Surrogacy bill
-
అద్దె గర్భానికి ఆమోదం
-
అద్దె గర్భాల బిల్లుకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: మహిళలు తమ ఇష్టంతో గర్భాశయాన్ని ఇతరులకు అద్దెకివ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ మేరకు అద్దె గర్భం నియంత్రణ బిల్లు–2020పై బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆమోద ముద్ర వేసింది. వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వొచ్చని బిల్లు స్పష్టం చేసింది. సరోగసీపై గతంలోని ముసాయిదా బిల్లులన్నింటినీ అధ్యయనం చేసి రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇచ్చిన సూచనలు అన్నింటినీ తాజా బిల్లులో పొందుపరిచినట్లు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో చెప్పారు. సరోగసీని వాణిజ్యానికి వాడకుండా నిరోధించడం, మంచి ఉద్దేశమైతే సరొగసీకి సహకరించడం ఈ కొత్త బిల్లు లక్ష్యాలని మంత్రి చెప్పారు. కొత్త బిల్లు ప్రకారం.. దేశంలో భారత్‌కు చెందిన దంపతులు మాత్రమే సరోగసి చేపట్టేందుకు వీలుంటుందని మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అబార్షన్ మొదలుకొని సరోగసి వరకూ వేర్వేరు అంశాల్లో మహిళల హక్కులపై ప్రధాని మోదీ విశాల దృక్పథంతో వ్యవహరిస్తున్నారని ఆమె చెప్పారు. సరోగసీ చట్టాలను సవరిస్తూ గత ఆగస్టులో లోక్‌సభ ఒక ముసాయిదా బిల్లును ఆమోదించింది. అయితే దగ్గరి బంధువులే అద్దెకు గర్భాన్ని ఇవ్వొచ్చనే నిబంధనపై విమర్శలొచ్చాయి. దీంతో బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని కమిటీ సరోగసీకి సంబంధించి అన్ని వర్గాల వారితోనూ చర్చించి బిల్లులో సవరణలను ప్రతిపాదించింది. సూచనలు చేసింది. వీటిని పొందుపరిచిన బిల్లును బుధవారం కేబినెట్ ఆమోదించగా బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే వీలుంది. కశ్మీర్లో కేంద్ర చట్టాల అమలుకు ఆదేశాలు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో ఉమ్మడి జాబితాలోని 37 కేంద్ర చట్టాలు అమలు చేసే ఆదేశాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గత ఆగస్టులో అవిభక్త కశ్మీర్ రాష్ట్రానికున్న ప్రత్యేక ప్రతిపత్తి హోదా(ఆర్టికల్ 370)ను రద్దుచేసి రాష్ట్రాన్ని ‘జమ్మూకశ్మీర్’, ‘లడాక్’ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం తెల్సిందే. దేశం మొత్తానికి అన్వయించే కేంద్ర చట్టాలు (జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని మినహాయించి) ఇకపై ఈ కేంద్ర పాలిత ప్రాంతాలకూ వర్తిస్తాయని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది. కేంద్రం ఆమోదంతో జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద ఆదేశాలు జారీ చేసేందుకు మార్గం సుగమమైంది. బుధవారం నాటి కేంద్ర కేబినెట్ సమావేశంలో హరియాణా, తమిళనాడుల్లో రెండు ఆహార సంబంధిత సంస్థలకు జాతీయ స్థాయి కల్పిస్తూ నిర్ణయం జరిగింది. ఇందుకు అనుగుణంగా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్,మేనేజ్మెంట్ చట్టానికి సవరణలు చేశామని జవదేకర్ తెలిపారు. జాతీయ స్థాయి గుర్తింపు తర్వాత ఆ సంస్థలు విదేశీ సంస్థల నుంచి నేరుగా సాయం పొందొచ్చు. బిల్లులోని ముఖ్యాంశాలు కేంద్రం, రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిల్లో జాతీయ సరోగసీ బోర్డుల ఏర్పాటు ► అద్దెకు గర్భాన్ని ఇచ్చే మహిళకు చేసే బీమా మొత్తాన్ని 36 నెలలకు పెంచారు. ► మానవ పిండాలు, గామేట్స్ (బీజం) కొనుగోలు, విక్రయాలపై నిషేధం. నైతిక సరోగసికి మాత్రమే అనుమతి. భారతీయ దంపతులు, భారతీయ సంతతి దంపతులు, 35–45 ఏళ్ల వితంతు మహిళ లేదా విడాకులు పొందిన మహిళలకే సరోగసి అనుమతి లభిస్తుంది. -
సరోగసీ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : సరోగసీ (అద్దె గర్భం) నియంత్రణ బిల్లు, 2019కి వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, నియంత్రణ లేమి కారణంగా దేశంలో సరోగసీ ఒక పరిశ్రమలాగా విస్తరిస్తూ అద్దె గర్భాలకు అంతర్జాతీయ గమ్యస్థానంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్దమైన నియంత్రణ లేని కారణంగా విదేశీయులు నిరుపేద భారతీయ మహిళలకు డబ్బు ఆశ చూపి వారిని గర్భం అద్దెకు ఇచ్చే తల్లుల మాదిరిగా మారుస్తున్నారు. ఇది చాలా ఆందోళనకర పరిణామం. అందుకే ఈ బిల్లుకు తమ పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విజయసాయి రెడ్డి ఈ సందర్భంగా బిల్లును పటిష్టంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కొన్ని సూచనలను ప్రభుత్వానికి చేశారు. బిల్లులో పేర్కొన్న వంధ్యత్వం అనే మాటకు నిర్వచనం చాలా అస్పష్టంగా ఉందన్నారు. ఒక మహిళ గర్భం దాల్చగలిగినా బిడ్డను ప్రసవించలేక తరచుగా గర్భస్రావం జరిగే ఆమె వైద్య స్థితిని, అలాగే గర్భధారణకు చేటు కలిగించే హైపర్‌టెన్షన్, డయాబెటిస్ వంటి జబ్బులతో బాధపడే పరిస్థితిని విస్పష్టంగా ఈ బిల్లులో నిర్వచించలేదని అన్నారు. దక్షిణాఫ్రికా, నెథర్లాండ్స్, గ్రీస్ ఇంకా ఇతర దేశాలలో పైన వివరించిన వైద్య సమస్యలతో బాధపడేవారికి సరోగసీకి అనుమతిస్తారని ఆయన తెలిపారు. అలాగే బిల్లులోని క్లాజ్ 4లో పేర్కొన్న విధంగా సరోగసీకి అనుమతి పొందడానికి ఒక జంట ఎస్సెన్షియాలిటీ సర్టిఫికెట్, ఎలిజిబులిటీ సర్టిఫికెట్ పొందాలన్న షరతు విధించడం జరిగింది. అయితే అలాంటి సర్టిఫికెట్ జారీకి అధికారులు నిరాకరించిన పక్షంలో అప్పీల్ కోసం ఎవరి వద్దకు వెళ్ళాలో ఈ క్లాజ్‌లో వివరించలేదని శ్రీ వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దీని వలన ఒకసారి సరోగసీ దరఖాస్తు తిరస్కరణకు గురైతే వారికి శాశ్వతంగా తలుపులు మూసినట్లేనని అన్నారు. కాబట్టి దరఖాస్తు సమీక్ష చేయడానికి అవకాశం కల్పించే క్లాజ్‌ను బిల్లులో పొందుపరచాలని కోరారు. -
లోపాల ‘సరోగసీ’ బిల్లు
సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడే దంపతులకు వరంగా ఉండే అద్దె గర్భం(సరోగసీ) విధానానికి అనుసరించాల్సిన నిబంధనలతో రూపొందిన బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. గందరగోళ పరిస్థితుల మధ్య కొద్దిసేపు జరిగిన చర్చతోనే బిల్లు ఆమోదం పొందడం విచారకరం. అద్దె గర్భం ప్రక్రియ మన దేశంలో గత పద్దెనిమిదేళ్లుగా అమల్లో ఉంది. ఏ నియంత్రణా లేనందువల్ల ఇది అనేక సమస్యలకు కూడా దారితీస్తోంది. ముఖ్యంగా ఇందుకు అంగీకరించే మహిళలు ఆరోగ్య సమస్యలు మొదలుకొని ఆర్థిక దోపిడీ వరకూ అనేకం ఎదు ర్కొంటున్నారు. సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందే సాంకేతికతను అమలు చేస్తున్న క్లినిక్‌లపై నియంత్రణ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు ప్రవాస భారతీయులకు(ఎన్నారై), భారత సంతతికి చెందిన వ్యక్తులకు(పీఐఓ), విదేశాల్లో పౌరసత్వం తీసుకున్న భారతీయులకు(ఓఐసీ) సరోగసీ ప్రక్రియను అనువర్తింపజేయడానికి అప్పుడప్పుడు జారీ చేసే సర్క్యులర్లు మినహా ఇన్నేళ్లుగా ఎలాంటి చట్టమూ లేదు. భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) 2005లో వైద్యపరమైన మార్గదర్శకాలు కూడా రూపొందించింది. వీటితో సమస్యేమంటే ఉల్లంఘనలు జరిగిన పక్షంలో చర్య తీసుకోవడం కుదరదు. అందుకు చట్టం ఉండాలి. దానికింద ఏర్పాటైన పర్యవేక్షణ యంత్రాంగం ఉండాలి. బిల్లు రూపొంది చట్టమైతే ఈ సరోగసీ సాలెగూటిలో చిక్కుకునే అసహాయ మహిళలకు ఆసరగా ఉంటుందని మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుతున్నా ఆ విషయంలో జాప్యం జరుగుతోంది. రెండేళ్లక్రితం కేంద్ర కేబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత దాన్ని పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం అనేక సవరణలు సూచించింది. అయితే ఇప్పుడు లోక్‌సభ ఆమోదించిన బిల్లును గమనిస్తే వీటిలో కీలకమైన అంశాలను ప్రభుత్వం విస్మరించిందని అర్ధమవుతుంది. వైద్యపరంగా తాము సంతానం కనడం అసాధ్యమని తేలిన దంపతులు ఈ సరోగసీ విధానాన్ని ఆశ్రయిస్తారు. ఇందుకోసం సిద్ధపడే మహిళ అలాంటి దంపతులకు సన్నిహిత బంధువై ఉండాలని తాజా బిల్లు నిర్దేశిస్తోంది. అదే ‘నిస్వార్థమైన’ సరోగసీ అవుతుందని పేర్కొంటున్నది. బిడ్డను కనే మహిళకయ్యే వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము అందజేయాలి తప్ప ఇతరత్రా డబ్బు ఇవ్వడం వాణిజ్యపరమైన సరోగసీ కిందకు వస్తుందని చెబుతోంది. సన్నిహిత బంధువులైతే డబ్బు ప్రమేయం ఉండదని ప్రభుత్వం ఉద్దేశం కావొచ్చు. కానీ మన పితృస్వామిక సమాజంలో ఇప్పటికీ మగవాడిదే పెత్తనం. అతడు తన సోదరుడి కోసమో, సోదరి కోసమో, ఇతర సన్నిహిత బంధువుల కోసమో సరోగసీకి అంగీ కరించాలని భార్యపై ఒత్తిడి తెస్తే ఆ మహిళకు లభ్యమయ్యే రక్షణ గురించి ఇది మాట్లాడటం లేదు. ఆమె స్వచ్ఛంద అంగీకారం తెలిపినట్టు నిర్ణయించేదెవరు? ఇలాంటి సందర్భాల్లో అయినవాళ్లకు ‘సాయం’ చేసిన భావన మగవాడికి కలుగుతుంది. బిడ్డను పొందిన దంపతులు సంతోషంగా ఉంటారు. సరోగసీకి తోడ్పడిన క్లినిక్‌కు కాసుల వర్షం కురుస్తుంది. కానీ తొమ్మిది నెలలు గర్భం మోసిన మహిళకు మందులు, ఇంజెక్షన్లు, కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స తప్ప మరేం మిగలదు. ప్రసవ సమయంలో కొందరికి మధుమేహం రావొచ్చు. మరికొందరు అధిక రక్తపోటు బారిన పడొచ్చు. ప్రసవానంతరం ఎదురయ్యే ఇతర ఆరోగ్య సమస్యలు ఆమెను జీవితాంతం వెంటాడే ప్రమాదం ఉంటుంది. పైగా ‘సన్నిహిత బంధువుల’ నిబంధన పరోక్షంగా కుల చట్రాన్ని మాత్రమే గుర్తిస్తోంది. ఈ సరోగసీ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే మహిళ యోగక్షేమాల గురించి, ఆమెకుండే రక్షణ గురించి బిల్లు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వాణిజ్యపరమైన సరోగసీ ఉండరాదన్న కేంద్రం ఆత్రుత మంచిదే కావొచ్చుగానీ అది ఎంతవరకూ ఆచరణ సాధ్యమో ఆలోచించినట్టు లేదు. దాన్ని సంపూర్ణంగా నిషేధించటం వల్ల ఆ రంగంలో చీకటి వ్యాపారం పెరుగుతుంది. డబ్బు కోసం సరోగసీకి సిద్ధపడే మహిళకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా గర్భస్రావమైనా, పుట్టిన బిడ్డకు వైకల్యమున్నా ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం నుంచి అవతలివారు తప్పుకునే ప్రమాదం ఉంటుంది. నిరుడు జూన్‌లో తెలంగా ణలోని భువనగిరిలో 50మంది గర్భిణుల్ని నిర్బంధంలో ఉంచిన వైనం వెల్లడైనప్పుడు అందరూ విస్మయపడ్డారు. వీరంతా ఈశాన్య రాష్ట్రాలనుంచి, నేపాల్నుంచి తరలించిన మహిళలు. వాస్తవా నికి ఒకో సరోగసీలో క్లినిక్‌కు దాదాపు రూ. 30 లక్షలు ముడుతుంటే అందులో గర్భిణికి దక్కేది కేవలం రూ. 3 లక్షలు. మిగతాదంతా వైద్య నిపుణులకు, దళారులకు వెళ్తుంది. దానికి బదులు వాణిజ్యపరమైన సరోగసీకి తగిన నియంత్రణలు విధించి ఉంటే ఉత్తమంగా ఉండేది. డబ్బు ఆశించి సరోగసీకి సిద్ధపడటం మహాపాపమన్న భావన ప్రభుత్వానికి ఉండొచ్చుగానీ, నిరుపేద మహిళకు దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. పైగా ఆమెను చీకటి వ్యాపార చట్రంలోకి నెడుతుంది. ఏ రక్షణా లేకుండా చేస్తుంది. అంతేకాదు... చట్టవిరుద్ధ సరోగసీ అని నిర్ధారణ అయితే క్లినిక్ నిర్వా హకులు, దళారీలతోపాటు ఆమె కూడా దోషిగా మారి పదేళ్ల జైలు అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో మరో లోపం ఏమంటే దంపతులు ఆడ, మగ అయిన పక్షంలోనే వారు సరోగసీకి అర్హులు. ఇటీవలే మన సుప్రీంకోర్టు స్వలింగసంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. ఈ బిల్లు అటువంటి దంపతుల్ని అనర్హులంటోంది. కనీసం ఒకటి రెండు రోజులపాటు బిల్లుపై చర్చ జరిగితే ఇలాంటి సమస్యలు మరెన్నో వెలుగుచూసేవి. కానీ ఆదరాబాదరాగా చర్చ ముగించి బిల్లును ఆమోదించడం, మున్ముందు చట్టంగా రావడం ఎవరి ప్రయోజనాలకు తోడ్పడుతుంది? -
‘ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదా?’
ముంబై: కేంద్రం ఆమోదించిన సరోగసీ(అద్దెగర్భం) బిల్లు ముసాయిదాను బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. పౌరుల స్వేచ్ఛను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ‘మేమేం తినాలో మీరే చెబుతున్నారు. మేము ఎటువంటి బట్టలు ధరించాలో కూడా చెబుతున్నారు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా చెప్పేందుకు ఇప్పుడు రెడీ అయ్యార’ని ఫరాఖాన్ అన్నారు. 43 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా ఒకేసారి ముగ్గురు పిల్లలకు ఫరాఖాన్ జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సరోగసీ ముసాయిదా బిల్లుతో సరోగసీ మహిళల హక్కులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఫరాఖాన్ అభిప్రాయపడ్డారు. పెళ్లైన దంపతులను మాత్రమే సరోగసీకి అనుమతిస్తామని చెప్పడం, అదికూడా ఐదేళ్ల తర్వాతే అని బిల్లులో పొందుపరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దంపతులు ఐదేళ్ల వరకు పిల్లల్ని కనకూడదని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించారు. కరీనా కపూర్ కూడా సరోగసీ బిల్లుపై ఇంతకుముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అద్దెగర్భం ద్వారా శిశువులకు జన్మనిచ్చిన మహిళల ప్రయోజనాలు కాపాడేందుకు, కమర్షియల్ సరోగసిని నియత్రించేందుకు ఈ బిల్లు రూపొందించినట్టు కేంద్రం తెలిపింది. -
కడుపు నింపుకోడానికే ఒళ్లు అమ్ముకుంటున్నారు: మంత్రి
మహిళలు కడుపు నింపుకోడానికే తమ శరీరాలు అమ్ముకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఉపయోగించుకోవాలి తప్ప.. ఇలా చేయకూడదని సరోగసీ బిల్లు గురించి మాట్లాడుతూ ఆమె ఇలా చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా కుటుంబాలు ఈ మహిళలతో వాళ్ల గర్భాలు అద్దెకు ఇచ్చేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని ఆమె అన్నారు. వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారని చెప్పారు. జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అనుప్రియా పటేల్ అన్నారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది. అయితే.. దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అంటున్నారు. దీనివల్ల అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని, నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లు థాయ్‌లాండ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కాలేజిలో చదివిన అనుప్రియా పటేల్.. అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్నారు. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఆమె అంటున్నారు. -
సరోగసీ బిల్లు! ఆమిర్, షారుఖ్‌కు సుష్మా చురకలు
న్యూఢిల్లీ: పిల్లలు లేని దంపతులకు వైద్యశాస్త్రం అందించిన వరం అద్దె గర్భం (సరోగసీ) విధానం. అయితే, ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద ఎత్తున వ్యాపారం సాగుతున్న నేపథ్యంలో.. ఈ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం సరోగసి చట్టాన్ని తీసుకువస్తున్నది. బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. సరోగసీ కోసం పిల్లలు లేని దంపతులు ఇతర మహిళల గర్భాలను అద్దెకు తీసుకోవడం కుదరదు. ఇందుకోసం వారు తమ బంధువులు, లేదా తెలిసిన వారి సహాయం మాత్రమే తీసుకొనే అవకాశం ఉంటుంది. 'వాణిజ్య సరోగసీపై పూర్తి నిషేధం ఉంటుంది. వైద్యపరంగా పిల్లలు పొందలేని దంపతులు తమ సన్నిహిత బంధువుల సాయం తీసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని పొందొచ్చు. దీనిని అల్ట్రుయిస్టిక్ సరోగసీ అంటారు' అని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ విలేకరులకు తెలిపారు. ఈ బిల్లుప్రకారం విదేశీయులు, ప్రవాస భారతీయులు, సింగల్ పెరెంట్, సహజీవనం చేసే దంపతులు, స్వలింగ సంపర్కులు సరోగసీ విధానం ద్వారా పిల్లలు పొందడానికి ఇకమీదట అనుమతించబోరు. 'ఓ జంట పెళ్లిచేసుకొని, కనీసం ఐదేళ్లు కలిసి జీవిస్తేనే' సరోగసీ విధానం అనుమతిస్తామని, వారికి ఇప్పటికే ఓ సంతానం ఉంటే ఇందుకు అనుమతించబోమని సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. సెలబ్రిటీలకు సుష్మా చురకలు! తాజాగా తీసుకొచ్చిన సరోగసి బిల్లులో సెలబ్రిటీలకు ఎలాంటి మినహాయింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్లకు ఇద్దరేసి సంతానం ఉన్నా.. సరోగసి విధానం ద్వారా మరో బిడ్డను పొందిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న మరో బాలీవుడ్ హీరో తుషార్ కపూర్ కూడా సరోగసీ విధానంలో బిడ్డను కన్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి విధానాలను ఇకముందు అనుమతించబోమని కేంద్రం తాజా బిల్లుతో తేల్చిచెప్పింది. మీడియా సమావేశంలో ఈ సెలబ్రిటీల పేర్లను సుష్మా ప్రస్తావించకపోయినా.. వారికి పరోక్షంగా చురకలు అంటించారు. 'ఇద్దరేసి పిల్లలు ఉన్నప్పటికీ సెలబ్రిటీలు సరోగసీ ద్వారా మరో బిడ్డను కన్నారు. వాళ్ల భార్యలు పిల్లల్ని గర్భంలో మోసే బాధను పొందలేరు కనుక వేరే మహిళల మీద ఆ భారాన్ని మోపారు' అని సుష్మా పేర్కొన్నారు. అదేవిధంగా అద్దెగర్భాన్ని మోసినందుకు సన్నిహిత బంధువు అయిన మహిళకు వైద్యఖర్చులు మాత్రమే చెల్లించాలని, అంతేకానీ ఎక్కువమొత్తంలో ఆశ చూపకూడదని ఈ బిల్లు స్పష్టం చేస్తున్నది.