తెలుగు ముంగిళ్లలో కొత్త కాంతులు
హైదరాబాద్: వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలయింది. టపాసుల చప్పుళ్లు, పిల్లల కేరింతలతో ఊళ్లలన్నీ మార్మోగుతున్నాయి. తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తారు.
అయితే ఈసారి దీపావళి సందడి తక్కువగానే ఉందని చెప్పాలి. సమైక్య ఉద్యమం, ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి కారణంగా పండుగ శోభ తగ్గింది. సమైక్య ఉద్యమంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు అడ్వాన్స్ జీతం ఇంకా అందకపోవడంతో వారు పండుగకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
మరోవైపు బాణాసంచా ధరలు చుక్కలనంటుతుండడంతో వాటిని కొనేందుకు ప్రజలు భయపడుతున్నారు. కొనుగోళ్లు తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఊసూరుమంటున్నారు. అయితే అన్నివర్గాలు వారు ఉన్నంతలో పండుగ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.