సాక్షి,సిటీబ్యూరో: ఈ ఏడాది దీపావళి పండగ సందర్భంగా నగరంలో శబ్దకాలుష్యం స్వల్పంగా తగ్గింది. కానీ వాయు కాలుష్యం సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. పీసీబీ జారీ చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. సుప్రీంకోర్టు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్యనే టపాసులు కాల్చాలంటూ జారీచేసిన మార్గదర్శకాలు నగరవ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. నగరంలోని సెంట్రల్ జోన్ పరిధిలో ఉల్లంఘనులపై పోలీసులు 71 కేసులు నమోదుచేసినా మిగతా జోన్లలో ఈ నిబంధనలు అమలు చేయకపోవడం గమనార్హం. ఇక టపాసులుకాలుస్తూ కళ్లకు గాయాలైన 14 మందిని సరోజినిదేవీ కంటి ఆస్పత్రిలో చేర్చారు. వీరిలో అత్యధికులు చిన్నారులేనని, నలుగురి కళ్లకు శస్త్రచికిత్సలు చేశామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరో ఇద్దరి కార్నియా పూర్తిగా దెబ్బతినడంతో శాశ్వతంగా కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మరో 8 మందికి చికిత్స చేసి ఇంటికి పంపినట్లు చెప్పారు. కాలిన గాయాలతో మరో 11 మంది ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా.. ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
స్వల్పంగా తగ్గిన శబ్ద కాలుష్యం
దీపావళి సందర్భంగా నగరంలో కాలుష్య నియంత్రణ మండలి పారిశ్రామిక, వాణిజ్య, నివాస, సున్నిత ప్రాంతాల్లో శబ్ద కాలుష్యాన్ని వేర్వేరుగా నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఢాం.. ఢాం శబ్దాలు స్వల్పంగా తగ్గాయి. ఆస్పత్రులు, విద్యాసంస్థలు ఉన్న సున్నిత ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదిక వెల్లడించింది.
పెరిగిన వాయు కాలుష్యం
తక్కువ శబ్దం వెలువడే క్రాకర్స్ స్థానంలో అధిక పొగ వెదజల్లే బాణసంచా కాల్చేందుకు సిటీజన్లు ప్రాధాన్యం ఇనివ్వడంతో ఈసారి వాయు కాలుష్యం గణనీయంగా పెరిగినట్లు పీసీబీ తాజా నివేదికతో స్పష్టమైంది. అయితే, గాలిలో సూక్ష్మ, స్థూల ధూళికణాల మోతాదు గతేడాది కంటే స్వల్పంగా తగ్గినట్లు తేలింది. కానీ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా మోతాదు ఘనపు మీటరు గాలిలో గణనీయంగా పెరిగింది.
సాధారణం కంటే అధికమే..
సాధారణ రోజులతో పోలిస్తే దీపావళి రోజు నగర వాతావరణంలో వివిధ రకాల కాలుష్య కారకాల మోతాదు రెట్టింపయినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. సూక్ష్మ ధూళికణాల కాలుష్యం సాధారణ రోజుల్లో 34 శాతం మేర నమోదవుతుండగా.. దీపావళి రోజున 61 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది.
14వ తేదీ దాకా కాలుష్యం పరిశీలన
సుప్రీంకోర్టు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల మేరకు నగరంలో శబ్ద, వాయు కాలుష్యంపై అక్టోబరు 31 నుంచి ప్రత్యేకంగా నమోదు చేస్తున్నామని పీసీబీ తెలిపింది. ఈనెల 14 వరకు నగరంలో వాయు నాణ్యత, శబ్ద, వాయు కాలుష్యాన్ని శాస్త్రీయంగా లెక్కించి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తామని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment