మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావాలి’’ అన్నారు అభిరామ్. రైటర్ డైమండ్ రత్నబాబు, నటుడు కాశీ విశ్వనాధ్, సంగీత దర్శకుడు యం.ఎల్. రాజా పాల్గొన్నారు. -
ఆర్థిక శాస్త్రానికి అడుగుజాడ
‘సమానత్వాన్ని సాధించడం... మానవీకరించడం... ఆధ్యాత్మికతను అద్దడం..’ ఈ మూడూ భారతదేశం సాధించవలసిన లక్ష్యాలుగా భావిస్తున్నానని చెప్పారు, మహదేవ గోవింద రానడే. భారతదేశాన్ని వేధిస్తున్న దారిద్య్రమనే మహా రుగ్మతకి పరమౌషధం పరిశ్రమల స్థాపనేనంటూ రానడే (జనవరి 18,1842–జనవరి 16,1901) చెప్పిన మాట దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ది. ఆ మాట ఆయన చెప్పినది 19వ శతాబ్దంలో. రానడేను గురువుగా భావించిన తొలినాటి స్వాతంత్య్ర సమరయోధులూ, అనంతర కాలాలలో ఆయన రచనలతో, ఆలోచనలతో ప్రేరణ పొందినవారూ ఆయనను ‘భారతీయ ఆర్థికశాస్త్ర పితామహుడు’గా సంభావిస్తారు. 1912లో ఇక్కడకొచ్చిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఆచార్యుడు లీజ్ స్మిత్ అయితే, రానడేను భారతదేశంలో పుట్టిన అత్యంత ప్రతిభాశాలురైన చింతనాపరులలో ఒకరని కీర్తించారు. నిస్సందేహంగా రానడే ఆలోచనా ధార ఒక అద్భుతం. ఇప్పటికీ ప్రపంచాన్ని శాసించడానికి పోటీ పడుతున్న ఆర్థికశాస్త్ర చింతనాధోరణుల జాడలు చాలా వరకు రానడే ఆలోచనలలో బీజప్రాయంగా కనిపిస్తాయి. ఆయన బ్రిటన్ను అభిమానించేవారు. కానీ వారి స్వేచ్ఛావాణిజ్య వాదాన్ని పూర్తిగా నిరాకరించేవారు. అలాంటి వాదాలు దేశాలను శాశ్వతంగా వెనుకబాటుతనంలో మునిగిపోయేటట్టు చేస్తాయని హెచ్చరించారు కూడా. భారత ఆర్థిక విధానానికి గతమే పునాదిగా ఉండాలని చెప్పారాయన. అదే సమయంలో వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం సరికాదన్నారు. దారిద్య్రాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమల స్థాపన ఒక్కటే పరిష్కారమని సిద్ధాంతీకరించారు. భారతదేశ పరిస్థితులను వ్యవసాయానికి విశేష ప్రాధాన్యాన్ని నిరాకరించడం అసంబద్ధంగానే అనిపిస్తుంది. తను అలాంటి నిర్ణయానికి ఎందుకు రావలసి వచ్చిందో ఆయన వివరించారు. ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేసిన తరువాతనే ఆయన భారతీయ సేద్యం గురించి ఆలాంటి అభిప్రాయానికి వచ్చారు. 19వ శతాబ్దం మధ్య నుంచి, 20వ శతాబ్దం వరకు మన చరిత్రలో దర్శనమిచ్చే ఆధునిక దృష్టి కలిగిన మహోన్నత ప్రతిభావంతులలో, బహుముఖ ప్రజ్ఞశాలురు అని చెప్పడానికి నమూనాలుగా కనిపించేవారిలో ఒకరు– ఎంజీ రానడే. ఆయన మహారాష్ట్రలోని నిపహాడ్లో జన్మించారు. బొంబాయిలోని చరిత్రాత్మక ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా రానడే జీవితం ఆరంభమైంది. తరువాత బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి పదవిని అలంకరించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ కమిటీ సభ్యుడు. జీవితం మొత్తం అరవయ్యేళ్లు. కానీ సంఘ సంస్కరణకి, విద్యా రంగానికి, చరిత్ర రచనకి, భారత జాతీయ కాంగ్రెస్ తొలినాటి ఉద్యమానికి కూడా రానడే విశేషమైన సేవలు అందించారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని ఒక ప్రత్యేక శాఖగా గుర్తించేటట్టు చేయడంలో రానడే నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. భారత ఆర్థిక వ్యవస్థ, సమాజం రెండూ ఏకకాలంలో పురోగతి సాధించడానికి అనువైన ఒక ఆర్థిక తాత్వికత గురించి ఆయన తపించారు. జాతీయ సమస్యల నేపథ్యంలోనే ఆర్థిక శాస్త్ర అధ్యయనం జరగాలని రానడే భావించేవారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని వాస్తవానికి మరింత దగ్గరగా తీసుకుపోవడానికీ, మరింత అర్థవంతం చేయడానికీ ఆయన ఈ సూచన చేశారు. రానడే దృష్టిలో ఆర్థికశాస్త్రమంటే, ఒక సాధారణ శాస్త్రం కాదు. ఒక దేశ సామాజిక, చారిత్రక సందర్భాలను పునాదిగా చేసుకుని ఆవిర్భవించే శాస్త్రమది. భారతీయులు భౌతిక సంపదను పెంచుకోవడమనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభావితులైనవారు కాదనీ, ఇతర వాస్తవికతలు కూడా అందులో ఉన్నాయనీ అంటారాయన. భారతీయ సమాజాన్ని ప్రధానంగా మతం నడుపుతుంది. ఆపై కులం కీలకంగా ఉంటుంది. వీటిని దాటి భారతీయుడు తన ఒక్కడి సొంతానికి భౌతిక సంపదను పెంచుకునే లక్షణాన్ని ఏర్పరచుకోలేడని రానడే చెప్పారు. ఇక్కడి శ్రమశక్తి, పెట్టుబడి చైతన్యం కలిగినవి కాదని అన్నారు. వేతనాలను కూడా కులం, హోదా శాసిస్తాయని చెప్పారు. రానడే బయటపెట్టిన ఇంకొక అంశం విస్తుగొలుపుతుంది. ఇక్కడ పోటీతత్వం బలహీనమైనదనీ, సంప్రదాయాల కారణంగా ఆ పోటీశక్తులు తమకు తామై సంకెళ్లు బిగించుకున్నాయనీ ఆయన వాదన. పరిశ్రమ స్థాపన జరగాలి. కానీ ఆ పనిలో ప్రభుత్వమే కీలక పాత్ర వహించాలి. రాయితీలు ఇచ్చి ఉత్పాదన సామర్థ్యాన్ని విస్తరించాలి. ఉన్నత విద్య, సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు కూడా ప్రభుత్వపరంగానే జరగాలి. స్వేచ్ఛా వాణిజ్య వాదం, పురోగతి– ఇవి ఒక ఒరలో ఇమడలేని విధానాలుగానే ఆయన చూశారు. బ్రిటన్‌లో పుట్టిన స్వేచ్ఛా వాణిజ్యవాదంతో భారతదేశం వంటి దేశం ఎప్పటికీ వెనుకబడే ఉంటుందని ఆయన అభిప్రాయం. అదే పురోగతి అనే దృక్పథం ఉంటే? అడ్డంకుల నుంచి స్వాతంత్య్రానికి, బోళాతనం నుంచి విశ్వాసం వైపు, అసంఘటితత్వం నుంచి సంఘటితత్వానికి, మతావేశం నుంచి సహనం వైపు, గుడ్డి నమ్మకం నుంచి ఆత్మగౌరవం వైపు ప్రస్థానం సాగుతుందని ఆయన భావించారు. స్వేచ్ఛా వాణిజ్యమనే విధానమూ సరికాదన్నారాయన. ఎగుమతులు, దిగుమతుల మీద అదుపు లేకుంటే, మొదట నష్టపోయేది దేశీయ పరిశ్రమలేనని చెప్పారు. దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియరీని ప్రపంచంలో చాలామంది విశ్వసించినప్పటికీ రానడే మాత్రం వ్యతిరేకించారు. ‘పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో నౌరోజీ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భారతదేశ వనరులను దోచుకుపోయి, ఇంగ్లండ్ పరిశ్రమలలో వస్తువులను ఉత్పత్తి చేసి, తిరిగి భారతదేశ మార్కెట్లోనే విక్రయించి మళ్లీ లాభాలను బ్రిటన్‌కే తరలించడాన్ని డ్రెయిన్ థియరీ అంటారు. భారతదేశ వెనుకబాటుతనం ఒక్క ఇంగ్లిష్ జాతితోనే సంప్రాప్తించింది కాదనీ, వెనుకబాటుతనం లోతులు చరిత్రలోనే ఉన్నాయని రానడే చెప్పారు. బ్రిటిష్ జాతీయులు రాక పూర్వం కూడా ఇక్కడ పేదరికం ఉందని, ఆంగ్లేయులు వచ్చిన తరువాత అది మరింత అధికమైందన్నదే నిజమని అన్నారాయన. దేశంలో దారిద్య్రానికి మూలం వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం ఇవ్వడం, పరిశ్రమలు లేకపోవడం, రుణ సదుపాయం లేకపోవడం, లోపభూయిష్టమైన భూ విధానం కారణాలని రానడే విశ్లేషించారు. రుణ విధానాన్ని పునర్వ్యవస్థీకరించమని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇది మాత్రం ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంది. భూతనఖా బ్యాంకుల ఏర్పాటు ఆ సలహా ఫలితమే. అసలు సేద్యానికి, విశేష ప్రాధాన్యానికి కారణం ప్రభుత్వ విధానమని, ఇంగ్లండ్‌కు ఎగుమతి చేయడానికి అవసరమైన పంటలనే బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశంలో పరిశ్రమలు వెనుకబడిపోవడానికి కారణం– విదేశీ పరిశ్రమలతో పోటీకి నిలబడలేకపోవడమేనని చెప్పారాయన. దేశీయమైన వనరులను దేశంలోని కర్మాగారాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించాలని రానడే నినదించారు. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు చొరవ చూపించవలసిందనీ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవలసిందనీ ఆయన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని పదే పదే కోరేవారు. అందుకే ఆయనను ఆధునిక ఆర్థిక శాస్త్ర పిత అని పిలిచేవారు. మొత్తంగా ఆయన సిద్ధాంతంలో నేటికీ ఉపయోగపడే ఒక అంశం ఉంది. వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం– ఈ మూడింటిని కూడా ప్రణాళికాబద్ధంగా సమ ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలని రానడే సిద్ధాంతీకరించారు. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించకపోతే ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కూడా కష్టమేనని చెప్పారు. ఆధునిక కాలంలో కనిపిస్తున్న వెనుకబాటుతనం, నిరుద్యోగం తొలగిపోవాలంటే పరిశ్రమల స్థాపనే పరిష్కారమని సూచించారాయన. గ్రామసీమలు యథాతథంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాయన్న రాజా రామ్మోహన్రాయ్ అభిప్రాయాలను ఇక్కడే రానడే గట్టిగా వ్యతిరేకించారు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, మాల్థస్, జేమ్స్ మిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల సిద్ధాంతాలను కూడా రానడే నిరాకరించారు. అవన్నీ స్థిరపడిన వ్యవస్థలకే పరిమితమని ఆయన అభిప్రాయం. జర్మన్ ఆర్థికవేత్త ఫ్రెడ్రిక్ లిస్ట్ సిద్ధాంతాలతో రానడే ప్రభావితులయ్యారు. వ్లాదిమిర్ లెనిన్ కూడా లిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యారని చెబుతారు. లిస్ట్ సిద్ధాంతాలను భారతీయ సమాజానికి అన్వయించడానికి రానడే కృషి చేశారు. ఆర్థిక విధానాలకు సంబంధించి లెనిన్ అంటే నెహ్రూకు గురి. అయితే లెనిన్, రానడే ఇద్దరూ లిస్ట్ సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారన్న సంగతి నెహ్రూకు తెలుసో లేదో తెలియదు. సుభాస్ చంద్రబోస్ జర్మనీలో ఉండగా లిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన ఊహకు మూలం లిస్ట్ చూపిన ప్రభావం కారణం కావచ్చు. గోపాలకృష్ణ గోఖలే రానడే ప్రత్యక్ష శిష్యుడు. గోఖలే శిష్యుడు గాంధీజీ. అందుకే రానడే ఆలోచనల ప్రభావం గాంధీజీ మీద కూడా పరోక్షంగా కనిపిస్తుంది. పరిశ్రమల స్థాపన మీద, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయులకు పరిచయం చేయడం గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూణెలోనే చదువుకున్నారు. ఇలాంటి ఆలోచనలు రానడే రచనల నుంచే విశ్వేశ్వరయ్య స్వీకరించి ఉంటారన్న వాదనలు కూడా ఉన్నాయి. రానడే ఆలోచనలు ఆర్థిక పురోగతి వరకే పరిమితం కాలేదు. అసలు ఆర్థిక పురోగతి, ఆధ్యాత్మిక కోణంతో ఉండాలన్నదే ఆయన వాదన. సంఘ సంస్కరణ ఆయన జీవితంలో కనిపించే మరొక గొప్ప కోణం. నిజానికి సంఘ సంస్కర్తగానే ఆయన ఎక్కువ మందికి గుర్తు. వక్తృత్వతేజక్ సమాజ్, పూణె సార్వజనిక్ సభ, ప్రార్థనా సమాజ్, సోషల్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, బాలికలకు చదువు వంటి వాటి కోసం ఆ సమాజాలు పనిచేశాయి. 1861లో ఆయన ప్రారంభించిన విడో మ్యారేజ్ అసోసియేషన్ ఇందుకు సంబంధించినదే. ఇక భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో రానడే ఒకరు. ‘రైజ్ ఆఫ్ మరాఠా పవర్’ ఆయన రాసిన చరిత్ర గ్రంథం. బ్రిటిష్ ఇండియాను ఉదార విధానాలకు పరిచయం చేసిన మహనీయుడు ఈ మహదేవుడు. ∙డా. గోపరాజు నారాయణరావు -
నగరంలో ఏం జరిగింది?
హైదరాబాద్‌లో జరిగే వినాయకుడి నిమజ్జనాన్ని కళ్లారా చూడాలని నలుగురు యువకులు తమ గ్రామం నుంచి నగరానికి వస్తారు. అక్కడ ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. ఆ సంఘటనలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపుకి కారణం అయ్యాయి? అనే కథాంశంతో చంద్రమహేశ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రెడ్ అలర్ట్’. హెచ్.హెచ్. మహదేవ్, అంజనా మీనన్ జంటగా పీవీ శ్రీరామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన తొలి సినిమాగా ‘ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ని సాధించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ‘‘కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి భారీ ఎత్తున ప్రేక్షకాదరణ లభించింది. తెలుగులో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది’’ అని చంద్రమహేశ్ తెలిపారు. రవి, అమర్, తేజ, సుమన్, కె. భాగ్యరాజా, అలీ, పోసాని తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, సంగీతం: రవివర్మ, కెమెరా: కల్యాణ్ సమి, సమర్పణ: యస్. త్రిలోక్‌రెడ్డి, సహనిర్మాత: శ్రీమతి పిన్నింటి శ్రీరామ్ సత్యరెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. జైపాల్‌రెడ్డి. -
పోలీసుల అదుపులో మిలిషియా సభ్యుడు
చింతూరు : తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలం బొద్దుగూడెంలో మావోయిస్టు మిలిషియా సభ్యుడు మంచిక మహదేవ్‌ను పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొద్దుగూడెంలో మావోయిస్టు పోస్టర్లను మహదేవ్ గోడలపై అతికిస్తున్నాడు. ఆ క్రమంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మహేదేవ్ స్వగ్రామం చింతూరు మండలం పెగ పంచాయతీ ఎదిర్లగూడెం అని పోలీసులు తెలిపారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.