లోపాల ‘సరోగసీ’ బిల్లు | Sakshi Editorial On Surrogacy Bill | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 21 2018 12:37 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

Sakshi Editorial On Surrogacy Bill

సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడే దంపతులకు వరంగా ఉండే అద్దె గర్భం(సరోగసీ) విధానానికి అనుసరించాల్సిన నిబంధనలతో రూపొందిన బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. గందరగోళ పరిస్థితుల మధ్య కొద్దిసేపు జరిగిన చర్చతోనే బిల్లు ఆమోదం పొందడం విచారకరం. అద్దె గర్భం ప్రక్రియ మన దేశంలో గత పద్దెనిమిదేళ్లుగా అమల్లో ఉంది. ఏ నియంత్రణా లేనందువల్ల ఇది అనేక సమస్యలకు కూడా దారితీస్తోంది. ముఖ్యంగా ఇందుకు అంగీకరించే మహిళలు ఆరోగ్య సమస్యలు మొదలుకొని ఆర్థిక దోపిడీ వరకూ అనేకం ఎదు ర్కొంటున్నారు. సరోగసీ ద్వారా బిడ్డల్ని పొందే సాంకేతికతను అమలు చేస్తున్న క్లినిక్‌లపై నియంత్రణ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు ప్రవాస భారతీయులకు(ఎన్నారై), భారత సంతతికి చెందిన వ్యక్తులకు(పీఐఓ),  విదేశాల్లో పౌరసత్వం తీసుకున్న భారతీయులకు(ఓఐసీ) సరోగసీ ప్రక్రియను అనువర్తింపజేయడానికి అప్పుడప్పుడు జారీ చేసే సర్క్యులర్‌లు మినహా ఇన్నేళ్లుగా ఎలాంటి చట్టమూ లేదు.

భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) 2005లో వైద్యపరమైన మార్గదర్శకాలు కూడా రూపొందించింది. వీటితో సమస్యేమంటే ఉల్లంఘనలు జరిగిన పక్షంలో చర్య తీసుకోవడం కుదరదు. అందుకు చట్టం ఉండాలి. దానికింద ఏర్పాటైన పర్యవేక్షణ యంత్రాంగం ఉండాలి. బిల్లు రూపొంది చట్టమైతే ఈ సరోగసీ సాలెగూటిలో చిక్కుకునే అసహాయ మహిళలకు ఆసరగా ఉంటుందని మహిళా సంఘాలు, మానవహక్కుల సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు ఎప్పటినుంచో కోరుతున్నా ఆ విషయంలో జాప్యం జరుగుతోంది. రెండేళ్లక్రితం కేంద్ర కేబినెట్‌ ఈ బిల్లును ఆమోదించింది. ఆ తర్వాత దాన్ని పరిశీలించిన పార్లమెంటరీ స్థాయీ సంఘం అనేక సవరణలు సూచించింది. అయితే ఇప్పుడు లోక్‌సభ ఆమోదించిన బిల్లును గమనిస్తే వీటిలో కీలకమైన అంశాలను ప్రభుత్వం విస్మరించిందని అర్ధమవుతుంది.

వైద్యపరంగా తాము సంతానం కనడం అసాధ్యమని తేలిన దంపతులు ఈ సరోగసీ విధానాన్ని ఆశ్రయిస్తారు. ఇందుకోసం సిద్ధపడే మహిళ అలాంటి దంపతులకు సన్నిహిత బంధువై ఉండాలని తాజా బిల్లు నిర్దేశిస్తోంది. అదే ‘నిస్వార్థమైన’ సరోగసీ అవుతుందని పేర్కొంటున్నది.  బిడ్డను కనే మహిళకయ్యే వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము అందజేయాలి తప్ప ఇతరత్రా డబ్బు ఇవ్వడం వాణిజ్యపరమైన సరోగసీ కిందకు వస్తుందని చెబుతోంది. సన్నిహిత బంధువులైతే డబ్బు ప్రమేయం ఉండదని ప్రభుత్వం ఉద్దేశం కావొచ్చు. కానీ మన పితృస్వామిక సమాజంలో ఇప్పటికీ మగవాడిదే పెత్తనం. అతడు తన సోదరుడి కోసమో, సోదరి కోసమో, ఇతర సన్నిహిత బంధువుల కోసమో సరోగసీకి అంగీ కరించాలని భార్యపై ఒత్తిడి తెస్తే ఆ మహిళకు లభ్యమయ్యే రక్షణ గురించి ఇది మాట్లాడటం లేదు. ఆమె స్వచ్ఛంద అంగీకారం తెలిపినట్టు నిర్ణయించేదెవరు? ఇలాంటి సందర్భాల్లో అయినవాళ్లకు ‘సాయం’ చేసిన భావన మగవాడికి కలుగుతుంది.

బిడ్డను పొందిన దంపతులు సంతోషంగా ఉంటారు. సరోగసీకి తోడ్పడిన క్లినిక్‌కు కాసుల వర్షం కురుస్తుంది. కానీ తొమ్మిది నెలలు గర్భం మోసిన మహిళకు మందులు, ఇంజెక్షన్లు, కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స తప్ప మరేం మిగలదు. ప్రసవ సమయంలో కొందరికి మధుమేహం రావొచ్చు. మరికొందరు అధిక రక్తపోటు బారిన పడొచ్చు. ప్రసవానంతరం ఎదురయ్యే ఇతర ఆరోగ్య సమస్యలు ఆమెను జీవితాంతం వెంటాడే ప్రమాదం ఉంటుంది. పైగా ‘సన్నిహిత బంధువుల’ నిబంధన పరోక్షంగా కుల చట్రాన్ని మాత్రమే గుర్తిస్తోంది. ఈ సరోగసీ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే మహిళ యోగక్షేమాల గురించి, ఆమెకుండే రక్షణ గురించి బిల్లు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

వాణిజ్యపరమైన సరోగసీ ఉండరాదన్న కేంద్రం ఆత్రుత మంచిదే కావొచ్చుగానీ అది ఎంతవరకూ ఆచరణ సాధ్యమో ఆలోచించినట్టు లేదు. దాన్ని సంపూర్ణంగా నిషేధించటం వల్ల ఆ రంగంలో చీకటి వ్యాపారం పెరుగుతుంది. డబ్బు కోసం సరోగసీకి సిద్ధపడే మహిళకు అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా గర్భస్రావమైనా, పుట్టిన బిడ్డకు వైకల్యమున్నా ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం నుంచి అవతలివారు తప్పుకునే ప్రమాదం ఉంటుంది. నిరుడు జూన్‌లో తెలంగా ణలోని భువనగిరిలో 50మంది గర్భిణుల్ని నిర్బంధంలో ఉంచిన వైనం వెల్లడైనప్పుడు అందరూ విస్మయపడ్డారు. వీరంతా ఈశాన్య రాష్ట్రాలనుంచి, నేపాల్‌నుంచి తరలించిన మహిళలు. వాస్తవా నికి ఒకో సరోగసీలో క్లినిక్‌కు దాదాపు రూ. 30 లక్షలు ముడుతుంటే అందులో గర్భిణికి దక్కేది కేవలం రూ. 3 లక్షలు. మిగతాదంతా వైద్య నిపుణులకు, దళారులకు వెళ్తుంది. దానికి బదులు వాణిజ్యపరమైన సరోగసీకి తగిన నియంత్రణలు విధించి ఉంటే ఉత్తమంగా ఉండేది.

డబ్బు ఆశించి సరోగసీకి సిద్ధపడటం మహాపాపమన్న భావన ప్రభుత్వానికి ఉండొచ్చుగానీ, నిరుపేద మహిళకు దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. పైగా ఆమెను చీకటి వ్యాపార చట్రంలోకి నెడుతుంది. ఏ రక్షణా లేకుండా చేస్తుంది. అంతేకాదు... చట్టవిరుద్ధ సరోగసీ అని నిర్ధారణ అయితే క్లినిక్‌ నిర్వా హకులు, దళారీలతోపాటు ఆమె కూడా దోషిగా మారి పదేళ్ల జైలు అనుభవించాల్సి ఉంటుంది. ఇందులో మరో లోపం ఏమంటే దంపతులు ఆడ, మగ అయిన పక్షంలోనే వారు సరోగసీకి అర్హులు. ఇటీవలే మన సుప్రీంకోర్టు స్వలింగసంపర్కం నేరం కాదని తీర్పునిచ్చింది. ఈ బిల్లు అటువంటి దంపతుల్ని అనర్హులంటోంది. కనీసం ఒకటి రెండు రోజులపాటు బిల్లుపై చర్చ జరిగితే ఇలాంటి సమస్యలు మరెన్నో వెలుగుచూసేవి. కానీ ఆదరాబాదరాగా చర్చ ముగించి బిల్లును ఆమోదించడం, మున్ముందు చట్టంగా రావడం ఎవరి ప్రయోజనాలకు తోడ్పడుతుంది?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement