సౌరభ్ చంద్రకర్ పేరు ఎప్పుడైనా విన్నారా? కొంతకాలం క్రితం వరకు ఈ పేరు గురించి ఎప్పుడూ చర్చ జరగలేదు. ఇప్పుడు హఠాత్తుగా పతాక శీర్షికల్లో ఈ పేరు కనిపిస్తోంది. సౌరభ్ చంద్రకర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిఘా పెట్టడం, అధికారుల విచారణలో వెల్లడైన షాకింగ్ వివరాలే ఇందుకు కారణంగా నిలిచాయి. సౌరభ్ తన పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే స్టీల్ కింగ్ లక్ష్మీ మిట్టల్, ముఖేష్ అంబానీల ఇంట జరిగిన పెళ్లిళ్లు గుర్తుకొస్తాయి. ఈ పెళ్లిళ్లకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారు. లక్ష్మీ మిట్టల్ తన కుమార్తెకు పారిస్‌లో వివాహం జరిపించారు. ఈ వివాహానికి ఆయన రూ. 240 కోట్లు ఖర్చు చేశారు.
బంధువుల కోసం ప్రైవేట్ జెట్
మీడియా కథనాల ప్రకారం మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ పెళ్లికి సౌరభ్ చంద్రకర్ దాదాపు 200 కోట్లు ఖర్చు పెట్టాడు. తమ బంధువులు, ప్రముఖులను నాగ్‌పూర్ నుంచి దుబాయ్ తీసుకువచ్చేందుకు ఆయన ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పెళ్లి ఖర్చుల్లో ఎక్కువ భాగం నగదు రూపంలోనే వెచ్చించాడు. దీనిని చూస్తే సౌరభ్ దగ్గర ఎంత సంపద ఉందో అంచనా వేయవచ్చు.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు
మహదేవ్ యాప్‌తో లింక్ కలిగిన 39 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించి, రూ.417 కోట్ల విలువైన షేర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన సౌరభ్ చంద్రకర్ దుబాయ్‌లో ఉంటున్నాడు. అక్కడి నుంచే ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠాను నడుపుతున్నాడు. బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టినట్లు విచారణలో వెల్లడైంది. చంద్రకర్, అతని భాగస్వామి రవి ఉప్పల్ ‘మహదేవ్ యాప్’ ప్రమోటర్లు. దుబాయ్‌లో ఉంటూ వారు భారత్‌లో బెట్టింగ్ వ్యాపారం సాగిస్తున్నారు.
పలువురు ప్రముఖులు హాజరు
సౌరభ్ చంద్రకర్ వివాహం ఇటీవల యూఎఈలోనిఆరవ అతిపెద్ద నగరమైన రాక్‌లో జరిగింది. తన పెళ్లి కోసం వెడ్డింగ్ ప్లానర్‌కు ఆయన రూ.120 కోట్లు చెల్లించాడు. సౌరభ్ తన బంధువులను దుబాయ్‌కు తీసుకురావడానికి నాగ్‌పూర్ నుండి ప్రైవేట్ జెట్‌లను పంపాడు. వివాహ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించారని, దీనికి సంబంధించిన మొత్తం చెల్లింపును హవాలా ద్వారా నగదు రూపంలో చెల్లించారని సమాచారం. యోగేష్ బాపట్‌కు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆర్-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు హవాలా ద్వారా రూ.112 కోట్లు ఇచ్చినట్లు డిజిటల్ ఆధారాలు వెల్లడించినట్లు ఈడి తెలిపింది. అదేవిధంగా హోటల్ బుకింగ్ కోసం యూఏఈ కరెన్సీలో రూ.42 కోట్లు చెల్లించాడు.
ఇది కూడా చదవండి: ఇవి.. దేశంలోని అందమైన గ్రామాలు.. ఎక్కడున్నాయంటే?
Comments
Please login to add a commentAdd a comment