కడుపు నింపుకోడానికే ఒళ్లు అమ్ముకుంటున్నారు: మంత్రి
మహిళలు కడుపు నింపుకోడానికే తమ శరీరాలు అమ్ముకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఉపయోగించుకోవాలి తప్ప.. ఇలా చేయకూడదని సరోగసీ బిల్లు గురించి మాట్లాడుతూ ఆమె ఇలా చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా కుటుంబాలు ఈ మహిళలతో వాళ్ల గర్భాలు అద్దెకు ఇచ్చేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని ఆమె అన్నారు. వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారని చెప్పారు.
జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అనుప్రియా పటేల్ అన్నారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది.
అయితే.. దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అంటున్నారు. దీనివల్ల అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని, నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లు థాయ్‌లాండ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కాలేజిలో చదివిన అనుప్రియా పటేల్.. అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్నారు. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఆమె అంటున్నారు.