
బెంగళూరు : కర్ణాటక జేడీఎస్ ఎమ్మెల్యే కె.మాధవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గమైన పిరియపట్నలో బుధవారం ప్రజలతో మాట్లాడుతూ.. తనకు రూ.40 కోట్లు ఇస్తామని ఆఫర్ వచ్చిందని మాధవ్ తెలిపారు. అయితే ఈ మొత్తాన్ని ఎవరు ఇస్తారన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. ‘నాకు రూ.30–40 కోట్లు ఇస్తామన్నారు. భారీగా నగదును 2–3 సార్లు నా గదికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే వెళ్లిపోకుంటే ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించా. నేను అమ్ముడుపోను. అంత డబ్బును ఏం చేయాలో కూడా నాకు తెలియదు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకూడదంటే రూ.80 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జార్కిహోళీ నాముందే కూటమి నేతల్ని డిమాండ్ చేశారు’ అని వ్యాఖ్యానించారు.