చలిలో విద్యుత్‌ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే.. | Precautions For Electric Vehicles In Winter Season | Sakshi
Sakshi News home page

చలిలో విద్యుత్‌ వాహనాలు.. ఇవి పాటించాల్సిందే..

Published Thu, Jan 11 2024 1:57 PM | Last Updated on Thu, Jan 11 2024 2:10 PM

Precautions For Electric Vehicles In Winter Season - Sakshi

చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుంటాయి. ఇలాంటి వాతావరణంలో విద్యుత్‌ వాహనాల పనితీరు భిన్నంగా ఉంటుంది. లిథియం అయాన్ బ్యాటరీల్లో ఛార్జింగ్‌ త్వరగా తగ్గిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది? శీతల వాతావరణంలో ఈవీలను ఎలా మెయింటైన్‌ చేయాలి? ఛార్జ్‌ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రభావం ఇలా..

శీతాకాలంలో ఈవీల పనితీరు సాధారణం కంటే 20-30 శాతం తగ్గుతుందని వాహన నిపుణులు చెబుతున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. బ్యాటరీ పనితీరు తగ్గడం ఒకటైతే.. శక్తి వినియోగం పెరగడం మరొకటి. విద్యుత్‌వాహనాల లిథియం అయాన్ బ్యాటరీలు 15-25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో సరిగ్గా పనిచేస్తాయి. మరోవైపు చలికాలంలో వాహనాలకు అవసరమైన వేడి కోసం బ్యాటరీ నుంచే ఎక్కువ శక్తిని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో సాధారణ సమయంలో కంటే శీతాకాలంలో బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

చలిలో రీజనరేటివ్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ అంత ప్రభావవంతంగా పనిచేయదు. సాధారణ సమయంలో ఈ బ్రేకింగ్‌ వ్యవస్థ వల్ల బ్యాటరీ కొంతమేర ఛార్జ్‌ అవుతుంది. శీతాకాలంలో మాత్రం ఇది అంతగా పనిచేయదు. ఈ నేపథ్యంలో చల్లని వాతావరణంలో ఈవీలను డ్రైవ్ చేయడం కొంత భిన్నంగా అనిపిస్తుంది. 

ఇలా ఎందుకంటే..

చలిలో లిథియం అయాన్‌ బ్యాటరీల్లోని ఎలక్ట్రోలైట్‌ లిక్విడ్‌ మందంగా ఉంటుంది. దీంతో ఎలక్ట్రోకెమికల్‌ ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా బ్యాటరీల అంతర్గత నిరోధం పెరుగుతుంది. దీంతో లిథియం అయాన్లు యానోడ్‌, కేథోడ్‌ మధ్య సులభంగా చలించలేవు. ఇలాంటి స్థితిలో బ్యాటరీ నుంచి ఒక్కసారిగా శక్తిని తీసుకోవడం ప్రారంభిస్తే వోల్టేజ్‌ గణనీయంగా పడిపోయి డిశ్ఛార్జ్‌కు దారితీస్తుంది.

ఇదీ చదవండి: నాలుగేళ్లలో రూ.400 లక్షల కోట్లు..?

జాగ్రత్తలు ఇవే..

  • వీలైనంత వరకు ఈవీలను బహిరంగ ప్రదేశాల్లో పార్క్‌ చేయొద్దు. ఇండోర్‌లో పార్క్‌ చేయడం వల్ల వాటిపై చలి ప్రభావం కొంతమేర తగ్గుతుంది.
  • కుదరకపోతే కనీసం కవర్‌తోనైనా కప్పి ఉంచాలి.
  • ఈవీల ఛార్జింగ్‌ 20 శాతం కంటే దిగువకు పడిపోకుండా చూసుకోవాలి. లేదంటే వాహనాన్ని స్టార్ట్‌ చేసినప్పుడు కొన్ని పరికరాలు వేడి కావడానికి బ్యాటరీ నుంచి శక్తిని తీసుకుంటాయి. దీంతో బ్యాటరీ మరింత తొందరగా డిశ్ఛార్జ్‌ అవుతుంది.
  • ఒకవేళ చలికాలంలో దూర ప్రయాణాలను ప్లాన్‌ చేస్తే కనీసం 80 శాతానికి పైనే ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement