‘సమానత్వాన్ని సాధించడం... మానవీకరించడం... ఆధ్యాత్మికతను అద్దడం..’ ఈ మూడూ భారతదేశం సాధించవలసిన లక్ష్యాలుగా భావిస్తున్నానని చెప్పారు, మహదేవ గోవింద రానడే. భారతదేశాన్ని వేధిస్తున్న దారిద్య్రమనే మహా రుగ్మతకి పరమౌషధం పరిశ్రమల స్థాపనేనంటూ రానడే (జనవరి 18,1842–జనవరి 16,1901) చెప్పిన మాట దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన ది. ఆ మాట ఆయన చెప్పినది 19వ శతాబ్దంలో. రానడేను గురువుగా భావించిన తొలినాటి స్వాతంత్య్ర సమరయోధులూ, అనంతర కాలాలలో ఆయన రచనలతో, ఆలోచనలతో ప్రేరణ పొందినవారూ ఆయనను ‘భారతీయ ఆర్థికశాస్త్ర పితామహుడు’గా సంభావిస్తారు. 1912లో ఇక్కడకొచ్చిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ఆచార్యుడు లీజ్ స్మిత్ అయితే, రానడేను భారతదేశంలో పుట్టిన అత్యంత ప్రతిభాశాలురైన చింతనాపరులలో ఒకరని కీర్తించారు.
నిస్సందేహంగా రానడే ఆలోచనా ధార ఒక అద్భుతం. ఇప్పటికీ ప్రపంచాన్ని శాసించడానికి పోటీ పడుతున్న ఆర్థికశాస్త్ర చింతనాధోరణుల జాడలు చాలా వరకు రానడే ఆలోచనలలో బీజప్రాయంగా కనిపిస్తాయి. ఆయన బ్రిటన్‌ను అభిమానించేవారు. కానీ వారి స్వేచ్ఛావాణిజ్య వాదాన్ని పూర్తిగా నిరాకరించేవారు. అలాంటి వాదాలు దేశాలను శాశ్వతంగా వెనుకబాటుతనంలో మునిగిపోయేటట్టు చేస్తాయని హెచ్చరించారు కూడా. భారత ఆర్థిక విధానానికి గతమే పునాదిగా ఉండాలని చెప్పారాయన. అదే సమయంలో వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం సరికాదన్నారు. దారిద్య్రాన్ని నిర్మూలించాలంటే పరిశ్రమల స్థాపన ఒక్కటే పరిష్కారమని సిద్ధాంతీకరించారు. భారతదేశ పరిస్థితులను వ్యవసాయానికి విశేష ప్రాధాన్యాన్ని నిరాకరించడం అసంబద్ధంగానే అనిపిస్తుంది. తను అలాంటి నిర్ణయానికి ఎందుకు రావలసి వచ్చిందో ఆయన వివరించారు. ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలను అధ్యయనం చేసిన తరువాతనే ఆయన భారతీయ సేద్యం గురించి ఆలాంటి అభిప్రాయానికి వచ్చారు.
19వ శతాబ్దం మధ్య నుంచి, 20వ శతాబ్దం వరకు మన చరిత్రలో దర్శనమిచ్చే ఆధునిక దృష్టి కలిగిన మహోన్నత ప్రతిభావంతులలో, బహుముఖ ప్రజ్ఞశాలురు అని చెప్పడానికి నమూనాలుగా కనిపించేవారిలో ఒకరు– ఎంజీ రానడే. ఆయన మహారాష్ట్రలోని నిపహాడ్‌లో జన్మించారు.
బొంబాయిలోని చరిత్రాత్మక ఎల్ఫిన్‌స్టోన్ కళాశాలలో ఆర్థికశాస్త్ర అధ్యాపకునిగా రానడే జీవితం ఆరంభమైంది. తరువాత బొంబాయి హైకోర్టు న్యాయమూర్తి పదవిని అలంకరించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో ఆయన ఫైనాన్స్ కమిటీ సభ్యుడు. జీవితం మొత్తం అరవయ్యేళ్లు. కానీ సంఘ సంస్కరణకి, విద్యా రంగానికి, చరిత్ర రచనకి, భారత జాతీయ కాంగ్రెస్ తొలినాటి ఉద్యమానికి కూడా రానడే విశేషమైన సేవలు అందించారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని ఒక ప్రత్యేక శాఖగా గుర్తించేటట్టు చేయడంలో రానడే నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. భారత ఆర్థిక వ్యవస్థ, సమాజం రెండూ ఏకకాలంలో పురోగతి సాధించడానికి అనువైన ఒక ఆర్థిక తాత్వికత గురించి ఆయన తపించారు. జాతీయ సమస్యల నేపథ్యంలోనే ఆర్థిక శాస్త్ర అధ్యయనం జరగాలని రానడే భావించేవారు. ఆర్థికశాస్త్ర అధ్యయనాన్ని వాస్తవానికి మరింత దగ్గరగా తీసుకుపోవడానికీ, మరింత అర్థవంతం చేయడానికీ ఆయన ఈ సూచన చేశారు.
రానడే దృష్టిలో ఆర్థికశాస్త్రమంటే, ఒక సాధారణ శాస్త్రం కాదు. ఒక దేశ సామాజిక, చారిత్రక సందర్భాలను పునాదిగా చేసుకుని ఆవిర్భవించే శాస్త్రమది. భారతీయులు భౌతిక సంపదను పెంచుకోవడమనే ఒకే ఒక్క లక్ష్యంతో ప్రభావితులైనవారు కాదనీ, ఇతర వాస్తవికతలు కూడా అందులో ఉన్నాయనీ అంటారాయన. భారతీయ సమాజాన్ని ప్రధానంగా మతం నడుపుతుంది. ఆపై కులం కీలకంగా ఉంటుంది. వీటిని దాటి భారతీయుడు తన ఒక్కడి సొంతానికి భౌతిక సంపదను పెంచుకునే లక్షణాన్ని ఏర్పరచుకోలేడని రానడే చెప్పారు. ఇక్కడి శ్రమశక్తి, పెట్టుబడి చైతన్యం కలిగినవి కాదని అన్నారు. వేతనాలను కూడా కులం, హోదా శాసిస్తాయని చెప్పారు. రానడే బయటపెట్టిన ఇంకొక అంశం విస్తుగొలుపుతుంది. ఇక్కడ పోటీతత్వం బలహీనమైనదనీ, సంప్రదాయాల కారణంగా ఆ పోటీశక్తులు తమకు తామై సంకెళ్లు బిగించుకున్నాయనీ ఆయన వాదన.
పరిశ్రమ స్థాపన జరగాలి. కానీ ఆ పనిలో ప్రభుత్వమే కీలక పాత్ర వహించాలి. రాయితీలు ఇచ్చి ఉత్పాదన సామర్థ్యాన్ని విస్తరించాలి. ఉన్నత విద్య, సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటు కూడా ప్రభుత్వపరంగానే జరగాలి. స్వేచ్ఛా వాణిజ్య వాదం, పురోగతి– ఇవి ఒక ఒరలో ఇమడలేని విధానాలుగానే ఆయన చూశారు. బ్రిటన్‌లో పుట్టిన స్వేచ్ఛా వాణిజ్యవాదంతో భారతదేశం వంటి దేశం ఎప్పటికీ వెనుకబడే ఉంటుందని ఆయన అభిప్రాయం. అదే పురోగతి అనే దృక్పథం ఉంటే? అడ్డంకుల నుంచి స్వాతంత్య్రానికి, బోళాతనం నుంచి విశ్వాసం వైపు, అసంఘటితత్వం నుంచి సంఘటితత్వానికి, మతావేశం నుంచి సహనం వైపు, గుడ్డి నమ్మకం నుంచి ఆత్మగౌరవం వైపు ప్రస్థానం సాగుతుందని ఆయన భావించారు. స్వేచ్ఛా వాణిజ్యమనే విధానమూ సరికాదన్నారాయన. ఎగుమతులు, దిగుమతుల మీద అదుపు లేకుంటే, మొదట నష్టపోయేది దేశీయ పరిశ్రమలేనని చెప్పారు. దాదాభాయ్ నౌరోజీ డ్రెయిన్ థియరీని ప్రపంచంలో చాలామంది విశ్వసించినప్పటికీ రానడే మాత్రం వ్యతిరేకించారు. ‘పావర్టీ అండ్ అన్‌బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో నౌరోజీ ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భారతదేశ వనరులను దోచుకుపోయి, ఇంగ్లండ్ పరిశ్రమలలో వస్తువులను ఉత్పత్తి చేసి, తిరిగి భారతదేశ మార్కెట్‌లోనే విక్రయించి మళ్లీ లాభాలను బ్రిటన్‌కే తరలించడాన్ని డ్రెయిన్ థియరీ అంటారు. భారతదేశ వెనుకబాటుతనం ఒక్క ఇంగ్లిష్ జాతితోనే సంప్రాప్తించింది కాదనీ, వెనుకబాటుతనం లోతులు చరిత్రలోనే ఉన్నాయని రానడే చెప్పారు. బ్రిటిష్ జాతీయులు రాక పూర్వం కూడా ఇక్కడ పేదరికం ఉందని, ఆంగ్లేయులు వచ్చిన తరువాత అది మరింత అధికమైందన్నదే నిజమని అన్నారాయన. దేశంలో దారిద్య్రానికి మూలం వ్యవసాయానికి విశేష ప్రాధాన్యం ఇవ్వడం, పరిశ్రమలు లేకపోవడం, రుణ సదుపాయం లేకపోవడం, లోపభూయిష్టమైన భూ విధానం కారణాలని రానడే విశ్లేషించారు.
రుణ విధానాన్ని పునర్వ్యవస్థీకరించమని ఆయన ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇది మాత్రం ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంది. భూతనఖా బ్యాంకుల ఏర్పాటు ఆ సలహా ఫలితమే. అసలు సేద్యానికి, విశేష ప్రాధాన్యానికి కారణం ప్రభుత్వ విధానమని, ఇంగ్లండ్‌కు ఎగుమతి చేయడానికి అవసరమైన పంటలనే బ్రిటిష్ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని ఆయన చెప్పారు. భారతదేశంలో పరిశ్రమలు వెనుకబడిపోవడానికి కారణం– విదేశీ పరిశ్రమలతో పోటీకి నిలబడలేకపోవడమేనని చెప్పారాయన. దేశీయమైన వనరులను దేశంలోని కర్మాగారాలలో వస్తువుల ఉత్పత్తికి వినియోగించాలని రానడే నినదించారు. భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు చొరవ చూపించవలసిందనీ, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించవలసిందనీ ఆయన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వాన్ని పదే పదే కోరేవారు. అందుకే ఆయనను ఆధునిక ఆర్థిక శాస్త్ర పిత అని పిలిచేవారు. మొత్తంగా ఆయన సిద్ధాంతంలో నేటికీ ఉపయోగపడే ఒక అంశం ఉంది. వ్యవసాయాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం– ఈ మూడింటిని కూడా ప్రణాళికాబద్ధంగా సమ ప్రాధాన్యంతో అభివృద్ధి చేయాలని రానడే సిద్ధాంతీకరించారు. అదే సమయంలో వ్యవసాయం మీద ఆధారపడేవారి సంఖ్యను తగ్గించకపోతే ఆ రంగాన్ని అభివృద్ధి చేయడం కూడా కష్టమేనని చెప్పారు.
ఆధునిక కాలంలో కనిపిస్తున్న వెనుకబాటుతనం, నిరుద్యోగం తొలగిపోవాలంటే పరిశ్రమల స్థాపనే పరిష్కారమని సూచించారాయన. గ్రామసీమలు యథాతథంగా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాయన్న రాజా రామ్‌మోహన్‌రాయ్ అభిప్రాయాలను ఇక్కడే రానడే గట్టిగా వ్యతిరేకించారు. ఆడమ్ స్మిత్, డేవిడ్ రికార్డో, మాల్థస్, జేమ్స్ మిల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్తల సిద్ధాంతాలను కూడా రానడే నిరాకరించారు. అవన్నీ స్థిరపడిన వ్యవస్థలకే పరిమితమని ఆయన అభిప్రాయం.
జర్మన్ ఆర్థికవేత్త ఫ్రెడ్రిక్ లిస్ట్ సిద్ధాంతాలతో రానడే ప్రభావితులయ్యారు. వ్లాదిమిర్ లెనిన్ కూడా లిస్ట్ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యారని చెబుతారు. లిస్ట్ సిద్ధాంతాలను భారతీయ సమాజానికి అన్వయించడానికి రానడే కృషి చేశారు. ఆర్థిక విధానాలకు సంబంధించి లెనిన్ అంటే నెహ్రూకు గురి. అయితే లెనిన్, రానడే ఇద్దరూ లిస్ట్ సిద్ధాంతాలతో ప్రభావితులయ్యారన్న సంగతి నెహ్రూకు తెలుసో లేదో తెలియదు. సుభాస్ చంద్రబోస్ జర్మనీలో ఉండగా లిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. స్వతంత్ర భారతదేశంలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆయన ఊహకు మూలం లిస్ట్ చూపిన ప్రభావం కారణం కావచ్చు. గోపాలకృష్ణ గోఖలే రానడే ప్రత్యక్ష శిష్యుడు. గోఖలే శిష్యుడు గాంధీజీ. అందుకే రానడే ఆలోచనల ప్రభావం గాంధీజీ మీద కూడా పరోక్షంగా కనిపిస్తుంది. పరిశ్రమల స్థాపన మీద, సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతీయులకు పరిచయం చేయడం గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య పూణెలోనే చదువుకున్నారు. ఇలాంటి ఆలోచనలు రానడే రచనల నుంచే విశ్వేశ్వరయ్య స్వీకరించి ఉంటారన్న వాదనలు కూడా ఉన్నాయి.
రానడే ఆలోచనలు ఆర్థిక పురోగతి వరకే పరిమితం కాలేదు. అసలు ఆర్థిక పురోగతి, ఆధ్యాత్మిక కోణంతో ఉండాలన్నదే ఆయన వాదన. సంఘ సంస్కరణ ఆయన జీవితంలో కనిపించే మరొక గొప్ప కోణం. నిజానికి సంఘ సంస్కర్తగానే ఆయన ఎక్కువ మందికి గుర్తు. వక్తృత్వతేజక్ సమాజ్, పూణె సార్వజనిక్ సభ, ప్రార్థనా సమాజ్, సోషల్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలలో ఆయన అవిశ్రాంతంగా పనిచేశారు. బాల్య వివాహాలను అడ్డుకోవడం, వితంతు పునర్వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం, బాలికలకు చదువు వంటి వాటి కోసం ఆ సమాజాలు పనిచేశాయి. 1861లో ఆయన ప్రారంభించిన విడో మ్యారేజ్ అసోసియేషన్ ఇందుకు సంబంధించినదే. ఇక భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యులలో రానడే ఒకరు. ‘రైజ్ ఆఫ్ మరాఠా పవర్’ ఆయన రాసిన చరిత్ర గ్రంథం. బ్రిటిష్ ఇండియాను ఉదార విధానాలకు పరిచయం చేసిన మహనీయుడు ఈ మహదేవుడు.
∙డా. గోపరాజు నారాయణరావు
ఆర్థిక శా స్త్రానికి అడుగుజాడ
Published Sun, Apr 1 2018 1:33 AM | Last Updated on Sun, Apr 1 2018 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment