అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో నాయకులు ప్రచారంలో దూసుకున్నారు. దీంతో చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వాతావరణం వాడీవేడిగా మారింది
తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి సీఎం భూపేష్ బఘేల్ రూ. 508 కోట్లు స్వీకరించినట్లు ఈడీ పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మహదేవ్ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్‌లో భారీ మొత్తంలో నగదు చెలామణి అవుతున్నట్లు తమకు గురువారం సమాచారం అందిందని ఈడీ అధికారులు తెలిపారు
ఈ మేరకు హోటల్ ట్రిటన్‌లతోపాటు భిలాయ్‌లోని మరోచోట ఈడీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం యూఏఈ నుంచి నగదు తీసుకొస్తున్న అసిమ్ దామ్ అనే వ్యక్తిని పట్టుకున్నట్లు ఈడీ తెలిపింది. ఆయన కారు, నివాసంపై సోదాలు జరపగా.. రూ.5.39 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది.
అయితే ఆ డబ్బును రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెట్టేందుకు మహదేవ్ యాప్ ప్రమోటర్లు బఘేల్‌కు డెలివరి చేసేందుకు ఉద్ధేశించినట్లు నగదుతో పట్టుబడిన వ్యక్తి తమకు తెలిపినట్లు ఈడీ వెల్లడించింది. అంతేగాక మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం భూపేష్ బఘేల్‌కు రూ. 508 కోట్లు చెల్లింపులు చేసినట్లు చెప్పారని పేర్కొంది. కాగా చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారాయి. నవంబర్ 7, 17 తేదీల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇదిలా ఉండగా మహదేవ్ బెట్టింగ్ యాప్ నిర్వహకులు విదేశాల్లో ఉంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని తన సన్నిహితులతో బెట్టింగ్ సిండికేట్ నడుపుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేసింది. ఇప్పటివరకు రూ. 450 కోట్లకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకుంది. మహాదేవ్ యాప్ బెట్టింగ్ కేసులో ఈడీ ఇటీవలే తొలి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఇందులో యాప్ ప్రమోటర్లు సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ సహా 14 మంది నిందితులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment