festival of lights
-
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు వెలిగిస్తే మంచిది..!
చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి. అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం... నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తత.. రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి. అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నరకుడు చస్తే పండుగ ఎందుకు? నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు. దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు. యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది. దీపావళి నాడు ఏం చేయాలి? ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట. అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి. చదవండి: Millet Snacks: చిరుధాన్యాలతో చిరుతిళ్ల వ్యాపారం!.. కోట్లలో లాభం.. దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి? దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది. వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి. అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి. అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా. దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు. ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి. దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం. లక్ష్మీపూజ ఇలా చేయాలి... ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి. ఎన్నో కథలు... మరెన్నో కారణాలు.. లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది. భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం. – డి.వి.ఆర్.భాస్కర్ చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! -
దివ్వెకువెలుగు
దీపాల పండగకు దివ్వె వెలుగులు విరజిమ్ముతుంది. మరి ఆ దివ్వెకే వెలుగులు అద్దితే.. ఆ వెలుగు మరింత కళగా, కాంతిని విరబూస్తుంది. దీనికి ఎంతో ఖర్చు అక్కర్లేదు. ఇంట్లో ఏదో సందర్భంలో కొని వాడకుండా పక్కన పెట్టేసిన పూసలు, లేసులు, కలర్స్‌తో ప్రమిదలను అందంగా తీర్చిదిద్దుకోవచ్చు. ►మట్టి ప్రమిదలు, చిన్న చిన్న కుండలు, మట్టి ప్లేటు, పెయింట్, పూసలు, చమ్కీలు, లేస్, గ్లూ... తీసుకోవాలి. ►ప్రమిదలకు, ప్లేట్‌కు లోపలి వైపు ఒక రంగు, బయటి వైపు ఒక రంగు వేయాలి. ఆరిన తర్వాత లేస్ లేదా పూసల దండను గ్లూ సాయంతో ప్రమిదలకు, కుండలకు చుట్టూ అతికించాలి. ►ప్లేటులో కుండలను వరసగా పెట్టి, వాటి ముందు అలంకరించిన దివ్వెను అతికించాలి. ప్రమిదలకు అద్దాలు, చమ్కీలను కూడా అతికించవచ్చు. ఇలా అందమైన రూపాల్లో దివ్వెను నచ్చిన డిజైన్లలో అలంకరించుకోవచ్చు. -
తెలుగు ముంగిళ్లలో కొత్త కాంతులు
హైదరాబాద్: వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలయింది. టపాసుల చప్పుళ్లు, పిల్లల కేరింతలతో ఊళ్లలన్నీ మార్మోగుతున్నాయి. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే ఈసారి దీపావళి సందడి తక్కువగానే ఉందని చెప్పాలి. సమైక్య ఉద్యమం, ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి కారణంగా పండుగ శోభ తగ్గింది. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ జీతం ఇంకా అందకపోవడంతో వారు పండుగకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు బాణాసంచా ధరలు చుక్కలనంటుతుండడంతో వాటిని కొనేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొనుగోళ్లు తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఊసూరుమంటున్నారు. అయితే అన్నివర్గాలు వారు ఉన్నంతలో పండుగ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.