సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకాకు సంబంధించిన ప్రికాషన్ డోసు పంపిణీపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. 18–59 ఏళ్ల మధ్యనున్న వారికి ఈ నెల 15 నుంచి ఈ టీకా పంపిణీని ప్రారంభించారు. ఇప్పటివరకూ 15,53,703 మందికి పంపిణీ చేశారు. అత్యధికంగా 1,15,076 మందికి ఇవ్వడం ద్వారా కర్నూల్ జిల్లా తొలి స్థానంలో ఉంది. అనంతరం.. 1.04 లక్షలతో విశాఖపట్నం, 85,569 మందితో శ్రీకాకుళం తర్వాత స్థానాల్లో నిలిచాయి.
సెప్టెంబర్ నెలాఖరులోగా 3.43 కోట్ల మందికి
ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరులోగా రాష్ట్రంలో 3.43 కోట్ల మందికి ఈ ప్రికాషన్ టీకాను పంపిణీ చేయాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకూ 15.53 లక్షల మందికి వేశారు. గడువులోగా లక్ష్యం పూర్తికి వైద్య, ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వారంలో రెండ్రోజులు కాలేజీలు, బస్టాండ్‌లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో టీకా పంపిణీ చేపడుతున్నారు. ఇక భారీ వర్షాలు, వరదల కారణంగా పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం మందగించింది. కానీ, అవి ఇప్పుడు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టీకా పంపిణీని వేగవంతం చేయడంపై అధికారులు దృష్టిపెట్టారు. ఎప్పటికప్పుడు జిల్లాల వైద్యాధికారులతో సమీక్షలు నిర్వహించి పురోగతిపై ఆరా తీస్తున్నారు. రెండో డోసు టీకా వేసుకుని ఆర్నెలలు పూర్తయిన వారందరికీ ప్రికాషన్ డోసు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
73 శాతం పూర్తి
మరోవైపు.. ఫ్రంట్‌లైన్, హెల్త్‌కేర్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నెలాఖరుకు 76,95,871 మందికి వేయాల్సి ఉండగా 56.19 లక్షల మందికి (73.02%) పూర్తయింది. అలాగే, హెల్త్‌కేర్ వర్కర్లు 98.46%, ఫ్రంట్‌లైన్ వర్కర్లు 85.46 శాతం, 60 ఏళ్లు పైబడి 67.39 శాతం మందికి ప్రికాషన్ టీకా వేశారు.
99.02% మంది పిల్లలకు రెండు డోసులు
ఇక 12–14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా రెండు డోసుల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్రంలో ఈ వయసు పిల్లలు 14.90 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించగా.. అనతికాలంలోనే ఆ లక్ష్యాన్ని అధిగమించి తొలి డోసు పంపిణీని వైద్యశాఖ పూర్తిచేసింది. 99.02 శాతం మందికి రెండో డోసు టీకా ప్రక్రియ కూడా పూర్తయింది. అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ఏలూరు జిల్లాల్లో రెండు డోసుల పంపిణీ వంద శాతం ముగిసింది. కనిష్టంగా విజయనగరం జిల్లాలో 93.5 శాతం, ఏఎస్‌ఆర్ జిల్లాలో 95.73 శాతం మందికి రెండు డోసుల టీకా వేశారు. మిగిలిన అన్ని జిల్లాల్లో 97 శాతానికి పైగా రెండు డోసులు పంపిణీ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment