అభిషేకప్రియుడైన ఆ మహాదేవునికి పాలు, నీళ్లతో అభిషేకించి తరిస్తాం. అంతేగాదు ఆయనకు ఎంతో ప్రీతీపాత్రమైన బిల్వపత్రాలతో పూజిస్తాం. అలాంటిది అక్కడ మాత్రం ప్రజలు అవేమీ కాకుండా ఇళ్లు ఊడ్చే చీపురులను సమర్పిస్తారట. ఇదేం వింత ఆచారం రా బాబు అనిపిస్తోంది కదూ..! ఇంతకీ అక్కడ ఇలా ఎందుకు చేస్తారు..? ఆ గుడి ఎక్కడ ఉంది తదితర విశేషాలేంటో చూద్దామా..!
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలోని బిహాజోయ్ గ్రామంలో ఈ వింత శివాలయం ఉంది. ఇది పురాతన పాతాలేశ్వర్ శివాలయం. ఈ ఆలయంలో శివుడిని పూజించేటప్పుడు ప్రజలు దేవుడుకి చీపుర్లను సమర్పిస్తారట.ఈ పాతాళేశ్వరాలయం పట్ల భక్తులకు ప్రత్యేకమైన భక్తి ఉంటుంది. ఇక్కడ ప్రజలు పాలు, నీరు, పండ్లు అలాగే కర్రలతో కూడిన చీపురులను శివలింగంపై శివునికి సమర్పిస్తారు. ఈ ఆలయంలో శివునికి ఇలా చీపురు సమర్పిస్తే కోరుకున్న ప్రతి కోరిక త్వరగా నెరవేరుతుందని వారి ప్రగాఢ నమ్మకం.
చీపురు సమర్పించగానే భోళాశంకరుడు వరాలు వెంటనే ఇచ్చేస్తాడనే నానుడి ప్రచారంలో ఉంది. అంతేగాదు ఇలా చీపురుని సమర్పిస్తే చర్మ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని భక్తులు నమ్ముతారట. ఈ శివాలయం ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం సుమారు 150 సంవత్సరాల నాటిదని ఆలయ పూజారి తెలిపారు. పూర్వీకుల కాలం నుంచి అక్కడి ప్రజలు శివుడికి ఇలా చీపురులను సమర్పించే ఆచారం పాటిస్తున్నారని చెప్పారు ఆలయ పూజారి. అందుకోసం ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో నిలుచుంటారని చెప్పుకొచ్చారు. నిత్యం వదలాది మంది దర్శించుకోవడానికి వస్తుంటారని అన్నారు.
ఈ గ్రామంలో భిఖారిదాస్ అనే వ్యాపారవేత్త నివసించేవాడని అతడు చాలా ధనవంతుడని చెబుతారు. కానీ., అతనికి పెద్ద చర్మ వ్యాధి వచ్చింది. ఒకరోజు ఈ వ్యాధికి చికిత్స పొందేందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా దాహం వేసింది. అప్పుడు అతను నీరు త్రాగడానికి ఈ మహాదేవుని ఆలయానికి వచ్చి ఆలయాన్ని ఊడుస్తున్న మహంత్‌ను ఢీకొన్నాడు. ఆ తర్వాత ఎలాంటి చికిత్స లేకుండానే అతడి జబ్బు తగ్గిపోయింది. దీంతో సంతోషించిన సేథ్ మహంత్‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించగా మహంత్ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు. అందుకు బదులుగా అతను ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మించమని సేథ్‌ను కోరాడు.
అప్పటి నుంచే ఈ ఆలయంలో చర్మవ్యాధి వచ్చిన వాళ్లంతా ఇక్కడ చీపురు సమర్పించాలని నమ్మకం ఏర్పడింది. ఇలా చేయడం వల్లే తమ కష్టాలు తీరిపోతాయని అక్కడ భక్తులు విశ్వసించడం విశేషం. అందుకే ఇప్పటికీ భక్తులు ఇక్కడికి వచ్చి చీపుర్లు సమర్పించుకునే ఆచారం కొనసాగుతోంది. ఏదీ ఏమైన కొన్ని పురాతన ఆలయాల్లో ఏర్పడే ఆచారాలు అత్యంత వింతగా ఉంటాయి. ఒక్కరితో మొదలైన నమ్మకం ఆచారంగా మారి బలంగా నమ్మే సంప్రదాయంగా మారిపోతుంది అనడానికి ఈ దేవాలయ కథే ఉదాహరణ. కొన్ని ఆచారాలు ఆరోగ్య రహస్యలతో మిళితమై ఉంటాయి కూడా. అందుకే కాబోలు మన సనాతన ధర్మం అత్యంత గొప్పది అని పదే పదే చెబుతుంటారు పండితులు.
(చదవండి: వందేళ్లు బతకాలనుకుంటే..ఈ అలవాట్లు తప్పనిసరి అంటున్న పరిశోధకులు!)
Comments
Please login to add a commentAdd a comment